హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి సానియా మిర్జా ? 

హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మహిళను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తుందా? మతపర సెంటిమెంట్ తో ఎన్నికల బరిలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాధవీలత ఉండటంతో ముస్లింలు వోట్లతో  గెలుపొందడానికి కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోందా అంటే ఔననే సమాధానం వస్తుంది. తొలుత అలీ బిన్ మస్కతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇటీవలె  మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో స్నేహ సంబంధాలు కొనసాగించడంతో అధిష్టానం వెనకడుగు వేసింది. అలీ బిన్ మస్కతీ పోటీ చేస్తే ముస్లింవోట్లు చీలిపోతాయని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. కెసీఆర్ ప్రభుత్వానికి సహకారం అందించిన మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దత్తు పలుకుతోంది.  హైదరాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేయనుండటంతో, దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన టెన్నిస్ తార సానియాను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించాలని అధిక సంఖ్యలో అభిమానులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన విషయం విదితమే. దీంతో ఆమె పలుకుబడిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని అభిమానులతో సహా హైదరాబాద్ లోక్‌సభకు చెందిన మహిళా ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.ఇటీవలె రాజ్య సభకు ఎంపికైన అనిల్ కుమార్ యాదవ్ సానియా మిర్జాకు అత్యంత సన్నిహితుడు కావడంతో హైదరాబాద్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. సానియా మిర్జా పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్  కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి సహకారం అందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2003 నుంచి టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రస్థానం మొదలు పెట్టి. అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచి దేశానికి కీర్తిని తెచ్చి పెట్టింది. అంతే కాకుండా సానియా మీర్జా సోదరి అనం మీర్జా క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కోడలుగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో సానియాకు పలుకుబడి కూడా ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అంతేకాకుండా 2021లో వైఎస్ కూతురు… షర్మిల వైఎస్సార్డీపీ అధ్యక్షురాలుగా ఉన్నపుడు మర్యాద పూర్వకంగా కలవడం, ఆపై షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ హోదాలో ఉండటంతో సానియాను హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజారుద్దీన్ కూడా సానియా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సలహాలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సైతం సానియా మీర్జా హైదరాబాద్ లోక్సభస్థానానికి తమ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థినే బరిలోకి దించాలన్న ఏకాభిప్రాయానికి దాదాపు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరా బాద్ అభ్యర్థిగా సానియా మీర్జా టిక్కెట్ ఖరారైతే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలే పోటీ చేస్తే, మహిళల చేతుల్లో ఓటమికి గురికాకూడదని మజ్లిస్ జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో పాటు మజ్లిస్ పార్టీకి మిత్రపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇదే స్థానం నుంచి బరిలోకి పార్టీ అధిష్టానం దించడం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అయోమయానికి గురిచేస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల వేడి పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుకు పైగా స్థానాల్లో ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ పార్టీ మరింత పట్టును పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న మజ్లిస్.. బీజేపీ ఆధీనంలో ఉన్న గోషా మహల్ నియోజకవర్గంలో సైతం పట్టుకు పాగా వేసినట్లు సమాచారం. గత నలభై ఏళ్లుగా హైదరాబాద్ లోక్సభపై ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ యథావిధిగా పతంగిని ఎగరేస్తుందా లేదా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరైనా గెలుస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

సోము కోసం పట్టు.. రాజమండ్రి సీటుపై కమలం కన్ను

తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ జత కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాన్చి నాన్చి చివరకు కూటమిలో తాను భాగమే అని ప్రకటించిన బీజేపీ ఆ తరువాత సీట్ల సర్దుబాటు విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీ వాస్తవ బలాన్ని పరిగణనలోనికి తీసుకుంటే పొత్తులో భాగంగా ఆ పార్టీకి దక్కిన అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ స్థానాలూ చాలా చాలా ఎక్కువన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయినా కూడా బీజేపీ పొత్తులో భాగంగా తమకు ఇంకా పెద్ద వాటా కావాలంటూ పట్టుబట్టడమే అనుమానాలకు తావిస్తున్నది. చివరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలూ, కార్యకర్తలూ కూడా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ఏమిటో? ఆ పార్టీకి ఉన్న ఓటు స్టేక్ ఏమిటో అందరికీ తెలిసిందే. గత ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు నోటాతో పోటీ పడిన విషయమూ విదితమే. అటువంటి పార్టీతో రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలూ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాయంటే  సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మరో సారి మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందన్న అంచనాతోనే. గత ఐదేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతి పాలైంది. రాష్ట్ర పునర్నిర్మానానికి, రాష్ట్ర ప్రగతికి కేంద్రం సహకారం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతోనే కొన్ని త్యాగాలకు సిద్ధపడి కూడా తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీతో జట్టు కట్టింది.  ఆ పార్టీ వాస్తవ బలాన్ని మించి స్థానాలను కూడా ఆ పార్టీకి పొత్తులో భాగంగా ఇచ్చింది.  అయితే సీట్ల విషయంలో  ఆ పార్టీ తెగేదాకా లాగుతున్నదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా ఆ పార్టీ తీరు ఉంది. పొత్తులో భాగంగా దక్కిన పది అసెంబ్లీ స్థానాలకే  బలమైన అభ్యర్ధులను నిలబెట్టే పరిస్థితి లేని బీజేపీ ఇప్పుడు అదనంగా మరో స్థానం కావాలని పట్టుబట్టడం,  నిన్నటి వరకూ రాష్ట్రంలో వైసీపీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోసం పట్టుబట్టడం చూస్తుంటే.. కొందరు అభ్యర్థులను ఆ పార్టీ వైసీపీని గెలిపించడం కోసం నిలబెడుతోందా అన్న అనుమానాలు బీజేపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. తమకు అదనపు సీటు కావాలనీ, అది కూడా సోము వీర్రాజు కోసం అనీ బీజేపీ కోరడంపై తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. అదీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి రాజమండ్రి నుంచి సోములు పోటీకి నిలిపేందుకు బీజేపీ రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ స్థానాన్ని కేటాయించాలని కోరడాన్ని తెలుగుదేశం, జనసేన శ్రేణులే కాదు, చివరాఖరికి రాష్ట్ర బీజేపీ  నేతలూ, కార్యకర్తలూ కూడా తప్పుపడుతున్నారు.  తాజాగా మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ కీలక భేటీలో పొత్తులో భాగంగా, మరొక అసెంబ్లీ సీటు కావాలని తెలుగుదేశం పార్టీని కోరాలని ఆ పార్టీ నిర్ణయించింది. అంతే కాదు తాము పదకొండు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టనున్నామని ఆ పార్టీ జాతీయ నేత సిద్దార్ద్‌నాధ్‌సింగ్  ఆ సమావేశంలో చెప్పిట్లు సమాచారం. ఆ అదనపు సీటు రాయలసీమలోని  తంబళ్లపల్లె లేదా రాజం పేటఇవ్వాలని బీజేపీ తెలుగుదేశం పార్టీని కోరుతోంది.  అదే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బదులు, రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ సీటు కావాలని బీజేపీ పట్టుబడుతోంది.  ఆ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే  తెలుగుదేశం ఇప్పటికే  అభ్యర్ధులను ప్రకటించేసింది. ఆ రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం తమకు కేటాయిస్తే అక్కడ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ  అధ్యక్షుడు సోము వీర్రాజును నిలబెడతామని చెబుతున్నది. దీంతోనే పొత్తులో భాగంగా బీజేపీ ఏదైనా బ్యాక్ స్టాబింగ్ వ్యూహం పన్నిందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. సోము వీర్రాజు కోసం పార్టీలోని ఒక వర్గంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడితోపాటు, బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కమలం శ్రేణులు అంటున్నాయి. మద్దతునిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే బీజేపీ కోరుతున్న రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేయడం,  ఏ మాత్రం ప్రజా మద్దతు లేని సోము కోసం ఆ సీటు త్యాగం చేయడం అయ్యేపని కాదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  అన్నిటికీ మించి సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాలలో సోము వీర్రాజు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు సత్సంబంధాలు లేవనీ, తాను ఏం మాట్లాడాలన్నా పార్టీ అధినాయకత్వంతోనే మాట్లాడతాననీ చెప్పిన సంగతి విదితమే. అలాగే సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీ వైసీపీకి బీటీమా అన్నట్లుగా వ్యవహరించారని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. సోము వీర్రాజు వంటి వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశాలు ఇసుమంతైనా ఉండవు. అయినా కూడా బీజేపీ సోము కోసం పట్టుబడుతోందంటే.. ఓటు ట్రాన్స్ ఫర్ కాకపోయినా ఫరవాలేదని భావిస్తోందా? అని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఓటు తెలుగుదేశం, జనసేనలకు ట్రాన్స్ ఫర్ కాకపోయినా ఆ రెండు పార్టీల అభ్యర్థులకూ వచ్చిన ఇబ్బందేమీ లేదు. అదే తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ ఫర్ కాకపోతే ఒక్క స్థానంలో కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉండవు.   అది తెలిసి కూడా బీజేపీ బలం లేని నేతలకే సీట్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతుండటం చూస్తుంటే.. ఆ పార్టీ ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే ఉందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. 

సాంకేతిక లోపంతో  మెట్రో రైళ్ల నత్తనడక 

సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో రైళ్ల వేగం మందగించింది. బుధవారం (మార్చి 27) ఉదయం నుంచి జంటనగర ప్రజలు మెట్రో రైళ్లు నెమ్మదిగా నడవడం, ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మెట్రో రైళ్లు సాంకేతిక లోపం కారణంగా తీవ్ర జాప్యం అవుతుండటంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులపై రద్దీ భారం పడింది.   ఉదయం  వేళల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు తమ గమ్య స్థానాలకు సకాలంలో చేరుకోలేక ఇబ్చేబందులు పడుతున్నారు. ఇక మెట్రో స్టేషన్లలో అయితే ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. వచ్చిన రైలులో ఎక్కే ప్రయాణీకులు, దిగే ప్రయాణీకుల మధ్య తోపులాటలు సైతం జరుగుతున్నాయి. కాగా సాంకేతిక లోపం కారణంగా రైళ్లు జాప్యం అవుతున్నందుకు చింతిస్తున్నామంటూ అనౌన్స్ చేస్తున్నారు.  

