మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఇక జమిలి ఎన్నికలే?
posted on Mar 26, 2024 @ 2:46PM
దేశంలో లోక్ సభ, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికలకు ఒకే సారి ఎన్నికలు జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే..2029 నుంచి దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయనడంలో సందేహం అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ రెండో సారి అధికారం చేపట్టిన నాటి నుంచీ దేశంలో జమిలి ఎన్నికలపై దృష్టి పెట్టారు. దేశంలో జమిలి ఎన్నికలు అనడానికి మోడీ ఏ కారణాలైనా చెప్పవచ్చు.. కానీ అసలు కారణం మాత్రం కేంద్రంలో అధికారంలో ఉండగా లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగితే బీజేపీకి ప్రయోజనం ఉంటుందనేదే అన్న విషయంలో సందేహాలుకు అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అయితే ప్రధాని మోడీ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటే జమలి ఎన్నికల నిర్వహణ కూడా జరగాలని భావించారు. ఎంతో పట్టుదలతో ఆ దిశగా అడుగులు కూడా వేశారు. అయితే వ్యవధి తక్కువ ఉండటం, కేంద్ర ఎన్నికల సంఘం ఆ వ్యవధిలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్న సంకేతాలు ఇవ్వడం.. అన్నిటికీ మించి అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేసేందుకు కావలసిన బలం బీజేపీకి రాజ్యసభలో లేకపోవడంతో మోడీ తన లక్ష్య సాధనకు మరో సారి అధికారం చేపట్టడం వరకూ ఆగక తప్పని సరి అయ్యింది.
అందుకే ఈ సారి రెండు సభలలోనూ బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉండాలన్న లక్ష్యంతో 2024 ఎన్నికలకు పావులు కదిపారు. బీజేపీకి సొంతంగా 360 స్థానాలు, ఎన్డీయే కూటమితో కలుపుకుని 400కు పైగా స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్య సాధనకు అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ మౌలిక లక్షణాలకు, ఆ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న గుర్తింపునకు చెల్లుచీటీ పాడేయడానికి కూడా వెనుకాడటం లేదు. దేశంలో బీజేపీ అంటే క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధతకు మారుపేరుగా ఇంత కాలం జనం భావించేవారు.
కమ్యూనిస్టుల తరువాత కమలం పార్టీలోనే భావ ఐక్యత కనిపిస్తుందన్న భావన ఉండేది. కానీ మోడీ 2.0 అంటే 2019 ఎన్నికలలో విజయం సాధించి వరుసగా రెండో సారి మోడీ నేతృత్వంలో అధికార పగ్గాలు అందుకున్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలలో బీజేపీ పట్ల ఉన్న భావనను పూర్తిగా తుడిచి పెట్టేసింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, తద్వారా రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూల్చివేసైనా సరే అధికారం చేపట్టాలన్న టార్గెట్ ను పార్టీ నేతలకు, క్యాడర్ కు నిర్దేశించడం ద్వారా బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ కంటే రెండాకులు ఎక్కువే చదివిందన్న భావన సామాన్య జనంలో సైతం ఏర్పడింది.
ఇక జమిలి ఎన్నికల విషయానికి వస్తే.. దేశంలో లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలను నిర్వహించాలన్న బీజేపీ ప్రభుత్వ పట్టుదల దాదాపు ఫలించేసిందనే చెప్పాలి. మోడీ సర్కార్ ప్రతిపాదకు ఆమోదముద్ర పడిందనే భావించాలి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం మోడీ సర్కార్ నియమించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు అనుకూలంగా నివేదిక సమర్పించింది. లోక్ సభ, శాసనసభ, మున్సిపల్ ఎన్నికలను ఏక కాలంలో నిర్వ హించడం దేశానికి అన్ని విధాలా మేలు చేస్తుందని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాయకత్వంలోని కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను అందజేసింది. అంటే ప్రభుత్వ ప్రతిపాదన భేషుగ్గా ఉందని కమిటీ నిర్ధారించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షణం నుంచి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఏమిటన్నది అందరికీ తెలిసిపోయింది. ఆ కమిటీని ఏర్పాటు చేసింది జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కాదనీ, జమిలి ఎన్నికలే శరణ్యమని చెబుతూ నివేదిక ఇవ్వడానికేనని విపక్షాలు అప్పట్లోనే విమర్శలు గుప్పించాయి.
జమిలి ఎన్నికలను అంటే లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏక కాలంలో వంద రోజుల లోపల నిర్వహించాలని, ఇది సాధ్యమయ్యే విషయమేనని, ఇది ప్రజాస్వామ్యానికి గానీ, రాజ్యాంగానికి గానీ, సమాఖ్య స్ఫూర్తికి గానీ ఏమాత్రం విరుద్ధం కాదని రామ్ నాథ్ కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందుకు తగ్గట్టుగా ఓటర్ల కార్డులను, ఓటర్ల జాబితాలను రూపొందించాల్సి ఉంటుందని కమిటీ సూచించింది. వివిధ రాజకీయ పక్షాల నుంచి, వివిధ వర్గాల నుంచి, ఆసక్తి చూపించిన వ్యక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించగా, అత్యధికులు ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానానికి అనుకూలంగానే అభిప్రాయం తెలిపారని కమిటీ విస్పష్టంగా చెప్పింది. అయితే కమిటీ నివేదిక విశ్వసనీయతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల వనరులు వృథా అవుతాయి, అధిక కాలం పాలనా యంత్రాంగం స్తంభించిపోతుంది. సామాజిక, ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. ఓటింగ్ పట్ల ప్రజలకు ఆసక్తి పోతుంది. అంటూ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయాలు... ఇప్పటి వరకూ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీసుకురావడానికి మోడీ సర్కర్ చెబుతున్న కారణాలు కూడా ఇవే కావడంతో ప్రభుత్వం చెప్పిన దానిని ఓకే అనడానికే రామ్ నాథ్ కోవింద్ కమిటీ పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలను కమిటీ పరిగణనలోనికి తీసుకున్నట్లు కనిపించడం లేదు. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు విభిన్న అంశాలపై జరుగుతాయని, ఈ విభిన్న అంశాల ప్రస్తావనకు జమిలి ఎన్నికల్లో సమాధానాలు దొరకడం దుర్లభమవుతుందని ప్రతిపక్షాలు, విమర్శకులు నెత్తీనోరూ బాదుకుని చెబుతున్నా కమిటీ ఖాతరు చేయలేదు. జమిలి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ పార్టీలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయనీ, దీనివల్ల ప్రాంతీయ పార్టీల అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్న మాటలను కూడా కమిటీ పరిగణనలోనికి తీసుకోలేదు. మొత్తం మీద కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే 2029 నుంచి దేశంలో జమిలి ఎన్నికలు తప్పవని పరిశీలకులు అంటున్నారు.