అమరావతికి రైల్ కనెక్టివిటీ దేనికి సంకేతం?
posted on Mar 10, 2023 @ 1:31PM
అమరావతి.. ఆంధ్రుల కలల రాజధాని. 2015లో అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏపీ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 217 చ.కి.మీ.ల విస్తీర్ణంలో అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి విజన్ తయారు చేశారు. రైతులను ఒప్పించి 30 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేశారు. అమరావతిలో రూ.40 వేల కోట్లకుపైగా అంచనాలతో టెండర్లు పిలిచారు. దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టారు.
చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన అమరావతి నగర డిజైన్లు ఆహా అనిపించాయి. దేశంలోని ఏ మహానగరానికీ తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి వస్తుందని రాష్ట్ర ప్రజలు భావించారు. తమ కలల రాజధాని కల సాకారం అవుతున్న దన్న ఆనందం రాష్ట్ర ప్రజలలో వ్యక్తమైంది. అయితే ఎప్పుడైతే 2019 ఎన్నికల అనంతరం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి అమరావతి ప్రభ మసకబారింది. అప్పటి వరకూ కళకళలాడిన అమరావతి బోసిపోయింది. జగన్ సర్కార్ అక్కడ కొనసాగుతున్న నిర్మాణాలను ఆపేసింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. భూ సమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన పనులు.. వేలమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిష్ఫలంగా మిగిలిపోయాయి.
రోడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో.. అవి పూర్తిగా పాడైపోయాయి. రోడ్లను తవ్వి కంకర కూడా దోచుకెళ్లారు దుండగులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ సర్కార్ విశాఖ రాజధాని అంటూ అమరావతికి కనెక్టివిటీకి ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టులను పట్టించుకో కపోయినా.. ఇప్పుడు రైల్వే శాఖ ఆ ప్రాజెక్టులను సొంతంగానే చేపట్టాలని నిర్ణయించింది. అమరావతి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. విజయవాడ బైపాస్ రైల్వేలైన్ కింద దీన్ని రైల్వే శాఖ నిర్మించనుంది. తెలుగుదేశం హయాంలో కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నూతన రైలు మార్గం సర్వేకు బడ్జెట్ కేటాయించారు. సర్వే ప్రక్రియను కూడా పూర్తిచేశారు. విజయవాడ -గుంటూరులను అమరావతి మీదుగా అనుసంధానంగా చేసేందుకు రూ.2800 కోట్ల అంచనా వ్యయంతో నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. 2017-18 బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
అయితే అదంతా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత మూలన పడిపోయింది. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ అమరావతికి కనెక్టివిటీని పెంచేందుకు రైల్వే శాఖ నడుంబిగించింది. అమరావతి విషయంలో కేంద్రం ఇటీవల పార్లమెంటులో, కోర్టుకు ఇచ్చిన నివేదికలో అమరావతికి అనుకూలంగా కేంద్ర స్పందించడం, ఇప్పుడు రైల్వే శాఖ అమరావతి కనెక్టివిటీ విషయంలో అడుగు ముందుకు వేయడంతో రాష్ట్ర ప్రజలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇప్పటికీ జగన్ అమరావతి కాదు అనే అంటున్నారు. ఇటీవల విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా త్వరలో తాను విశాఖ నుంచి పాలన సాగించబోతున్నట్లుగా విస్పష్టంగా ప్రకటించారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా జగన్ ఇలా ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్న, మరో వైపు జగన్ ఇలా ప్రకటించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్న వాదన ఉన్నాయి.
అయినా వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇటీవల పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఏపీ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగిందనీ, దానిని మార్చాలంటే మళ్లీ పార్లమెంటులో చట్టం చేయాల్సిందేనన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో జగన్ చెబుతున్నట్లుగా మూడు రాజధానులు, అమరావతి నుంచే పాలన సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కేంద్రం ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలోనే అమరావతికి రైల్వే కనెక్టివిటీ విషయంలో రైల్వే శాఖ ఒక అడుగు ముందుకు వేయడం శుభపరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.