తెలుగుదేశం కూట‌మిదే హ‌వా .. శ్రీ ఆత్మసాక్షి సర్వే

ఏపీలో పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ అధికార పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్‌ పెరుగుతోంది. వైసీపీ అభ్య‌ర్థులు గెలుపుపై బ‌హిరంగంగా ధీమాను వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ లోలోపల ఓట‌మి భ‌యం వారిని వెంటాడుతోంది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల‌ పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో దాదాపు ఓట‌మి ఖాయ‌మ‌న్న భావ‌న‌కు వైసీపీ అభ్య‌ర్థులు వ‌చ్చిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నిప్ర‌ముఖ స‌ర్వే ఫ‌లితాల్లోనూ వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌టం ఖాయ‌మ‌ని తేలుతుండ‌టంతో జ‌గ‌న్ శిబిరంలో రోజురోజుకు ఆందోళ‌న పెరుగుతోంది. ఆ ఆందోళన నుంచే కొన్ని ఫేక్ సర్వేలను వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో పెడుతోంది. తద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేసేలా వైసీపీ నేత‌లు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ ఆత్మ‌సాక్షి స‌ర్వే ఫ‌లితాలు అంటూ  మూడు రోజుల క్రితం ఒక సర్వే  వెలుగులోకి వ‌చ్చింది. ఈ  స‌ర్వే ఫ‌లితాల్లో వైసీపీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. ఆ సర్వే శ్రీ ఆత్మ‌సాక్షి ఒరిజిన‌ల్ స‌ర్వే అంటూ వైసీపీ సోష‌ల్ మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని ప్ర‌ముఖ సంస్థ‌ల‌ స‌ర్వేల‌ ఫ‌లితాల్లో కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని తేలింది. కానీ, ఆత్మ‌సాక్షి స‌ర్వే అంటూ వైసీపీ నేత‌లు ప్రచారం చేసిన సర్వేలో మాత్రం వైసీపీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో ప్ర‌జల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆ సర్వే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్ర‌మంలో నే శ్రీ ఆత్మ‌సాక్షి తాజా స‌ర్వే ఫ‌లితాలు వెలుగులోకి రావ‌టంతో వైసీపీ నేత‌ల కుట్ర‌లు ఏమిటో మరోసారి తేటతెల్లమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డే కొద్దీ స‌ర్వేల‌పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరుగుతోంది. ఇప్ప‌టికే వెల్ల‌డైన ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నింటిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కూట‌మిదే విజ‌యం అని తేలింది. తాజాగా ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌ల్లో ఒక‌టైన శ్రీఆత్మ‌సాక్షి త‌మ స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ షాక్ త‌ప్ప‌ద‌ని సర్వే పేర్కొంది.   ఏపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితిని బ‌ట్టిచూస్తే జ‌గ‌న్ పార్టీకి 21 నుంచి 25 అసెంబ్లీ సీట్ల‌కు మించి రావ‌ని శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది. ఈ స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం. అధికార వైసీపీకి 41.5శాతం, కూట‌మికి 53.5 శాతం ఓటింగ్ న‌మోద‌వుతుంద‌ని తేలింది.  మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 136 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, 21 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక 18 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి, వైసీపీ అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని ఆ హోరాహోరీ స్థానాలలో కూడా  ప‌దికిపైగా స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులకే ఎడ్జ్ ఉంటుందనీ పేర్కొంది.  పార్ల‌మెంట్ ఫ‌లితాల్లోనూ కూట‌మిదే హ‌వా కొన‌సాగ‌నుంది. 25 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, రెండు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది. మూడు స్థానాల్లో కూట‌మి, వైసీపీ అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ రెండు స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థి, ఒక స్థానంలో వైసీపీ అభ్య‌ర్థికి ఎడ్జ్ ఉంటుందని ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది. ఉమ్మ‌డి జిల్లాల వారిగా  శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం వివరాలిలా ఉన్నాయి..  శ్రీ‌కాకుళం ఉమ్మ‌డి జిల్లాలోని  10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  విజ‌య‌న‌గ‌రం ఉమ్మ‌డి జిల్లాలోని తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం ఖాయ‌మ‌ని, నాలుగు నియోజ‌క వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, వైసీపీ అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని,  వీటిల్లోనూ మూడు సీట్ల‌లో కూట‌మి అభ్య‌ర్థుల‌కే విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని స‌ర్వే పేర్కొంది.  విశాఖ‌ప‌ట్ట‌ణం ఉమ్మ‌డి జిల్లాలోని  15 నియోజ‌క‌వ‌ర్గాల్లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులే విజయం సాధిస్తార‌ని, కేవ‌లం ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది. విశాఖప‌ట్ట‌ణాన్ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా మార్చుతాన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ప్ప‌టికీ.. అక్క‌డి ప్ర‌జ‌లు జ‌గ‌న్, వైసీపీ నేత‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితిల్లో లేర‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాన్ని బట్టి అర్ధమౌతుంది. రాజ‌ధాని పేరుతో ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు విశాఖ‌లో భూదందాకు భారీగా తెర‌లేపారు. దీంతో విశాఖ ప్ర‌జ‌లు రాజ‌ధాని అంటేనే ఆందోళ‌న చెందుతున్న ప‌రిస్థితి.  ఉమ్మడి తూర్పు గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం 19 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా వాటిలో  17 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే తేల్చింది. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ టీడీపీ  కూటమి అభ్యర్థికే ఎడ్జ్ ఉంటుందని పేర్కొంది.  అదే విధంగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి  జిల్లాలో ని 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను.. 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని.. అందులో నూ ఒక నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి అభ్య‌ర్థి, మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి ఎడ్జ్ సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.   ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా, 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధింస్తార‌ని, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ కూట‌మి అభ్య‌ర్థుల‌కే విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని స‌ర్వే పేర్కొంది.  ఉమ్మడి గుంటూరు  జిల్లాలో ని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో 16 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ కూట‌మి అభ్య‌ర్థి విజ‌యానికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. - ప్ర‌కాశం ఉమ్మ‌డి జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎనిమిది స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, మూడు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యానికి అవ‌కాశాల ఉంటాయ‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది.   ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో ని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో తొమ్మిది స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఒక స్థానంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది.  ఉమ్మ‌డి క‌డప జిల్లాలో 10 నియోజ‌క వ‌ర్గాల్లో ఐదు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, రెండు స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది. మూడు స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, వాటిల్లో రెండింటిలో వైసీపీ అభ్య‌ర్థులు, ఒక స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంద‌ని అంచనా వేసింది.  క‌ర్నూల్ ఉమ్మ‌డి జిల్లాలో ని 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆరు స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఆరు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలించింది. రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు సాగుతుంద‌ని, వాటిల్లో ఒక‌టి కూట‌మి అభ్య‌ర్థి, ఒక‌టి వైసీపీ అభ్య‌ర్థి  గెలుచుకునే అవ‌కాశాలు ఉంటాయ‌ని పేర్కొంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో 11 స్థానాల్లో కూమి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, ఒక స్థానంలో వైసీపీ అభ్య‌ర్థి, మ‌రో రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని స‌ర్వే తేల్చింది. చిత్తూరు ఉమ్మ‌డి జిల్లాలో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, మూడు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అయితే ఆ ఒక్క స్థానంలో కూడా వైసీపీ అభ్య‌ర్థి విజ‌యానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది.  

ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్, బీజేపీ ముక్తకంఠం!

కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలు. ఇంకా చెప్పాలంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు పార్టీలూ బద్ధ శత్రువులు, చిరకాలంగా రాజకీయ ప్రత్యర్థులు. బీజేపీ అయితే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దేశంలో ఆ పార్టీ ఉనికిని నామమాత్రం చేయాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీని మత ఛాందసవాద పార్టీగా, దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్న పార్టీగా విమర్శలు గుప్పిస్తుంటుంది. అటువంటి పార్టీలు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. క్లియర్ కట్ గా చెప్పాలంటే యుగళగీతం పాడుతున్నాయి.  అదీ తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఒకే ఒక విషయంలో ఆ రెండు పార్టీలూ ముక్తకంఠంతో విమర్శలు గుప్పిస్తున్నాయి.  అదీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు వంటి అంశాలలో ఇరు పార్టీలూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ దొందూ దొందేనని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే... రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రహస్య మైత్రి నెరపుతున్నాయని బీజేపీ దుమ్మెత్తిపోస్తున్నది. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం రెండుపార్టీలూ ఏకాభిప్రాయ వ్యక్తం చేస్తున్నాయి.   కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు కాంగ్రెస్, బీజేపీ నేతలు బాధితులు కావడమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి మాత్రమే కాదు బీజేపీ సీనియర్ నేత, అప్పటికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే. ఫోన్ ట్యాపింగ్ బాధితులైన  కాంగ్రెస్, బీజేపీ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో  బీజేపీ నేతలు  కూడా ఈ విషయంలో కాంగ్రెస్ తో గళం కలిపి విమర్శలకు దిగుతున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాథమిక నిందితుడిగా పేర్కొనాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేశారని, తన ప్రచార పద్దతులను బయటపెట్టారని, ఇబ్బందులు కలుగజేశారని  పేర్కొన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా ఫోన్ ట్యాపింగే  కారణమన్నారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ చేసి కేసుల్లో ఇరికించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పట్లో కేసీఆర్ కు సన్నిహితుంగా మెలిగిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందని ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారని అంటున్నారు. ఆ దిశగా ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. త్వరలో ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఒక ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ అధినేతపై విమర్శల విషయంలో ఏకతాటిపైకి రావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు పార్టీలూ కూడా ఒకే రకమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయం సామాన్య జనంలో కూడా కలుగుతున్నది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సమాధానం చెప్పుకోలేని అంశంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో విద్యుత్ కోతలు.. జగన్ పవర్ కట్ కు బాటలు!

