ఆ ఇద్దరితో నష్టమే.. వదిలించుకోకుంటే కష్టమే!
posted on Mar 26, 2024 @ 12:17PM
ఏ ఎన్నికైనా గెలవాలంటే ఏ పార్టీ అయినా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అందులోనూ పొత్తులు పెట్టుకున్న సందర్భాలలో కొన్ని త్యాగాలూ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి ఎన్నికల్లో అయితే.. పార్టీ అధిష్టానాలు మొహమాటాలకు పోకుండా గెలిచే అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలి. పార్టీ బలోపేతం కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలైనా సరే ప్రజాబలం లేకుంటే పక్కన పెట్టాల్సిందే. ప్రజాబలం ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇస్తేనే పార్టీ బలోపేతంతో పాటు, అధికారంలోకి రావటానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో జరగనున్న ఎన్నికల్లో , తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండుమూడు సార్లు సర్వేలు చేసి గెలుపు గుర్రాలు అవుతారన్న నమ్మకం వచ్చిన తరువాతే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కొన్ని త్యాగాలు సైతం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే తరహాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే అలాంటి పొత్తు ధర్మం, మిత్ర ధర్మం బీజేపీ వైపు నుంచి కనిపించడం లేదు. ఆ పార్టీ ఒ్తతిడులకు తలొగ్గో, ఆధిపత్యం మాదే అని రుజువు చేసుకోవడానికో, మరో కారణంతోనో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యంగా కొన్ని స్థానాల విషయంలో పొత్తు ధర్మానికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది.
బీజేపీ ఇప్పటికే ఏపీలో పార్లమెంట్ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, ప్రజాబలం ఏ మాత్రం లేని పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచు తున్నారు. వారి ఒత్తిడికి తలొగ్గి అసెంబ్లీ టికెట్లు ఇస్తే వైసీపీ నెత్తిన పాలుపోసినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మే13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు విడతల్లో 139 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మూడు నాలుగు సార్లు సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాలు అవుతారనుకున్న వారికి టికెట్లు ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతలను పక్కన పెట్టేందుకు సైతం చంద్రబాబు నాయుడు వెనుకాడలేదు. టికెట్ రాని నేతలు సైతం చంద్రబాబు నిర్ణయాన్ని అర్థంచేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు దక్కాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించారు. వీరి ఎంపికకోసం పవన్ మూడునాలుగు సార్లు సర్వేలు నిర్వహించి సీట్లు కేటాయించారు. ఈ క్రమంలో సీట్లు దక్కని జనసేన నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ.. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని పవన్ క్లారిటీగా చెప్పేశాడు. తెలుగుదేశం, జనసేనలు అభ్యర్థుల ఎంపిక విషయంలో పక్కా క్లారటీతో ముందుకు సాగుతుంటే.. బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ సీట్లు దక్కాయి. ఇప్పటికే ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వేలను ప్రామాణికంగా తీసుకున్నట్లే చెబుతోంది. పార్లమెంట్ స్థానాల్లో సీటు ఆశించిన బీజేపీ నేతలు సోమువీర్రాజు, జీవీఎల్ నర్సింహారావులాంటి నేతలను బీజేపీ అధిష్టానం నిర్మొహమాటంగా పక్కన పెట్టేసింది. ఒక్క నరసాపురం లోక్ సభ స్థానం విషయంలోనే బీజేపీ గెలుపు అవకాశాలున్న రఘురామకృష్ణం రాజును పక్కన పెట్టి అనామకుడి వంటి అభ్యర్థిని నిలబెట్టింది. అందుకు కారణాలపై ఇప్పటికే విస్తృత చర్చ జరిగింది. జరుగుతోంది.
అది పక్కన పెడితే.. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఇహనో ఆ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఆ పార్టీకి పది అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు గ్యారంటీ అభ్యర్థులు లేరు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం బీజేపీ నిస్సం దేహంగా తెలుగుదేశం, జనసేన పార్టీలపైనే ఆధారపడి ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని ఒక వర్గం మాత్రం నేల విడిచి సాము చేస్తున్నది. తమకు పార్టీ టికెట్ ఇచ్చి తీరాలని హఠం చేస్తున్నది. ఇందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నది. అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నది. ఆ వర్గంలో ముఖ్యంగా సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహారావు లాంటి నేతలు ఉన్నారు. వీరిరువురూ కూడా ఎంపీ టికెట్ కోసం బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే ఎంపీ టికెట్ విషయంలో వీరి పప్పులు ఉడక లేదు. ఎంపీ టికెట్ల విషయంలో ఒక్క నరసాపురం సీటు మినహాయిస్తే బీజేపీ చాలా వరకూ హుతుబద్ధంగానే అడుగులు వేసింది. పొత్తు ధర్మాన్ని పాటించింది. తెలుగుదేశం, జనసేనల సూచనలమేరకే అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అసెంబ్లీ స్థానాల విషయంలో ఆ పార్టీ చేస్తున్న తాత్సారం ఇస్తున్న లీకులు మాత్రం ఒకింత అనుమానాస్పదంగా ఉన్నాయి. పార్లమెంటుకు పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకోవడంలో విఫలమైన సోము, జీవీఎల్లు ఇప్పుడు ఎలాగైనా అసెంబ్లీ టికెట్లైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. వారి ప్రయత్నాల విషయంలో బీజేపీ అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తోందన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగితే తమకు డిపాజిట్లు కూడా రావని స్వయంగా సోము వీర్రాజు, జీవీఎల్ కు కూడా తెలుసు. వారి పట్ల ఏపీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ శ్రేణులు కూడా వారింత కాలం రాష్ట్రంలో అధికార వైసీపీకి కోవర్టులుగా పని చేశారని బాహాటంగానే చెబుతున్నాయి.
బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించింది. సోమువీర్రాజు, జీవీఎల్ నర్సింహారావుల పేర్లతో ఆయా నియోజకవర్గాల్లో అధిష్టానం నిర్వహించిన సర్వేల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సోము వీర్రాజు, జీవీఎల్ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వీరు వైసీపీ కోవర్టులని విస్తృత ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం వారికి టికెట్లు ఇచ్చినా టీడీపీ, జనసేన ఓటర్లు సహకరించడం అనుమానమే. టీడీపీ, జనసేన సహకరించకుంటే వారికి డిపాజిట్లు కూడా రావు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం వారి ఒత్తిడికి తలొగ్గి అసెంబ్లీ టికెట్లు ఇస్తే.. ముందుగానే రెండు నియోజకవర్గాల్లో కూటమి ఓటమిని ఒప్పుకున్న ట్లవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ అధిష్టానం వైసీపీకి అనుకూలంగా వ్యవహరి స్తున్నదన్న ప్రచారం రఘురామకృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఏపీలో విస్తృతంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహారావులకు టికెట్లు కేటాయిస్తే ఆ ప్రచారం నిజమని జనం నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే ఎన్నికల్లో కూటమి పార్టీల ఐక్యతకు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం ఇద్దరి టికెట్ల కోసం కూటమి ఐక్యతను దెబ్బతీసేలా బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తుందని అనుకోవటం లేదని అంటున్నారు. ఒక వేళ అలా వ్యవహరిస్తే.. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు వెనుక జగన్ ను గెలిపించాలన్న రహస్య అజెండా ఉందని జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని నిర్ధారణ అవుతుందని అంటున్నారు.