ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్, బీజేపీ ముక్తకంఠం!
posted on Mar 27, 2024 @ 9:53AM
కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలు. ఇంకా చెప్పాలంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు పార్టీలూ బద్ధ శత్రువులు, చిరకాలంగా రాజకీయ ప్రత్యర్థులు. బీజేపీ అయితే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దేశంలో ఆ పార్టీ ఉనికిని నామమాత్రం చేయాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీని మత ఛాందసవాద పార్టీగా, దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్న పార్టీగా విమర్శలు గుప్పిస్తుంటుంది. అటువంటి పార్టీలు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. క్లియర్ కట్ గా చెప్పాలంటే యుగళగీతం పాడుతున్నాయి. అదీ తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఒకే ఒక విషయంలో ఆ రెండు పార్టీలూ ముక్తకంఠంతో విమర్శలు గుప్పిస్తున్నాయి. అదీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు వంటి అంశాలలో ఇరు పార్టీలూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ దొందూ దొందేనని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే... రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రహస్య మైత్రి నెరపుతున్నాయని బీజేపీ దుమ్మెత్తిపోస్తున్నది. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం రెండుపార్టీలూ ఏకాభిప్రాయ వ్యక్తం చేస్తున్నాయి.
కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు కాంగ్రెస్, బీజేపీ నేతలు బాధితులు కావడమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి మాత్రమే కాదు బీజేపీ సీనియర్ నేత, అప్పటికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే. ఫోన్ ట్యాపింగ్ బాధితులైన కాంగ్రెస్, బీజేపీ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో కాంగ్రెస్ తో గళం కలిపి విమర్శలకు దిగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాథమిక నిందితుడిగా పేర్కొనాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేశారని, తన ప్రచార పద్దతులను బయటపెట్టారని, ఇబ్బందులు కలుగజేశారని పేర్కొన్నారు.
మొన్నటి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా ఫోన్ ట్యాపింగే కారణమన్నారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ చేసి కేసుల్లో ఇరికించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పట్లో కేసీఆర్ కు సన్నిహితుంగా మెలిగిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందని ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారని అంటున్నారు. ఆ దిశగా ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. త్వరలో ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఒక ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ అధినేతపై విమర్శల విషయంలో ఏకతాటిపైకి రావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు పార్టీలూ కూడా ఒకే రకమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయం సామాన్య జనంలో కూడా కలుగుతున్నది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సమాధానం చెప్పుకోలేని అంశంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.