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలకు రంగం సిద్ధమైంది. రానున్న రోజులలో నిర్ణీత వేళల్లో విద్యుత్ కోతలు అనివార్యంగా మారాయి. బొగ్గు కొరత, విద్యుత్ కంపెనీలకు గుట్టలా పేరుకుపోయిన బకాయిల కారణంగా జగన్ సర్కార్ ఈ వేసవిలో రాష్ట్రంలో గంటల తరబడి విద్యుత్ కోతలు విధించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది.   విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామాల్లో రోజుకు ఎనిమిది గంటలు, పట్టణాలలో ఆరు గంటల విద్యుత్ కోతకు అధికారులు ఇప్పటికే షెడ్యూల్ రూపొందించారు. బొగ్గు, విద్యుత్ కంపెనీలకు రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వ బకాయిలు  35వేల కోట్ల రూపాయలకు పెగా పేరుకుపోయాయి. దీంతో   బొగ్గు కొనుగోళ్లు నిలిచిపోయాయి. అంతే కాకుండా హైడ్రో, సౌర విద్యుత్ కంపెనీలకు జగన్ సర్కార్ 18 వేల కోట్లకు పైగా బకాయి పడింది. దీంతో ఆ కంపెనీల నుంచి   విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థతి ఏర్పడింది. దీంతో  రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నది. విద్యుత్ కొనుగోలుకు మార్గాలు మూసుకుపోవడం విద్యుత్ కోతలకు దారి తీసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సరిగ్గా ఎన్నికల ముందు జగన్ సర్కార్ తీవ్రమైన విద్యుత్ కోతను ఎదుర్కోనున్నది. వాతావరణ శాఖ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో అత్యధికంగా నమోదు అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్న సంగతి తెలసిందే.  అసలే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వానికి మండు వేసవిలో విద్యుత్ కోతలు విధించక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తడం మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో పవర్ కట్స్ కారణంగా జగన్ పవర్ కట్ అయిపోక తప్పదని అంటున్నారు. అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్థ విధానాలతో సర్ ప్లస్ పవర్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను గాఢాంధకార ప్రదేశ్ గా మార్చిన ఫలితం జగన్ రానున్న ఎన్నికలలో అనుభవించకతప్పదని అంటున్నారు. మేలో జరిగే ఎన్నికలో  విద్యుత్ కోతల ప్రభావం జగన్ సర్కార్ కు తీవ్ర నష్టం కలిగించకతప్పదని చెబుతున్నారు.  

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం

ఐపీఎల్- 2024లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం సాధించిన చెన్నై రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 63 పరుగుల తేడాతో మట్టి కరిపించింది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దుబె ఆకాశమే హద్దుగా చెలరేగాడు.. దుబే కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అలాగే చెన్నై బ్యాటర్లలలో రుతురాజ్‌ గైక్వాడ్ 46 , రచిన్‌ రవీంద్ర 46 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో   రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌, స్పెన్సర్‌ జాన్స్‌, మోహిత్ శర్మ ఒక్కో వికెట్‌ చొప్పున పడగొట్టారు. దీంతో 207 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పరుగుల వేగం మందగించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు చేసిన శుభమన్ గిల్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. వృద్ధిమాన్ సాహా 21 పరుగులు, సాయి సుదర్శన్ 37 పరుగులు చేసినా పరుగుల వేగం పెంచడంలో విఫలమయ్యారు.  దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకు పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ 2, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 2, తుషార్ దేశ్‌పాండే 2, డేరిల్‌ మిచెల్‌ 1, మతీశా పతిరానా 1 వికెట్‌ తీశారు.  రెండు వరుస విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 

మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఇక జమిలి ఎన్నికలే?

దేశంలో లోక్ సభ, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికలకు ఒకే సారి ఎన్నికలు జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే..2029 నుంచి దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయనడంలో సందేహం అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ రెండో సారి అధికారం చేపట్టిన నాటి నుంచీ దేశంలో జమిలి ఎన్నికలపై దృష్టి పెట్టారు. దేశంలో జమిలి ఎన్నికలు అనడానికి మోడీ ఏ కారణాలైనా చెప్పవచ్చు.. కానీ అసలు కారణం మాత్రం కేంద్రంలో అధికారంలో ఉండగా లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగితే బీజేపీకి ప్రయోజనం ఉంటుందనేదే అన్న విషయంలో సందేహాలుకు అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అయితే ప్రధాని మోడీ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటే జమలి ఎన్నికల నిర్వహణ కూడా జరగాలని భావించారు. ఎంతో పట్టుదలతో ఆ దిశగా అడుగులు కూడా వేశారు. అయితే వ్యవధి తక్కువ ఉండటం, కేంద్ర ఎన్నికల సంఘం ఆ వ్యవధిలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్న సంకేతాలు ఇవ్వడం.. అన్నిటికీ మించి అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేసేందుకు కావలసిన బలం బీజేపీకి రాజ్యసభలో లేకపోవడంతో మోడీ తన లక్ష్య సాధనకు మరో సారి అధికారం చేపట్టడం వరకూ ఆగక తప్పని సరి అయ్యింది. అందుకే ఈ సారి రెండు సభలలోనూ బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉండాలన్న లక్ష్యంతో 2024 ఎన్నికలకు పావులు కదిపారు. బీజేపీకి సొంతంగా 360 స్థానాలు, ఎన్డీయే కూటమితో కలుపుకుని 400కు పైగా స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్య సాధనకు అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ మౌలిక లక్షణాలకు, ఆ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న గుర్తింపునకు చెల్లుచీటీ పాడేయడానికి కూడా వెనుకాడటం లేదు. దేశంలో బీజేపీ అంటే క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధతకు మారుపేరుగా ఇంత కాలం జనం భావించేవారు. కమ్యూనిస్టుల తరువాత కమలం పార్టీలోనే భావ ఐక్యత కనిపిస్తుందన్న భావన ఉండేది. కానీ మోడీ 2.0 అంటే 2019 ఎన్నికలలో విజయం సాధించి వరుసగా రెండో సారి మోడీ నేతృత్వంలో అధికార పగ్గాలు అందుకున్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలలో బీజేపీ పట్ల ఉన్న భావనను పూర్తిగా తుడిచి పెట్టేసింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, తద్వారా రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూల్చివేసైనా సరే అధికారం చేపట్టాలన్న టార్గెట్ ను పార్టీ నేతలకు, క్యాడర్ కు నిర్దేశించడం ద్వారా బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ కంటే రెండాకులు ఎక్కువే చదివిందన్న భావన సామాన్య జనంలో సైతం ఏర్పడింది.  ఇక జమిలి ఎన్నికల విషయానికి వస్తే..  దేశంలో లోక్‌ సభ, శాసనసభ, స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలను నిర్వహించాలన్న బీజేపీ ప్రభుత్వ పట్టుదల దాదాపు ఫలించేసిందనే చెప్పాలి. మోడీ సర్కార్ ప్రతిపాదకు ఆమోదముద్ర పడిందనే భావించాలి.  జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం మోడీ సర్కార్ నియమించిన  రామ్‌ నాథ్‌ కోవింద్‌ కమిటీ జమిలి ఎన్నికలకు అనుకూలంగా నివేదిక సమర్పించింది.    లోక్‌ సభ, శాసనసభ, మున్సిపల్‌ ఎన్నికలను ఏక కాలంలో నిర్వ హించడం దేశానికి అన్ని విధాలా మేలు చేస్తుందని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ నాయకత్వంలోని కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను అందజేసింది. అంటే ప్రభుత్వ ప్రతిపాదన భేషుగ్గా ఉందని కమిటీ నిర్ధారించింది.  మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షణం నుంచి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఏమిటన్నది అందరికీ తెలిసిపోయింది. ఆ కమిటీని ఏర్పాటు చేసింది జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కాదనీ, జమిలి ఎన్నికలే శరణ్యమని చెబుతూ నివేదిక ఇవ్వడానికేనని విపక్షాలు అప్పట్లోనే విమర్శలు గుప్పించాయి.  జమిలి ఎన్నికలను అంటే లోక్‌ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏక కాలంలో వంద రోజుల లోపల నిర్వహించాలని, ఇది సాధ్యమయ్యే విషయమేనని, ఇది ప్రజాస్వామ్యానికి గానీ, రాజ్యాంగానికి గానీ, సమాఖ్య స్ఫూర్తికి గానీ ఏమాత్రం విరుద్ధం కాదని రామ్ నాథ్ కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందుకు తగ్గట్టుగా   ఓటర్ల కార్డులను,  ఓటర్ల జాబితాలను రూపొందించాల్సి ఉంటుందని కమిటీ సూచించింది. వివిధ రాజకీయ పక్షాల నుంచి, వివిధ వర్గాల నుంచి, ఆసక్తి చూపించిన వ్యక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించగా, అత్యధికులు  ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానానికి అనుకూలంగానే అభిప్రాయం తెలిపారని కమిటీ విస్పష్టంగా చెప్పింది. అయితే కమిటీ నివేదిక విశ్వసనీయతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల వనరులు వృథా  అవుతాయి, అధిక కాలం పాలనా యంత్రాంగం    స్తంభించిపోతుంది. సామాజిక, ఆర్థికపరమైన ఖర్చులు  పెరుగుతాయి. ఓటింగ్ పట్ల ప్రజలకు ఆసక్తి పోతుంది. అంటూ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయాలు... ఇప్పటి వరకూ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీసుకురావడానికి మోడీ సర్కర్ చెబుతున్న కారణాలు కూడా ఇవే కావడంతో ప్రభుత్వం చెప్పిన దానిని ఓకే అనడానికే రామ్ నాథ్ కోవింద్ కమిటీ పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలను కమిటీ పరిగణనలోనికి తీసుకున్నట్లు కనిపించడం లేదు.    లోక్‌ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు విభిన్న అంశాలపై జరుగుతాయని, ఈ విభిన్న అంశాల ప్రస్తావనకు జమిలి ఎన్నికల్లో సమాధానాలు దొరకడం దుర్లభమవుతుందని ప్రతిపక్షాలు, విమర్శకులు నెత్తీనోరూ బాదుకుని చెబుతున్నా కమిటీ ఖాతరు చేయలేదు.   జమిలి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ పార్టీలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయనీ, దీనివల్ల ప్రాంతీయ పార్టీల అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్న మాటలను కూడా కమిటీ పరిగణనలోనికి తీసుకోలేదు.  మొత్తం మీద కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే 2029 నుంచి దేశంలో జమిలి ఎన్నికలు తప్పవని పరిశీలకులు అంటున్నారు. 

