అడ్డంగా దొరికిపోయారా?!
posted on Mar 10, 2023 @ 2:44PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 10) సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే అంతకు ముందు రోజు ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని... అదేవిధంగా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని.. ఈ నేపథ్యంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని వైయస్ అవినాష్ రెడ్డి కోరారు.
దీనిని బట్టి చూస్తుంటే.. ఈ హత్య కేసులో అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందా? అడ్డంగా దొరికిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్నట్లుగా ఉందని.. ఆ క్రమంలో ఆయనలో భయం వ్యక్తమవుతోన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. మరోవైపు... వివేకా కుమార్తె సునీత సైతం తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి పిటిషన్‌లో తనను ఇంప్లిడ్ చేయాలని కోరారు. దీంతో అవినాష్ రెడ్డిని సీబీఐ ఏం విచారిస్తుందో ఏమో కానీ.. ఈ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాలపైనే అందరు తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
అసలు వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో నాటి ప్రతిపక్ష నేత జగన్ పులివెందుల్లో వివేకా కుమార్తె వైయస్ సునీత సమక్షంలో చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడడం.. దీంతో తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తెల్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సోదరి వైయస్ సునీత, సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి.. కోరడం.. ఆ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఖిన్నురాలై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతోపాటు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం... అలా ఈ కేసు సీబీఐ చేత్లులోకి వెళ్లడం.. ఆ తర్వాత వైయస్ వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి... ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల పేర్లు సీబీఐకి వెల్లడించడంతోపాటు ఈ కేసుకు సూపారీ కింద 40 కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు పేర్కొనడం..
అనంతరం ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం.. అలాంటి ఒకానొక సమయంలోవైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు ఎన్ రాజశేఖరరెడ్డిలే ఈ హత్య చేయించారంటూ ఆరోపణలు ఎదుర్కోవడం.. అలాగే సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరగడం.. అదే విధంగా సీబీఐ అధికారుల కారు డ్రైవర్‌ను కడప వదిలి వెళ్లాలంటూ ఆగంతకులు బెదిరించడం.. మరోవైపు ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉండడం.. సరిగ్గా ఆ సమయంలోనే కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మారడం... అదే సెంట్రల్ జైల్‌లో ఉన్న వైయస్ వివేకా హత్య కేసులో నిందితులకు ప్రాణానికి హాని ఉందంటూ ... ప్రతిపక్ష టీడీపీ రంగంలోకి దిగి.. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు గుప్పించడం..
దీంతో జగన్ ప్రభుత్వం సదరు జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడం.. ఆ తర్వాత వివేకా హత్య కేసు దర్యాప్తు ఒకానొక దశలో ఆగిపోవడం.. దాంతో వివేకా కుమార్తె సునీత మళ్లీ రంగంలోకి వచ్చి.. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. అలా ఈ కేసు... తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం.. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు ముమ్మరం కావడం... ఆ క్రమంలో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం.. అలా విచారణకు హాజరైన అవినాష్ కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించి.. వివేకా హత్య జరిగిన సమయంలో.. అంతకు ముందు.. ఆ తర్వాత పోన్ కాల్స్ వెళ్లిన జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలించడం.. ఆ క్రమంలో రెండు నెంబర్లకు పలుమార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు గుర్తించిన సీబీఐ అధికారులు ఆ నెంబర్లపై ప్రశ్నల వర్షం కురిపించడం.. అలా నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ పీఏ నవీన్ పేర్లు బయటకు రావడం.. వారిద్దరికి వెంటనే సీబీఐ నోటీసులు ఇవ్వడం..
ఈ ఇద్దరిని కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించడం.. ఆ తర్వాత అవినాష్ రెడ్డిని మళ్లీ సీబీఐ విచారణకు రావాలని పిలువడం.. అలా పిలిచిన 10 రోజులకే మరోసారి ఈ కేసు విచారణకు రావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి నోటీసులు జారీ చేయడం.. అలా వైయస్ భాస్కర్ రెడ్డి కడప జైలుల్లో మార్చి 12న విచారణకు హాజరుకానున్నారు. ఈ వివేకా హత్య కేసులో ఈ మొత్తం ఎపిసోడ్‌లో తెరచాటు సూత్రదారులు ఎవరు అనేది ఇప్పటికే సీబీఐకి క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఈ విషయం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి కూడా అర్థమైందని అందుకే తెలంగాణ హైకోర్టును అంత కంగారుగా ఆశ్రయించారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కల్‌లో దూసుకుపోతోంది.