బీజేపీ తెలుగుదేశం, జనసేనతోనే ఉందా?
posted on Mar 26, 2024 6:56AM
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం, జనసేనలతో జతకట్టిన బీజేపీ పొత్తు ధర్మాన్ని నిజంగానే పాటిస్తోందా? కూటమిలో చేరడం వెనుక ఆ పార్టీకి రహస్య అజెండా ఏదైనా ఉందా అన్న అనుమానాలు పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతున్నాయి.
కూటమిలో చేరడం ద్వారా బీజేపీ తెలుగుదేశం, జనసేన పార్టీలను దెబ్బకొట్టే వ్యూహం ఏదైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా పొత్తు ద్వారా రాష్ట్రంలో అరాచకపాలనకు స్వస్తి చెప్పాలన్న చిత్తశుద్ది బీజేపీలో ఉంటే.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా రాష్ట్రంలో వైసీపీ కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఎందుకు ఉదాశీనంగా ఉంది. తెలుగుదేశం నేతల వాహనాలను తనిఖీలు చేయడంలో పోలీసులు చూపుతున్న ఉత్సాహం.. వైసీపీ నేతల వాహనాల తనిఖీల విషయంలో ఎందుకు కనిపించడం లేదు. అలాతే తెలుగుదేశం, జనసేన నేతలపై విమర్శలతో చెలరేగిపోతున్న జగన్ పార్టీ నాయకులు బీజేపీని పల్లెత్తు మాట కూడా అనకుండా సంయమనం పాటించడానికి కారణమేంటి? పలువురు అధికారులు బాహాటంగా జగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా, ఆ విషయంలో సాక్ష్యాలతో సహా ఈసీకి ఫిర్యాదులు అందినా స్పందన ఎందకు లేదు? సామాజిక మాద్యమంలో ఈ ప్రశ్నలు తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ చేరిన సమయంలో రాష్ట్రంలో ఒక సానుకూలత కనిపించింది. కూటమిలో బీజేపీ చేరినందున అధికారుల ఆటలు సాగవన్న భావన రాజకీయ వర్గాలలో, పరిశీలకులలో చివరకు సామాన్య ప్రజలలో సైతం వ్యక్తం అయ్యింది. జగన్కు అనుకూలంగా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న అధికారులు ఎన్నికల విధులకు దూరం అవుతారనీ, అలాగే జగన్ కు ఇంత కాలం అనుకూలంగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డీఐజీలు. బీజేపీ భయానికి, ఈసీ కొరడా ఝుళిపిస్తుందన్న బెదురుకు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అంతా భావించారు. దానికితోడు మోడీ, అమిత్‌షా వంటి అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నందున, డీజీపీ-ఇంటలిజన్స్, సీఎస్, ఇతర ఉన్నతాధికారులను గత ఎన్నికల్లో మాదిరిగా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తారన్న అంతా భావించారు.
అయితే అటువంటిది ఏమీ జరగలేదు. సాక్షాత్తూ మోడీ హాజరైన చిలకలూరిపేట సభ సందర్భంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు, దానిపై తూతూమంత్రంగా ఈసీ స్పందన చూస్తుంటే.. బీజేపీ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ సభ సందర్భంగా ట్రాఫిక్ వైఫల్యంపైనే చర్యల కొరడా ఝళిపించని ఈసీ.. ఇక రాబోయే రోజుల్లో కూటమి ఫిర్యాదులకు స్పందిస్తుందనుకోవడం, భ్రమేనన్న అభిప్రాయం తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. అంతే కాదు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం అధిష్ఠానం తీరుపై విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన ఫిర్యాదులపై కూడా ఈసీ స్పందించకపోవడం చూస్తుంటే తమ పార్టీ హైకమాండ్ ఏదైనా రహస్య అజెండాతో పొత్తులో భాగమైందా అన్న అనుమానం కలుగుతోందని రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం ప్రైవేటు సంభాషణల్లో చెబుతోంది. కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే, బెంగాల్‌లో డీజీపీని మార్చిన ఈసీ.. ఏపీలోమాత్రం ఇన్చార్జి డీజీపీగా ఉన్న అధికారి జోలికి రాలుదు. ఆయనపై కూటమి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తాజాగా మంగళగిరి టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ వాహనాన్ని, ఒకేరోజు నాలుగుసార్లు ఆపి తనిఖీలు చేయడం కూటమి నేతలను విస్మయపరిచింది. తనిఖీలు చేయడం సహజమే అయినా ఒకే నేత వాహనాన్ని ఒకేరోజు నాలుగుసార్లు తనిఖీ చేయడంతో, పోలీసులు ఇంకా వైసీపీ కనుసన్నలలోనే పని చేస్తున్నారనడానికి తిరుగులేని రుజువుగా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రుల వాహనాలను ఆపని పోలీసులు లోకేష్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫిర్యాదులపై శరవేగంగా చర్యలు తీసుకోని ఈసీ ముఖేష్‌కుమార్‌మీనాను తప్పించాలన్న అభిప్రాయం కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది. కోడ్ వచ్చి తనకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ, ఫిర్యాదులపై చర్యలు తీసుకోని అధికారి వల్ల ఫలితం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో జగ న్‌పై వ్యక్తిగతంగా, సంస్థాగతంగా తొలుత యుద్ధం ప్రకటించి.. కూటమి కోసం కృషి చేసిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును కాదని, ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాసవర్మకు టికెట్ ఇవ్వడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. . బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు తనకు సీటు రాకుండా అడ్డం పడి, శ్రీనివాసవర్మకు ఇప్పించారని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే.. గత ఐదేళ్లుగా జగన్ అరాచక, అస్తవ్యస్థ, ప్రజా వ్యతిరేక పాలనకు అండదండలందించిన బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల వేళ కూడా దానిని కొనసాగిస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.