ఏపీలో విద్యుత్ కోతలు.. జగన్ పవర్ కట్ కు బాటలు!
posted on Mar 27, 2024 9:25AM
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలకు రంగం సిద్ధమైంది. రానున్న రోజులలో నిర్ణీత వేళల్లో విద్యుత్ కోతలు అనివార్యంగా మారాయి. బొగ్గు కొరత, విద్యుత్ కంపెనీలకు గుట్టలా పేరుకుపోయిన బకాయిల కారణంగా జగన్ సర్కార్ ఈ వేసవిలో రాష్ట్రంలో గంటల తరబడి విద్యుత్ కోతలు విధించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది.
విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామాల్లో రోజుకు ఎనిమిది గంటలు, పట్టణాలలో ఆరు గంటల విద్యుత్ కోతకు అధికారులు ఇప్పటికే షెడ్యూల్ రూపొందించారు. బొగ్గు, విద్యుత్ కంపెనీలకు రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వ బకాయిలు 35వేల కోట్ల రూపాయలకు పెగా పేరుకుపోయాయి. దీంతో బొగ్గు కొనుగోళ్లు నిలిచిపోయాయి. అంతే కాకుండా హైడ్రో, సౌర విద్యుత్ కంపెనీలకు జగన్ సర్కార్ 18 వేల కోట్లకు పైగా బకాయి పడింది. దీంతో ఆ కంపెనీల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థతి ఏర్పడింది. దీంతో రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నది. విద్యుత్ కొనుగోలుకు మార్గాలు మూసుకుపోవడం విద్యుత్ కోతలకు దారి తీసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సరిగ్గా ఎన్నికల ముందు జగన్ సర్కార్ తీవ్రమైన విద్యుత్ కోతను ఎదుర్కోనున్నది.
వాతావరణ శాఖ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో అత్యధికంగా నమోదు అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్న సంగతి తెలసిందే. అసలే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వానికి మండు వేసవిలో విద్యుత్ కోతలు విధించక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తడం మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో పవర్ కట్స్ కారణంగా జగన్ పవర్ కట్ అయిపోక తప్పదని అంటున్నారు. అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్థ విధానాలతో సర్ ప్లస్ పవర్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను గాఢాంధకార ప్రదేశ్ గా మార్చిన ఫలితం జగన్ రానున్న ఎన్నికలలో అనుభవించకతప్పదని అంటున్నారు. మేలో జరిగే ఎన్నికలో విద్యుత్ కోతల ప్రభావం జగన్ సర్కార్ కు తీవ్ర నష్టం కలిగించకతప్పదని చెబుతున్నారు.