వారాహిలో బందరు కు జనసేనాని
posted on Mar 10, 2023 9:24AM
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఈ నెల 14న మచిలీపట్నం వేదికగా జరగనుంది. ఇందుకు సన్నాహాలు, ఏర్పాట్లూ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. బందర్ సభను జనసేన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆ పార్టీ ఆవిర్భావ సభ కు స్థలం ఇవ్వడమే నేరంగా భావించిన అధికార పార్టీ ఇప్పటంలో జనసేన సభకు ఇచ్చిన వారి గృహాలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేవేతలకు పాల్పడటం, జనసేనానికి సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి పేర్ని నాని వ్యూహం ప్రకారం జనసేనానిపై విమర్శలు గుప్పించడం తో జనసేనాని ఈ సారి పార్టీ ఆవిర్భావ సభ ను బందర్ వేదికగా నిర్వహించి అన్ని విమర్శలకూ దీటుగా బదులివ్వాలని నిర్ణయానికి వచ్చారు.
అయితే సభా వేదికపై నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు.. ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఈ నెల 14న బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా పేర్నినాని తదితరుల విమర్శలకు దీటుగా బదులివ్వడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో పొత్తు విషయంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక క్లారిటీ ఇస్తారని పరిశీలకులు అంటున్నారు. సరైన సమయంలో సరైన వేదిక మీద నుంచి తన మాటల తూటాలను ప్రత్యర్థులపై గురి చూసి వదలడంలో పవన్ కల్యాణ్ ముందుంటారని ఆయన అభిమానులకే కాదు, రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు.
ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిందన్న భావన సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు వేదికల మీదనుంచి జనసేనాని కూడా ఇదే విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. మరో సారి జగన్ ను అధికారంలోకి రానివ్వను, అందు కోసం విపక్ష ఓట్లు చీలకుండా చూస్తాను అని పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పారు. అప్పటి నుంచి ఆయన అడుగులు ఓట్లు చీలకుండా చూడటం దిశగానే సాగాయి. ఈ నేపథ్యంలోనే వచ్చేఅసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
పరిశీలకుల విశ్లేషణల ప్రకారంఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులకు కలిసే పని చేస్తున్నాయి. పొత్త వార్తలను ఇటు జనసేన కానీ, అటు తెలుగుదేశం కానీ ఖండించ లేదు. ఇక బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆ షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాన్ ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే బీసీ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12వతేదీన కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, అలాగే ఆ సమాజిక వర్గానికి చెందిన ఇతర నేతలతో భేటీ అవుతారు.
ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న పవన్ కల్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అవుతారు. ఇక బందర్ లో జరిగే జనసేన ఆవిర్భావ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో రానున్నారు. అవసరం ఉన్నా లేకున్నా సందర్భం ఉన్నా లేకున్నా మీడియా సమావేశం పెట్టి మరీ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరుగుతుండడం, అలాగే పవన్ వారాహి వాహనంతో మచిలీపట్నంలో ప్రవేశించనుండడం తో జనసేన ఆవిర్భావ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.