పోటాపోటీ దీక్షలు.. అక్కడ కవిత.. ఇక్కడ కమలం!
posted on Mar 10, 2023 6:17AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఢిల్లీలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది అయన రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మరో అవినీతి కేసులో అరెస్టయిన మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. ఆ ఇద్దరి స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషీ సీఎం కేజ్రీవాల్ కేబినెట్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వీరిద్దరితో సీఎం కేజ్రీవాల్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. సిసోడియా నిర్వహించిన విద్యాశాఖతో పాటు పబ్లిక్ వర్క్స్ విద్యుత్, పర్యాటక శాఖలను అతిషీ చూడనున్నారు. అలాగే, గతంలో జైన్ చూసిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమల శాఖలను ఇక నుంచి భరద్వాజ్ నిర్వహించనున్నారు.
అంటే,ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు ఢిల్లీలో పెద్దగా కనిపించడం లేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ కేసులు, ఆరోపణలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చట్టం తనపని తాను చేసుకుపోతుందనే విధంగా నింపాదిగా, తమ పని తాము చేసుకుంటున్నారు. ఒక విధంగా కేజ్రీవాల్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పట్లో ఎన్నికలు లేక పోవడం ఒకటైతే, స్కామ్ లో చిక్కున్న మాజీ మంత్రి సిసోడియా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు కాకపోవడం వలన మద్యం మరక గురించి ఆయన అంత పెద్దగా పట్టించుకున్నట్లు లేదని అంటున్నారు.
కానీ, తెలంగాణలో మాత్రం రాజకీయం మొత్తం ఢిల్లీ మద్యం కేసు, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర చుట్టూనే తిరుగుతోంది. మరో వంక శనివారం(మార్చి10) అధికార బీఆర్ఎస్ విస్త్రుత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో ఉత్కంఠ చోటు చేసుకుంది.
ఆలాగే బీఆరేస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపడుతుండగా.. ఆమెకు దీటుగా హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. వీధుల కెక్కాయి.