కింగ్ కోహ్లీ బాదేశాడు.. బెంగళూరును గెలిపించాడు!

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్​ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో గెలిచి 2024 సీజన్​లో తొలి విజయం సాధించింది ఆర్సీబీ. విరాట్‌ కోహ్లి 49 బంతుల్లో 11×4, 2×6 సాయంతో 77 పరుగులు  అద్భుతంగా రాణించడంతో ఆసక్తికరంగా సాగిందీ మ్యాచ్. ఫలితంగా ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్‌ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు  చేసింది. తొలి బాల్​ నుంచే ఆచీతూచీ  మ్యాచ్ ఆడింది. ప్రత్యర్థులు వేసిన బంతులను చాకచక్యంగా ఎదుర్కొని మంచి స్కోర్ చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 37 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 45 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్‌ శర్మ 20 బంతుల్లో 1×4, 2×6 సాయంతో 27 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌  17 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 25 పరుగులు అందించాడు.  సామ్‌ కరన్‌ 17 బంతుల్లో 3×4 సాయంతో 23 పరుగులు చేశాడు. చివరి ఓవర్​లో వచ్చిన శశాంక్‌ సింగ్ 21 కూడా కీలక ఇన్నింగ్స్ అందించాడు. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ తలో రెండు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్‌,యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 177 పరుగుల ఛేధనలో కోహ్లీ చేసిన స్కోరును సద్వినియోగం చేసుకున్నాడు.  ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ 10 బంతుల్లో 3×4, 2×6 సాయంతో 28 నాటౌట్‌గా నిలిచాడు. లొమ్రార్‌ 8 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 17 నాటౌట్‌ మంచిగా రాణించాడు.  దీంతో  ఆర్సీబీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2/13, రబాడ 2/23 అద్భుతంగా బౌలింగ్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ష్‌దీప్‌ 3.2 ఓవర్లలో 40, హర్షల్‌ పటేల్‌ 1/45 ధారాళంగా పరుగులిచ్చేశారు. బెంగళూరు తుది జట్టు : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్‌), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్. పంజాబ్ తుది జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్‌), కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.  

ఆ ఇద్దరితో న‌ష్ట‌మే.. వదిలించుకోకుంటే క‌ష్ట‌మే!

ఏ ఎన్నికైనా గెల‌వాలంటే ఏ పార్టీ అయినా కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక తప్పదు.  అందులోనూ పొత్తులు పెట్టుకున్న సందర్భాలలో కొన్ని త్యాగాలూ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ, పార్ల‌మెంట్ లాంటి ఎన్నిక‌ల్లో అయితే.. పార్టీ అధిష్టానాలు మొహ‌మాటాల‌కు పోకుండా గెలిచే అభ్య‌ర్థుల‌కు టికెట్లు కేటాయించాలి.  పార్టీ బ‌లోపేతం కోసం సుదీర్ఘ‌కాలంగా ప‌నిచేస్తున్న నేత‌లైనా స‌రే  ప్ర‌జాబ‌లం లేకుంటే ప‌క్క‌న పెట్టాల్సిందే.  ప్ర‌జాబ‌లం ఉన్న అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇస్తేనే పార్టీ బ‌లోపేతంతో పాటు,  అధికారంలోకి రావ‌టానికి అవ‌కాశం ఉంటుంది.  ప్ర‌స్తుతం ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో  , తెలుగుదేశం, జ‌న‌సేన, బీజేపీ పార్టీలు కూట‌మిగా కలిసి పోటీ చేస్తున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థుల ఎంపికలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రెండుమూడు సార్లు స‌ర్వేలు చేసి గెలుపు గుర్రాలు అవుతార‌న్న న‌మ్మ‌కం వ‌చ్చిన త‌రువాతే అభ్య‌ర్థుల పేర్ల‌ు ప్ర‌క‌టించారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కొన్ని త్యాగాలు సైతం చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం అదే త‌ర‌హాలో అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. అయితే అలాంటి పొత్తు ధర్మం, మిత్ర ధర్మం బీజేపీ  వైపు నుంచి కనిపించడం లేదు. ఆ పార్టీ ఒ్తతిడులకు తలొగ్గో,  ఆధిపత్యం మాదే అని రుజువు చేసుకోవడానికో, మరో కారణంతోనో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యంగా కొన్ని స్థానాల విషయంలో పొత్తు ధర్మానికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది. బీజేపీ ఇప్పటికే  ఏపీలో పార్ల‌మెంట్‌ స్థానాలకు  తమ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.  ఇక అసెంబ్లీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే,   ప్ర‌జాబ‌లం ఏ మాత్రం లేని పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.   బీజేపీ అధిష్టానంపై  ఒత్తిడి  పెంచు తున్నారు. వారి ఒత్తిడికి త‌లొగ్గి అసెంబ్లీ టికెట్లు ఇస్తే వైసీపీ నెత్తిన పాలుపోసిన‌ట్లే అవుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.  మే13న  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు ఒకే విడతలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తుపెట్టుకున్న విష‌యం  తెలిసిందే.  మూడు పార్టీల మ‌ధ్య‌ సీట్ల స‌ర్దుబాటు  పూర్త‌యింది. పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మూడు విడతల్లో 139 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 13 పార్ల‌మెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మూడు నాలుగు సార్లు స‌ర్వేలు నిర్వ‌హించి గెలుపు గుర్రాలు అవుతార‌నుకున్న వారికి టికెట్లు ఇచ్చారు. ఈ క్ర‌మంలో ప‌లువురు  సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేందుకు సైతం చంద్ర‌బాబు నాయుడు వెనుకాడ‌లేదు. టికెట్ రాని నేత‌లు సైతం చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని అర్థంచేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, రెండు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు ద‌క్కాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 18 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కాకినాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. వీరి ఎంపిక‌కోసం ప‌వ‌న్ మూడునాలుగు సార్లు స‌ర్వేలు నిర్వ‌హించి సీట్లు కేటాయించారు. ఈ క్ర‌మంలో సీట్లు ద‌క్క‌ని జ‌న‌సేన నేత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇస్తామ‌ని ప‌వ‌న్ క్లారిటీగా చెప్పేశాడు. తెలుగుదేశం, జనసేనలు అభ్యర్థుల ఎంపిక విషయంలో పక్కా క్లారటీతో ముందుకు సాగుతుంటే..  బీజేపీలో  మాత్రం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, ఆరు పార్ల‌మెంట్ సీట్లు ద‌క్కాయి.  ఇప్ప‌టికే ఆరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అధిష్టానం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో స‌ర్వేల‌ను ప్రామాణికంగా తీసుకున్న‌ట్లే చెబుతోంది. పార్ల‌మెంట్ స్థానాల్లో సీటు ఆశించిన బీజేపీ నేత‌లు సోమువీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావులాంటి నేత‌ల‌ను బీజేపీ అధిష్టానం నిర్మొహమాటంగా పక్కన పెట్టేసింది. ఒక్క నరసాపురం లోక్ సభ స్థానం విషయంలోనే బీజేపీ గెలుపు అవకాశాలున్న రఘురామకృష్ణం రాజును పక్కన పెట్టి  అనామకుడి వంటి అభ్యర్థిని నిలబెట్టింది. అందుకు కారణాలపై ఇప్పటికే విస్తృత చర్చ జరిగింది. జరుగుతోంది. అది పక్కన పెడితే.. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఇహనో ఆ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఆ పార్టీకి  పది అసెంబ్లీ నియోజకవర్గాలలో  గెలుపు గ్యారంటీ అభ్యర్థులు లేరు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం బీజేపీ నిస్సం దేహంగా తెలుగుదేశం, జనసేన పార్టీలపైనే ఆధారపడి ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని ఒక వర్గం మాత్రం  నేల విడిచి సాము చేస్తున్నది.  తమకు పార్టీ టికెట్ ఇచ్చి తీరాలని హఠం చేస్తున్నది. ఇందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నది. అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నది. ఆ వర్గంలో ముఖ్యంగా   సోము వీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావు లాంటి నేత‌లు ఉన్నారు. వీరిరువురూ కూడా ఎంపీ టికెట్ కోసం బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే ఎంపీ టికెట్ విషయంలో వీరి పప్పులు ఉడక లేదు. ఎంపీ టికెట్ల విషయంలో ఒక్క నరసాపురం సీటు మినహాయిస్తే బీజేపీ చాలా వరకూ హుతుబద్ధంగానే అడుగులు వేసింది. పొత్తు ధర్మాన్ని పాటించింది. తెలుగుదేశం, జనసేనల సూచనలమేరకే అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అసెంబ్లీ స్థానాల విషయంలో ఆ పార్టీ చేస్తున్న తాత్సారం ఇస్తున్న లీకులు మాత్రం ఒకింత అనుమానాస్పదంగా ఉన్నాయి. పార్లమెంటుకు పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకోవడంలో విఫలమైన సోము, జీవీఎల్లు ఇప్పుడు ఎలాగైనా అసెంబ్లీ టికెట్లైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. వారి ప్రయత్నాల విషయంలో బీజేపీ అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తోందన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి  బీజేపీ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగితే తమకు డిపాజిట్లు కూడా రావ‌ని స్వయంగా సోము వీర్రాజు, జీవీఎల్ కు కూడా తెలుసు. వారి పట్ల ఏపీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ శ్రేణులు కూడా వారింత కాలం  రాష్ట్రంలో అధికార వైసీపీకి కోవర్టులుగా పని చేశారని బాహాటంగానే చెబుతున్నాయి.   బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆ పార్టీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా స‌ర్వేలు నిర్వ‌హించింది. సోమువీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావుల పేర్లతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధిష్టానం నిర్వ‌హించిన స‌ర్వేల్లో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ట్లు బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది. సోము వీర్రాజు, జీవీఎల్ పై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. వీరు వైసీపీ కోవ‌ర్టుల‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో ప్ర‌స్తుతం వారికి టికెట్లు ఇచ్చినా టీడీపీ, జ‌న‌సేన ఓట‌ర్లు స‌హ‌క‌రించ‌డం అనుమాన‌మే. టీడీపీ, జ‌న‌సేన స‌హ‌క‌రించ‌కుంటే వారికి డిపాజిట్లు కూడా రావు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అధిష్టానం వారి ఒత్తిడికి త‌లొగ్గి అసెంబ్లీ టికెట్లు ఇస్తే.. ముందుగానే రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి ఓట‌మిని ఒప్పుకున్న‌ ట్ల‌వుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. బీజేపీ అధిష్టానం వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రి స్తున్నద‌న్న ప్ర‌చారం రఘురామకృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఏపీలో విస్తృతంగా జ‌రుగుతోంది.  ఇలాంటి ప‌రిస్థితుల్లో సోము వీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావుల‌కు టికెట్లు కేటాయిస్తే ఆ ప్రచారం నిజమని జనం నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అదే   జ‌రిగితే ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల ఐక్య‌త‌కు భంగం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవ‌లం ఇద్ద‌రి టికెట్ల కోసం కూట‌మి ఐక్య‌త‌ను దెబ్బ‌తీసేలా బీజేపీ అధిష్టానం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అనుకోవ‌టం లేద‌ని అంటున్నారు. ఒక వేళ అలా వ్యవహరిస్తే.. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు వెనుక జగన్ ను గెలిపించాలన్న రహస్య అజెండా ఉందని జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని నిర్ధారణ అవుతుందని అంటున్నారు. 

