తెలుగుదేశం కూటమిదే హవా .. శ్రీ ఆత్మసాక్షి సర్వే
posted on Mar 27, 2024 @ 10:58AM
ఏపీలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. వైసీపీ అభ్యర్థులు గెలుపుపై బహిరంగంగా ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల ఓటమి భయం వారిని వెంటాడుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో దాదాపు ఓటమి ఖాయమన్న భావనకు వైసీపీ అభ్యర్థులు వచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అన్నిప్రముఖ సర్వే ఫలితాల్లోనూ వైసీపీ అధికారాన్ని కోల్పోవటం ఖాయమని తేలుతుండటంతో జగన్ శిబిరంలో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. ఆ ఆందోళన నుంచే కొన్ని ఫేక్ సర్వేలను వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో పెడుతోంది. తద్వారా ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేసేలా వైసీపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి సర్వే ఫలితాలు అంటూ మూడు రోజుల క్రితం ఒక సర్వే వెలుగులోకి వచ్చింది. ఈ సర్వే ఫలితాల్లో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. ఆ సర్వే శ్రీ ఆత్మసాక్షి ఒరిజినల్ సర్వే అంటూ వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రముఖ సంస్థల సర్వేల ఫలితాల్లో కూటమి విజయం ఖాయమని తేలింది. కానీ, ఆత్మసాక్షి సర్వే అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసిన సర్వేలో మాత్రం వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఆ సర్వే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో నే శ్రీ ఆత్మసాక్షి తాజా సర్వే ఫలితాలు వెలుగులోకి రావటంతో వైసీపీ నేతల కుట్రలు ఏమిటో మరోసారి తేటతెల్లమయ్యాయి.
రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ సర్వేలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే వెల్లడైన ప్రముఖ సర్వేలన్నింటిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిదే విజయం అని తేలింది. తాజాగా ప్రముఖ సర్వే సంస్థల్లో ఒకటైన శ్రీఆత్మసాక్షి తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తప్పదని సర్వే పేర్కొంది. ఏపీలో ప్రస్తుత పరిస్థితిని బట్టిచూస్తే జగన్ పార్టీకి 21 నుంచి 25 అసెంబ్లీ సీట్లకు మించి రావని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఈ సర్వే ఫలితాల ప్రకారం. అధికార వైసీపీకి 41.5శాతం, కూటమికి 53.5 శాతం ఓటింగ్ నమోదవుతుందని తేలింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 136 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, 21 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక 18 నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఆ హోరాహోరీ స్థానాలలో కూడా పదికిపైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులకే ఎడ్జ్ ఉంటుందనీ పేర్కొంది. పార్లమెంట్ ఫలితాల్లోనూ కూటమిదే హవా కొనసాగనుంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వే ఫలితాల్లో తేలింది. మూడు స్థానాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, అందులోనూ రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థి, ఒక స్థానంలో వైసీపీ అభ్యర్థికి ఎడ్జ్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.
ఉమ్మడి జిల్లాల వారిగా శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి..
శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.
విజయనగరం ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం ఖాయమని, నాలుగు నియోజక వర్గాల్లో కూటమి అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, వీటిల్లోనూ మూడు సీట్లలో కూటమి అభ్యర్థులకే విజయావకాశాలు ఉంటాయని సర్వే పేర్కొంది.
విశాఖపట్టణం ఉమ్మడి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని, కేవలం ఒక్క నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా మార్చుతానని సీఎం జగన్ చెప్పినప్పటికీ.. అక్కడి ప్రజలు జగన్, వైసీపీ నేతలను నమ్మే పరిస్థితిల్లో లేరని శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాన్ని బట్టి అర్ధమౌతుంది. రాజధాని పేరుతో ఇప్పటికే వైసీపీ నేతలు విశాఖలో భూదందాకు భారీగా తెరలేపారు. దీంతో విశాఖ ప్రజలు రాజధాని అంటేనే ఆందోళన చెందుతున్న పరిస్థితి.
ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండగా వాటిలో 17 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, ఒక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. ఒక నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని, అందులోనూ టీడీపీ కూటమి అభ్యర్థికే ఎడ్జ్ ఉంటుందని పేర్కొంది.
అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. 13 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, రెండు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని.. అందులో నూ ఒక నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి, మరో నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎడ్జ్ సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉండగా, 15 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధింస్తారని, ఒక నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని, అందులోనూ కూటమి అభ్యర్థులకే విజయావకాశాలు ఉంటాయని సర్వే పేర్కొంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ని 17 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉంటుందని, అందులోనూ కూటమి అభ్యర్థి విజయానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.
- ప్రకాశం ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు, మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు, ఒక నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని, అందులో వైసీపీ అభ్యర్థి విజయానికి అవకాశాల ఉంటాయని సర్వే ఫలితాల్లో తేలింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు, ఒక స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజక వర్గాల్లో ఐదు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వే ఫలితాల్లో తేలింది. మూడు స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని, వాటిల్లో రెండింటిలో వైసీపీ అభ్యర్థులు, ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.
కర్నూల్ ఉమ్మడి జిల్లాలో ని 14 నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు, ఆరు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వే ఫలితాల్లో తేలించింది. రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు సాగుతుందని, వాటిల్లో ఒకటి కూటమి అభ్యర్థి, ఒకటి వైసీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో కూమి అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఒక స్థానంలో వైసీపీ అభ్యర్థి, మరో రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని సర్వే తేల్చింది.
చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు, మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉంటుందని, అయితే ఆ ఒక్క స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థి విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.