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు.. ఏపీలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ నిఘా?

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ నిఘా పెట్టిందా? రాష్ట్రంలో ఎన్నికల కోడ్  ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ రాష్ట్రంపై ప్రత్యేక నిఘా పెట్టిందా? మరీ ముఖ్యంగా  అధికార వైసీపీ నాయకులతో అంటకాగుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ రహస్య  దర్యాప్తు చేపట్టిందా? అంటే విశ్వసనీయ వర్గాలు ఔననే అంటున్నాయి.  ఏపీలో ఎన్నికల కోడ్ అసలు అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో పలు వీడియోలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ప్రధాని మోడీ పాల్గొన్న చిలకలూరి పేట సభ ఏర్పాట్ల విషయంలో, ట్రాఫిక్ నియంత్రణ విషయంలో రాష్ట్ర పోలీసులు బాహాటంగానే సభ విచ్ఛిన్నం లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందన్నది ఆ సభ వేదికగా సాక్షాత్తూ ప్రధాని మోడీకే అర్ధమై ఉంటుందని అంటున్నారు. అయితే కోడ్ అమలులోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా, ఆరోపణలకు ఎదుర్కొంటున్న అధికారులపై ఈసీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలవడం వెనుక కూడా ఏదైనా ప్రత్యేక అజెండా ఉందా? రాష్ట్రంలో జగన్ అరాచకాలను నిరోధించే విషయంలో ఈసీ పూర్తిగా చేతులెత్తేసిందా అన్న అనుమానాలూ అన్న వర్గాల నుంచీ వ్యక్తమౌతున్నాయి.  ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే ముఖ్యమంత్రి జగన్ తనకు విధేయులైన వారికే ప్రాధాన్యతనిస్తూ జిల్లాల్లో అధికారుల నియామకాలను చేపట్టారు. ఈ విషయంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. సరే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ఈసీ చర్యలు తీసుకుంటుంది అని అంతా భావించారు. అయితే కోడ్ అమలులోక వచ్చి ఇన్ని రోజులైనా ఈసీ నుంచి క్రీయాశీలకంగా ఎటువంటి చర్యలూ కనిపించలేదు. విపక్షాలు,  సోషల్ మీడియా సహా అన్ని వైపుల నుంచీ రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘన ఎలా జరుగుతోందో సాక్ష్యాలతో సహా సమాచారం కనిపిస్తున్నది. అలాగే కొందరు అధికారుల తీరుపై ఫిర్యాదులూ వెల్లువెత్తుతున్నాయి.  అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధకారుల తీరుపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదులు అందాయి. అయినా ఈసీలో కదలిక లేకపోవడంతో ఈసీ తీరుపై, కూటమిలో బీజేపీ భాగస్వామ్య పాత్రపై అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈసీ తనకు చేరిన సమాచారం, ఫిర్యాదులపై సీరియస్ గా ఉందనీ, రాష్ట్రంలో పలువురు అధికారుల తీరుపై రహస్య దర్యాప్తును చేపట్టిందని తెలుస్తున్నది.  దీంతో రాష్ట్రంలో కీలక పదవులలో ఉన్న అధికారుల నియామకం నుంచి  పనితీరు వరకూ అన్ని విషయాలపై కూపీ లాగుతున్నదని చెబుతున్నారు.  ముఖ్యంగా  కొందరు ఎస్పీలు, కలెక్టర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి ఇప్పటికే ఈసీ తన రహస్య దర్యాప్తు ద్వారా ధృవీకరించుకుందని చెబుతున్నారు. అదే విధంగా ఇద్దరు రాష్ట్ర స్థాయి అధికారుల విషయంలోనూ ఈసీ అసంతృప్తిగా ఉందని అంటున్నారు.  ఏపీలో కోడ్ ఉల్లంఘనలపై ఈసీ సీరియస్ గా ఉందనీ,  తన రహస్య దర్యాప్తులో తేలిన అంశాలు ఆధారంగా ఏ క్షణంలోనైనా సీరియస్ చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియపై ఈసీ దృష్టి సారించగా, వారం తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై  ప్రత్యేక దృష్టి సారించిన ఈసీ వారిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించనున్నట్లు చెబుతున్నారు. 

ఎన్నికలయ్యే వరకూ నో సామాజిక పెన్షన్లు? విపక్షాలపై నెపం నెట్టేందుకు జగన్ కుట్ర!?

వ్యవస్థలను నాశనం చేస్తే పరిస్థితి ఎలా మారుతుందనడానికి ప్రస్తుతం ఏపీ ఒక  ఉదాహరణ. గత నాలుగున్నరేళ్లుగా అధికారులను పక్కన పెట్టేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వాలంటీర్ల చేత చేయించిన ఫలితం.. ఇప్పుడు ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెన్షనర్లకు పెన్షన్ అందే పరిస్థితి లేకుండా పోయింది. ఔను ఎందుకంటే ఇంత కాలం పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేతుల మీదుగా జరిగింది. ఎన్నికల కోడ్ అమలు కావడంతో వారంతా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలంటూ ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన వాలంటూర్లు ఇప్పుడు అలా చేయడానికి వీళ్లేదు. దీంతో పెన్షనర్లకు పెన్షన్లు ఎవరు ఇవ్వాలి? ఈ విషయంలో ఎటువంటి స్పష్టతా లేదు.  ప్రభుత్వం అధికారుల చేత పంపిణీ చేయిస్తుందా? అన్నిటికీ బటన్ నొక్కి ఖాతాలలో సొమ్ములు జమవేస్తున్నానని చెబుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ పెన్షనర్లకు మాత్రం ఖాతాలతో సంబంధం లేకుండా నేరుగా వాలంటీర్ల ద్వారా సొమ్ములు అందజేశారు. అలా చేయడం వల్ల వారి ఓట్లన్నీ గంపగుత్తగా తన ఖాతాలో పడతాయని భావించారు. ఇప్పుడు వాలంటీర్లు ప్రభుత్వ పథకాల ప్రచారంలో దూరంగా ఉండాలి. అలాగే ఆ పథకాలను ఇళ్లకు తీసుకువెళ్లి అందించేందుకూ వీల్లేదు. ఇప్పుడు పెన్షనర్లకు పెన్షన్లు అందే మార్గమేది? మరో ఐదు రోజులలో ఒకటో తేదీ రానుంది.  మరి పెన్షనర్లకు పెన్షన్లు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవైనా చేశారా?   రాష్ట్రంలో 66 లక్షలమందికి సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. కొత్తగా 1,17,161మందికి పెన్షన్ కార్డులిచ్చారు. వీరికి ప్రస్తుతం నెలకు 3 వేల రూపాయల పించన్ ఇస్తున్నారు. వృద్ధులు, వితంతులు,ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్‌వ్తాధిగ్రస్తులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున వాలంటీర్లే.. వారి ఇళ్లకు వెళ్లి పించను ఇస్తున్నారు.  ఈసీ ఆదేశాల ప్రకారం..వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదు. ఆ ప్రకారంగా రేపు వచ్చే నెల ఒకటిన, యధావిథిగా వారే పించనర్లకు డబ్బులు చెల్లించే అవకాశం లేదు?  ఈ విషయంలో ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి స్పష్టతా లేదు.  పోనీ గత ఐదేళ్లుగా అమలు అవుతున్న విధంగానే వాలంటీర్లే పెన్షనర్ల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించవచ్చని ఈసీ ఆదేశాలిచ్చే అవకాశాలూ లేవు. ఎందుకంటే  వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని మంత్రులు, ఎంపీలు బాహాటంగా ప్రకటనలు గుప్పించేశారు. పార్టీని గెలిపించేందుకే వాలంటీర్లు పని చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించారు. మరి అటువంటప్పుడు ఒక ప్రభుత్వ పథకం లబ్ధిని పార్టీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎలా అందజేస్తారు? అలా అందజేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఎలా ఇస్తుంది?   ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై, ఈసీ చర్యల కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే పలువురిపై వేటు వేసింది. ఇటువంటి పరిస్థితుల్లో  వాలంటీర్లు సమాజిక పెన్షన్ లబ్ధిదారులకు సొమ్ములు అందించడమంటే.. జగన్ పార్టీకే ఓటు వేయండని ప్రచారం చేయడమే అవుతుందనడంలో సందేహం లేదు.   మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకూ సామాజిక పెన్షన్లు అందే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీ ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా ప్రజలకు అందిస్తున్న వలంటీర్ వ్యవస్థపై విపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరించి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడ్డారంటూ    వైసీపీ  పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (మార్చి 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. సోమవారం (మార్చి 25) శ్రీవారిని మొత్తం  78 వేల 731 మంది దర్శించుకున్నారు. వారిలో 25వేల 156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చింది. 

మళ్లీ టీఆర్ఎస్.. పేరు మార్పుపై కేసీఆర్ కసరత్తు!?

తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిపోయిన టీఆర్ఎస్  పేరును బీఆర్ఎస్ గా మార్చాలని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపులో వచ్చిన క్షణం నుంచే ఆయన పతనం మొదలైందని చెప్పవచ్చు. సరే ఏది ఏమైతేనేం.. తెలంగాణలో అధికారం సాధించిన విధంగానే కేంద్రంలో కూడా అధికార పీఠం దక్కించుకోవాలన్న అశో, దురాశో, పేరాశో ఏదైతేనేం కేసీఆర్ తాను అనుకున్నది చేసేశారు. ఇక్కడే ఆయన తెలంగాణ ప్రజలను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారు. (టీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర సమితిని ఓన్ చేసుకుని సొంత పార్టీగా ఆదరించిన తెలంగాణ ప్రజ (బీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితిని సొంత పార్టీ అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అలాంటి టీఆర్ఎస్ ను కేసీఆర్ ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించేశారు.  దాంతో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితితో, ఆ పార్టీని స్థాపించి, తెలంగాణ సాధన కోసం పోరాడినన నేతగా   ప్రజలతో ఉన్న బంధాన్ని ఆయనే చేజేతులా తెంచేసుకున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన పేరు మాప్పు ప్రయోగం బూమరాంగ్ అయ్యింది. టీఆర్ఎస్ గా ఉన్నంత కాలం కేసీఆర్ సర్కార్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, నిరంకుశ ధోరణిని కానీ పెద్దగా పట్టించుకోని జనం.. ఎప్పుడైతే పార్టీలోని తెలంగాణ పేరును తీసేశారో.. అప్పుడే ఆ పార్టీతో, తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ తో ఉన్న ఎమోషన్ బాండ్ తెగిపోయింది.   ఫలితం ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. సాధారణంగా ఎన్నికలలో ఓటమి అన్నది ఏ పార్టీకైనా, ఏ నేతకైనా సహజమే. అయితే బీఆర్ఎస్ ఓటమి, కేసీఆర్ పరాజయం రెండూ మాత్రం అలా సహజంగా తీసుకోవడానికి వీల్లేని వాతావరణం తెలంగాణలో కనిపిస్తోంది. కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చే విషయంలో పూర్తి ఏకపక్షంగా వ్యవహరించారు. ఈ పేరు మార్పు వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణులకు, నేతలకు ఎవరికీ ఇష్టం లేదు. సూచన ప్రాయంగా ఇచ్చిన సలహాలు కేసీఆర్ లెక్క చేయలేదు. క్యాడర్ అసంతృప్తిని పట్టించుకోలేదు. అధికారంలో ఉన్న కేసీఆర్.. ఎవరినీ లెక్క చేయనవసరం లేదన్నట్లాగానే వ్యవహరించారు. చివరకు ప్రజలను కూడా లేక్క చేయకుండా వ్యవహరించారు.  అంతా అయిపోయి పార్టీ ఓడిపోవడమే కాకుండా, పార్టీలో తిరుగులేని తన పట్టు కూడా సడలిపోయి, ఇప్పుడిక పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారి, చేతులు పూర్తిగా కాలిపోయి, పట్టుకోవడానికి ఆకులు కూడా లేని స్థితికి వచ్చిన తరువాత ఎన్నికలలో పరాజయానికి పేరు మార్పిడే ముఖ్య కారణమని తెలిసివచ్చినట్లుంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేయాలని నిర్ణయించుకున్నారు.  జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం అధికారాన్ని దూరం చేయడమే కాకుండా , ప్రజలను కూడా పార్టీకి దూరం చేసింది.  మొత్తంగా పార్టీ తెలంగాణలో మనుగడ సాగించేందుకే కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది.   ఇప్పుడు లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ వరుసగా నిర్వహి స్తున్న సమీక్షా సమావేశాల్లో పార్టీ క్యాడర్ నుంచీ, లీడర్ల నుంచీ కూడా బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చేయాలన్న డిమాండ్ ప్రముఖంగా వినిపించింది. నాయకులైతే ముఖం మీదే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి పేరు మార్పే కారణమని స్పష్టంగా చెప్పేశారు. దీంతో కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చేందుకు అవసరమైన న్యాయ సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకూ చెప్పారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తరువాత బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటానని పార్టీ నాయకులు, క్యాడర్ కు స్పష్టమైన హామీ ఇచ్చారు.    ఇప్పుడు కేసీఆర్ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించి పార్టీ  పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది.  

బీజేపీ తెలుగుదేశం, జనసేనతోనే ఉందా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం, జనసేనలతో జతకట్టిన బీజేపీ పొత్తు ధర్మాన్ని నిజంగానే పాటిస్తోందా? కూటమిలో చేరడం వెనుక ఆ పార్టీకి రహస్య అజెండా ఏదైనా ఉందా అన్న అనుమానాలు పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతున్నాయి.   కూటమిలో చేరడం ద్వారా బీజేపీ తెలుగుదేశం, జనసేన పార్టీలను దెబ్బకొట్టే వ్యూహం ఏదైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా పొత్తు ద్వారా రాష్ట్రంలో అరాచకపాలనకు స్వస్తి చెప్పాలన్న చిత్తశుద్ది బీజేపీలో ఉంటే.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా రాష్ట్రంలో వైసీపీ కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఎందుకు ఉదాశీనంగా ఉంది.  తెలుగుదేశం నేతల వాహనాలను తనిఖీలు చేయడంలో పోలీసులు చూపుతున్న ఉత్సాహం.. వైసీపీ నేతల వాహనాల తనిఖీల విషయంలో ఎందుకు కనిపించడం లేదు.  అలాతే తెలుగుదేశం, జనసేన నేతలపై విమర్శలతో చెలరేగిపోతున్న జగన్ పార్టీ నాయకులు బీజేపీని పల్లెత్తు మాట కూడా అనకుండా సంయమనం పాటించడానికి కారణమేంటి? పలువురు అధికారులు బాహాటంగా జగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా, ఆ విషయంలో సాక్ష్యాలతో సహా ఈసీకి ఫిర్యాదులు అందినా స్పందన ఎందకు లేదు? సామాజిక మాద్యమంలో ఈ ప్రశ్నలు తెగ వైరల్ అవుతున్నాయి.   తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ చేరిన సమయంలో రాష్ట్రంలో ఒక సానుకూలత కనిపించింది. కూటమిలో బీజేపీ చేరినందున అధికారుల ఆటలు సాగవన్న భావన రాజకీయ వర్గాలలో, పరిశీలకులలో చివరకు సామాన్య ప్రజలలో సైతం వ్యక్తం అయ్యింది. జగన్కు అనుకూలంగా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న అధికారులు ఎన్నికల విధులకు దూరం అవుతారనీ, అలాగే జగన్ కు ఇంత కాలం అనుకూలంగా వ్యవహరించిన  జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డీఐజీలు. బీజేపీ భయానికి, ఈసీ కొరడా ఝుళిపిస్తుందన్న బెదురుకు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అంతా భావించారు.  దానికితోడు మోడీ, అమిత్‌షా వంటి అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నందున, డీజీపీ-ఇంటలిజన్స్, సీఎస్, ఇతర ఉన్నతాధికారులను గత ఎన్నికల్లో మాదిరిగా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తారన్న అంతా భావించారు. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. సాక్షాత్తూ   మోడీ హాజరైన చిలకలూరిపేట సభ సందర్భంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు, దానిపై తూతూమంత్రంగా ఈసీ స్పందన చూస్తుంటే.. బీజేపీ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  మోడీ సభ సందర్భంగా ట్రాఫిక్ వైఫల్యంపైనే  చర్యల కొరడా ఝళిపించని ఈసీ.. ఇక రాబోయే రోజుల్లో కూటమి ఫిర్యాదులకు స్పందిస్తుందనుకోవడం, భ్రమేనన్న అభిప్రాయం తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. అంతే కాదు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం అధిష్ఠానం తీరుపై విస్మ యం వ్యక్తం చేస్తున్నారు.  తాము చేసిన ఫిర్యాదులపై కూడా ఈసీ స్పందించకపోవడం చూస్తుంటే తమ పార్టీ హైకమాండ్ ఏదైనా రహస్య అజెండాతో పొత్తులో భాగమైందా అన్న అనుమానం కలుగుతోందని రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం ప్రైవేటు సంభాషణల్లో చెబుతోంది.   కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే, బెంగాల్‌లో డీజీపీని మార్చిన ఈసీ.. ఏపీలోమాత్రం ఇన్చార్జి డీజీపీగా ఉన్న అధికారి జోలికి రాలుదు. ఆయనపై  కూటమి ఫిర్యాదు చేసినా  స్పందించలేదు.   తాజాగా మంగళగిరి టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ వాహనాన్ని, ఒకేరోజు నాలుగుసార్లు ఆపి తనిఖీలు చేయడం కూటమి నేతలను విస్మయపరిచింది.  తనిఖీలు చేయడం సహజమే అయినా  ఒకే నేత వాహనాన్ని ఒకేరోజు నాలుగుసార్లు తనిఖీ చేయడంతో, పోలీసులు ఇంకా వైసీపీ కనుసన్నలలోనే పని చేస్తున్నారనడానికి తిరుగులేని రుజువుగా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   మంత్రుల వాహనాలను ఆపని పోలీసులు లోకేష్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫిర్యాదులపై శరవేగంగా చర్యలు తీసుకోని ఈసీ ముఖేష్‌కుమార్‌మీనాను తప్పించాలన్న అభిప్రాయం కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది.  కోడ్ వచ్చి తనకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ, ఫిర్యాదులపై చర్యలు తీసుకోని అధికారి వల్ల ఫలితం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో జగ న్‌పై వ్యక్తిగతంగా, సంస్థాగతంగా తొలుత యుద్ధం ప్రకటించి.. కూటమి కోసం కృషి చేసిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును కాదని, ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాసవర్మకు టికెట్ ఇవ్వడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   . బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు తనకు సీటు రాకుండా అడ్డం పడి, శ్రీనివాసవర్మకు ఇప్పించారని రఘురామకృష్ణంరాజు   ప్రకటించారు.  ఇవన్నీ చూస్తుంటే.. గత ఐదేళ్లుగా జగన్ అరాచక, అస్తవ్యస్థ, ప్రజా వ్యతిరేక పాలనకు అండదండలందించిన బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల వేళ కూడా దానిని కొనసాగిస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

రఘురామ‌కు నో టికెట్.. కారణమదేనా?

ఏపీలో  బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల అరాచ‌క, అస్తవ్యస్థ, క‌క్ష‌పూరిత‌ పాల‌న‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జా వ్య‌తిరేక ఓటు చీల‌కుండా, త‌ద్వారా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని గ‌ద్దెదింప‌డ‌మే ల‌క్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌,  ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తున్నారు. అయితే, బీజేపీ కేంద్ర పెద్ద‌ల స‌హ‌కారం వీరికి పూర్తిస్థాయిలో అంద‌డం లేద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఇప్పుడు ఆ విష‌యం నిజ‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌కు, రాష్ట్రంలోని ప‌లువురు బీజేపీ నేత‌ల‌కు వైసీపీ నేత‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని, బీజేపీ విడుదల చేసిన ఐదో విడ‌త ఎంపీ అభ్య‌ర్థుల జాబితాతోనే స్ప‌ష్టం అవుతున్నద‌ని పేర్కొంటున్నారు. ఎంపీ అభ్య‌ర్థుల ఐదో జాబితాను బీజేపీ  అధిష్టానం   విడుద‌ల చేసింది. న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను రఘురామ కృష్ణంరాజుకు ఇస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ, భూప‌తిరాజు శ్రీ‌నివాస్ వ‌ర్మ పేరును బీజేపీ హైకమాండ్ నరసాపురం అభ్యర్థిగా ప్ర‌క‌టించింది.  2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌ఘురామ కృష్ణంరాజు వైసీపీ అభ్య‌ర్థిగా పోటీచేసి విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి అప్ర‌జాస్వామిక విధానాల‌తో పాల‌న‌గిస్తూ వ‌చ్చారు. దీంతో జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను తొలిసారి ర‌ఘురామ‌రాజు ప్ర‌శ్నించారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. త‌ట్టుకోలేక పోయిన జ‌గ‌న్ సీఐడీ పోలీసుల‌తో ర‌ఘురామ‌కృష్ణం రాజును టార్చ‌ర్ చేయించారు, అంతేకాదు.. అంతా కాదు లాకప్ లో ధర్డ్ డిగ్రీ ప్రయోగిచారు. అయినా ర‌ఘురామ‌రాజుపై జ‌గ‌న్ కక్ష తీరినట్లు లేదు. న‌ర్సాపురం సీటు విష‌యంలో జ‌గ‌న్ జోక్యం వ‌ల్ల‌నే బీజేపీ అధిష్టానం రఘురామరాజుకు చెక్ చెప్పింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతున్నది. ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చే ఘ‌ట‌న కూడా ఇటీవ‌ల జ‌రిగింది.   జ‌గ‌న్ కు అత్యంత సన్నిహితుడిగా  పేరున్న టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, అమిత్ షాల అపాయింట్ మెంట్ కోరిన‌ట్లు తెలిసింది. దీనికి తోడు ఇటీవ‌ల ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ ఇన్ఛార్జిలుగా ఇద్ద‌రు నియ‌మితుల‌య్యారు. వీరిలో ఒక‌రైన సిద్ధార్థ‌నాథ్ సింగ్ ధ‌ర్మారెడ్డిని వెంట‌బెట్టుకొని బీజేపీ కార్యాల‌యానికి వెళ్లిన‌ట్లు తెలిసింది. అయితే, ఆ స‌మ‌యంలో న‌డ్డా బిజీగా ఉండ‌టంతో వారికి అపాయింట్ మెంట్ దొర‌క‌లేద‌ని తెలుస్తోంది. ర‌ఘురామ‌రాజుకు న‌ర్సాపురం పార్ల‌మెంట్ టికెట్ ఇవ్వ‌ద్ద‌ని కోర‌డానికే వారు న‌డ్డా, అమిత్ షాలో భేటీ అయ్యేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలుస్తోంది. నేరుగా బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసే అవ‌కాశం దొర‌క్క‌పోవ‌టంతో.. రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగాఉన్న కొంద‌రు బీజేపీ నేత‌ల స‌హ‌కారంతో వైసీపీలోని ప‌లువురు నేత‌లు ఫోన్ ద్వారా వారిని సంప్ర‌దించి ర‌ఘురామ రాజుకు న‌ర్సాపురం టికెట్ ఇవ్వొద్ద‌ని కోరిన‌ట్లు స‌మాచారం. ర‌ఘురామ‌రాజుకు కాకుండా వేరేవారికి న‌ర్సాపురం సీటును కేటాయిస్తే, అక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి విజ‌యంతో పాటు, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రికొన్ని చోట్ల బీజేపీ అభ్య‌ర్థుల విజ‌యానికి స‌హ‌కారం అందిస్తామ‌ని జ‌గ‌న్ రాయ‌భారం పంపిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతున్నది. జ‌గ‌న్ ఆఫ‌ర్‌తో బీజేపీ పెద్ద‌లు ర‌ఘురామ‌రాజుకు టికెట్ ఇవ్వ‌లేదని తెలుస్తోంది. ఈ విష‌యంపై ర‌ఘురామ‌రాజు స్పందిస్తూ.. తొలినుంచి త‌న‌ను ఇబ్బందిపెట్టాల‌ని చూసిన జ‌గ‌న్‌.. న‌ర్సాపురం టికెట్ విష‌యంలో   ఎట్ట‌కేల‌కు పైచేయి సాధించారని, అయితే, ఈ విష‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాష్ట్రంలో  వైసీపీకి అనుకూలంగాఉన్న బీజేపీ నేత‌ల సహకారం లభించిందని  పేర్కొన్నాడు.   ర‌ఘురామ‌రాజుకు సీటు నిరాక‌రించ‌డం వెనుక జ‌గ‌న్ హ‌స్తం ఉంద‌ని అనుకుంటే.. ఆయ‌న మాటే ఇంకా బీజేపీలో చెల్లుబాటు అవుతోంద‌నీ, బీజేపీ పెద్ద‌లుసైతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ‌దులుకునేందుకు సిద్ధంగా లేర‌ని అనుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేలా బీజేపీ స‌హ‌క‌రిస్తుందా అనే అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేదు. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు బీజేపీతో పొత్తుపెట్టుకోవ‌టానికి ప్రధాన కారణం ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల అరాచ‌కాల‌ను చెక్ పడుతుందన్న ఉద్దేశంతోనే.   అందుకే బీజేపీ అడిగిన‌ట్లు ఆరు పార్ల‌మెంట్‌, పది అసెంబ్లీ సీట్ల‌ను ఆ పార్టీకి కేటాయించాయి. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీ కేంద్ర పెద్ద‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీలోని ప‌లువురు నేత‌లు చెప్పిన‌ట్లుగా టికెట్లు కేటాయిస్తున్నార‌న్న అంశం ఏపీ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపేస్తుంది. పొత్తు ధ‌ర్మాన్ని బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌తోపాటు, రాష్ట్రంలోని ప‌లువురు క‌మ‌లం నేత‌లు విస్మ‌రిస్తున్నార‌ని పలువురు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు అంటున్నారు.  జ‌గ‌న్ అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌కుంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏం ఉప‌యోగం అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చినా వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌టం లేదు. పోలీస్ శాఖ‌లోని కీల‌క ప‌ద‌వుల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా ఉండే అధికారుల‌ను నియ‌మించుకున్నారు. దీంతో తెలుగుదేశం నేత‌ల వాహ‌నాల వాహ‌నాల‌ను ఆపి చెక్ చేస్తున్నారు. వైసీపీ నేత‌ల జోలికి వెళ్ల‌డం లేద‌ని ఉదాహరణలతో సహా చూపుతున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాహ‌నాన్ని ఇప్ప‌టికే నాలుగు సార్లు త‌నిఖీల పేరుతో ఆప‌ిన సంగతి తెలిసిందే.   ఇప్ప‌టికైనా బీజేపీ కేంద్ర పెద్ద‌లు పొత్తు ధ‌ర్మాన్ని విస్మ‌రించ‌కుండా వైసీపీ అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు కోరుతున్నారు.

పెద్దపల్లి బుగ్గస్వామి గుట్టపై క్రీ.శ. 8వ శతాబ్ది శివలింగం

 రాష్ట్ర కూటుల కాలపు శివలింగం  కాపాడుకోవాలంటున్న శివనాగిరెడ్డి కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో తెలకపల్లి మండలం పెద్దపల్లి బుగ్గస్వామి గుట్ట పైన రాష్ట్ర కూటుల కాలపు శివలింగం ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.  ప్రముఖ కవులు వనపట్ల సుబ్బయ్య ,ముచ్చర్ల దినకర్ ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక వెంకటేశ్వర ఆలయ జీర్ణోద్దరణ పనులపై పరిసరాలను పరిశీలిస్తుండగా రాతిని తొలిచి మలిచిన 5 అడుగుల వ్యాసంతో పానవట్టం మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించటం కోసం అడుగు వ్యాసంలో ఆరు అంగుళాల లోతున గుంట చెక్కబడిందని, వాస్తు శిల్పశైలిని బట్టి ఈ శివలింగ పానవట్టం ఇప్పటికి 1200 ల , సంవత్సరాల నాటిదని ఆయన పేర్కొన్నారు. క్రీ.శ.8వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాష్ట్ర కూటుల కాలానికి చెందిన  ఈ శివలింగాన్ని కాపాడుకోవాలన శివనాగిరెడ్డి అన్నారు. అదే గుట్టపై 200 సంవత్సరాల నాటి శాసనముందని అందులో దేవేంద్రపురికి చెందిన మునీశ్వరుని శిష్యులైన ఉపేంద్రపురి విశ్వనాధుల ప్రస్తావన ఉందని వీరిద్దరూ ఇక్కడ సిద్ధిపొందారని ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి గ్రామస్తులు సురభి సత్యపాల్ రావు,కేశవులు గౌడ్ ,దర్శి రాజయ్య ,కందూర్ లక్ష్మణ స్వామి, బాలస్వామి గౌడ్,అర్చకులు వంశీకృష్ణ స్థపతి భీమిరెడ్డి వెంకట్ రెడ్డి శిల్పి ఎల్లయ్య బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సైనికుడి భూమి కబ్జా.. అడ్డంగా దొరికిన బొత్స.. అరెస్టు తప్పదా?

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు ఏపీ ప్ర‌జ‌లు సిద్ద‌మ‌వుతున్నారు.  మే 13న జ‌రిగే పోలింగ్‌లో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింపేందుకు ఉత్స‌క‌త‌తో ఎదురుచూస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ఏపీలో అభివృద్ధి సంగ‌తి అటుంచితే.. ప్ర‌జ‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలుకూడా క‌రువ‌య్యాయి. వేధింపులు తోడయ్యాయి. వైసీపీ నేత‌లు ఇసుక, మ‌ట్టి దోపీడీతో కోట్లాది రూపాయ‌లు జేబుల్లో వేసుకున్నారు. అధికారంలోకి వ‌స్తే మ‌ద్య‌పాన నిషేదాన్ని అమ‌లు చేస్తాన‌న్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్ల‌లో మ‌ద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు.   సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యాన్ని విక్ర‌యించి  వేల‌ కోట్లు ప్ర‌జాసొమ్మును జేబుల్లో వేసుకోవడమే కాకుండా ప్రజారోగ్యాన్ని గుల్ల చేశారు. ఇక భూ క‌బ్జాల వ్య‌వ‌హారం చెప్ప‌నే అక్క‌ర్లేదు.  గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ఎక్క‌డ వీలుంటే అక్క‌డ‌ భూముల‌ను వైసీపీ నేత‌లు క‌బ్జాలు చేస్తూ వ‌చ్చారు. తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ భూక‌బ్జా వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. దానికి సంబంధించి విచార‌ణ చేయాల‌ని హస్తిన నుంచి లేఖ‌ కూడా వ‌చ్చింది. అయితే  ఎన్నిక‌ల వేళ ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని భావించిన ప్ర‌భుత్వం. ఈ లేఖ‌ను తొక్కిప‌ట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా అది కూడా వెలుగులోకి రావ‌టంతో బొత్స స‌త్య‌నారాయ‌ణపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై ఇప్ప‌టికే అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో బొత్స‌పై వోక్స్‌వ్యాగ‌న్ స్కాం ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఆయ‌న‌ భూక‌బ్జాల వ్య‌వ‌హారం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో రెండువేల ఎకరాలకు పైగా భూములు బొత్స కుటుంబ అధీనంలో ఉన్నాయన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. బొత్స, ఆయ‌న వ‌ర్గీయులు అందిన‌ కాడికి భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇవి చాల‌వ‌న్న‌ట్లు ఓ మాజీ సైనికుడి భూమిని బొత్స, ఆయ‌న వ‌ర్గీయులు క‌బ్జాకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. స్వ‌యంగా ఆ మాజీ సైనికుడు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాని కార్యాల‌యానికి లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆయ‌న వ‌ర్గీయులు తన రిటైర్మెంట్ త‌రువాత ర‌క్ష‌ణ శాఖ‌ కేటాయించిన 4.75 ఎక‌రాల భూమిని క‌బ్జాచేశారనీ, క‌బ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ మాజీ సైనికుడు సింగంశెట్టి శ్రీ‌నివాస్ ఏకంగా ప్ర‌ధాని కార్యాల‌యంకు లేఖ రాశారు. ప్ర‌ధాని కార్యాల‌యం ఆ లేఖ‌ను  రక్షణ శాఖకు పంపించింది. సింగంశెట్టి శ్రీ‌నివాస్ లేఖ‌ను జ‌త‌ చేస్తూ.. పూర్తి స్థాయి విచార‌ణ చేసి నివేదిక ఇవ్వాల‌ని చిత్తూరు క‌లెక్ట‌ర్ కు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ లేఖ‌ను పంపించింది. ఒక‌వేళ నిజంగా క‌బ్జాకు గురై ఉంటే సంబంధింత వ్య‌క్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ లేఖ‌ స్పష్టంగా పేర్కొంది.   ప్ర‌ధాని కార్యాల‌యానికి మాజీ సైనికుడు పంపించిన లేఖ‌లో భూమికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ల‌ను జ‌త‌ చేశారు. ఎప్పుడు తాను రిటైర్ అయ్యింది.. ఎప్పుడు త‌న‌కు ర‌క్ష‌ణ‌శాఖ భూమిని కేటాయించింది అనే విష‌యాలను పూర్తి వివరాలతో ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాని కార్యాల‌యానికి రాసిన లేఖలో సింగంశెట్టి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. ఈ లేఖ‌లో క‌బ్జాకు పాల్ప‌డిన వారిలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ చైర్మ‌న్‌ చిన్న శ్రీ‌ను, పార్ల‌మెంట్ సభ్యుడు చంద్ర‌శేఖ‌ర్  పేర్ల‌ను ప్ర‌స్తావించారు. ఈ లేఖ‌ను జ‌న‌వ‌రి 10న ప్ర‌ధాని కార్యాల‌యానికి పంపించ‌గా..ర‌క్ష‌ణ శాఖ నుంచి విచార‌ణ జరిపి కబ్బాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ  చిత్తూరు క‌లెక్ట‌ర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వానికి జ‌నవ‌రి 12న ఆదేశాలు వచ్చాయి. అయితే వాటిని తొక్కిపెట్టారు. కానీ  తాజాగా ఆ లేఖ వెలుగులోకి వ‌చ్చింది. లేఖ‌లో ర‌క్ష‌ణ‌శాఖ‌ పేర్కొన్న‌ట్లుగా చిత్తూరు క‌లెక్ట‌ర్ విచార‌ణ చేసి నివేదిక పంపించిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాచారం లేదు. దీంతో ర‌క్ష‌ణ శాఖ ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వాళ్లే ఒక క‌మిటీ వేసి మాజీ సైనికుడి భూమి నిజంగా క‌బ్జా అయిందా? ఎవ‌రు క‌బ్జా చేశారు అనే విష‌యాల‌పై ఆరా తీయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే క‌బ్జా చేసిన‌ట్లు బ‌య‌ట ప‌డుతుంద‌ని బొత్స, ఆయ‌న వ‌ర్గీయుల్లో ఆందోళ‌న మొద‌లైన‌ట్లు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చ‌ర్చ జ‌రుగుతున్నది. మాజీ సైనికుడి భూమిని క‌బ్జా చేయ‌డం అంటే అంత‌ తేలికైన విష‌యం కాదు. ప్ర‌ధాని కార్యాల‌యం మాజీ సైనికుడి లేఖ‌ను సీరియ‌స్ గా తీసుకుంటే క‌బ్జాదారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం ఉంటుంది. ఈ ఒక్క క‌బ్జాతోనే విచార‌ణ ఆగ‌దు.. తీగ‌ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా బొత్స, ఆయ‌న వ‌ర్గీయుల భూక‌బ్జాల వ్య‌వ‌హారం మొత్తం వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో మంత్రి వ‌ర్గీయుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందన్న చ‌ర్చ జ‌రుగుతున్నది.    మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, ఆయ‌న అనుచ‌రులు చీపురుప‌ల్లి, విజ‌యన‌గ‌రం ప్రాంతాల్లో ఇప్ప‌టికే గుట్టలు, కొండ‌లు తవ్వేయ‌డంతోపాటు అనేక ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ర‌క్ష‌ణ శాఖ‌, ప్ర‌ధాని కార్యాల‌యం మాజీ సైనికుడి భూమిని క‌బ్జా విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తే బొత్సాకు క‌బ్జాల ఉచ్చు బిగుసుకోవ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. దీంతో బొత్స స‌త్య‌నారాయ‌ణ అల‌ర్ట్ అయిన‌ట్లు స‌మాచారం. క‌బ్జాల వ్య‌వ‌హారం ఉచ్చు మెడ‌కు చుట్టుకోక‌ముందే బీజేపీ నేత‌ల‌ను అప్రోచ్ అయ్యి వారి ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. అదీ కాకుంటే అవ‌స‌ర‌మైతే బీజేపీలోకి వెళ్లి.. మాజీ సైనికుడితో సెటిల్ మెంట్ చేసుకొని ఆ భూమిని ఆయ‌న‌కే అప్ప‌గించే ఆలోచ‌న‌లో బొత్స వ‌ర్గం ఉన్న‌ట్లు ఏపీలో ప్ర‌చారం జ‌రుగుతున్నది. మొత్తానికి ఎలాగైనా మాజీ సైనికుడి భూక‌బ్జా వ్య‌వ‌హారంపై ప్ర‌ధాని కార్యాల‌యం, ర‌క్ష‌ణ శాఖ సీరియ‌స్ కాక‌ముందే ఈ స‌మ‌స్య‌ను ఎలాగైనా ప‌రిష్క‌రించుకోవాల‌ని, లేకుంటే ఇన్నాళ్లు మ‌నం చేసిన భూక‌బ్జాల వ్య‌వ‌హారంలు కూడా వెలుగులోకి వ‌చ్చి అరెస్టుకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళన బొత్స సత్యనారాయణ, ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతోందని అంటున్నారు.