బంతి గంటా కోర్టులోనే.. తేల్చుకోవల్సింది ఆయనే!

చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ  చేయి, లేకుంటే పార్టీ కోసం పని చేయి.. ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన సంకేతం. వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా శుక్రవారం (మార్చి 22) విడుదల చేసిన చంద్రబాబు ఈ జాబితాలో గంటా పోటీ చేయాలని భావిస్తున్న భీమిలీ నియోజకవర్గానికీ, అలాగే గంటాను తాను పోటీ చేయమని చెబుతున్న చీపురుపల్లి నియోజకవర్గానికీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారు. తద్వారా చంద్రబాబు తన ఉద్దేశమేమిటన్నది స్పష్టంగా చాటారు.  చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి, ఆ పార్టీ సీనియర్, కీలక నేత బొత్స సత్యాన్నారాయణపై గంటాను పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన   నియోజకవర్గ ఇప్పటికే విస్పష్టంగా గంటాకు తెలియజేశారు. అయితే గంటా మాత్రం తాను విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననీ, చీపురుపల్లిలో అయితే విజయావకాశాలపై నమ్మకం లేదనీ అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం  సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, గంటా అయితే అక్కడ కచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈ విషయంలో గంటా ఇంకా ఏమీ తేల్చుకోకపోవడంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచిన చంద్రబాబు నాయుడు ఇక బంతిని గంటా కోర్టులోనే వేశారు. ఒక వేళ చీపురుపల్లి నుంచి పోటీకి గంటా సంసిద్ధత వ్యక్తం చేయకుంటే ఆయన సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.  భీమిలీ, చీపురుపల్లి మాత్రమే కాకుండా చంద్రబాబు మూడో జాబితాలో ఇంకా ఎచ్చర్ల, ధర్మవరం కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళావెంకటరావు, పరిటాల శ్రీరామ్ లు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలూ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.  

హైదరాబాద్ లో   డ్రగ్స్ ముఠా గుట్టురట్టు 

మాదక ద్రవ్యాలకు తెలంగాణ రాజధాని అడ్డాగా మారింది. హైద‌రాబాద్‌లో మ‌రోసారి భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. ఇంట‌ర్ పోల్ సాయంతో న‌గ‌ర శివారులోని ఐడీఏ బొల్లారంలో డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు మాద‌క‌ద్ర‌వ్యాల ముఠా గుట్టుర‌ట్టు చేశారు. ఇంట‌ర్ పోల్ స‌మాచారంతో స్టేట్‌ డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు శుక్ర‌వారం బొల్లారంలో సోదాలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో భాగంగా బొల్లారంలోని ఓ కంపెనీలో 90 కిలోల మెపిడ్రిన్‌ను అధికారులు సీజ్ చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డ్ర‌గ్ విలువ మార్కెట్‌లో దాదాపు రూ.9 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.  బొల్లారం ప‌రిధిలో క‌స్తూరిరెడ్డి ప‌దేళ్లుగా డ్ర‌గ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించామ‌ని తెలిపారు. సిగ‌రెట్ ప్యాకెట్ల మాటున విదేశాల‌కు డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోనూ మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు. డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల స‌మాచారం మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్ రాజును సత్కరించిన నారా లోకేష్

స్వర్గీయ నందమూరి తారకరామారావు వీరాభిమాని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్కరించారు.  నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, ఆ తరువాత ఎన్టీఆర్ రాజును కలిసి ఆయనను శాలువతో సత్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.   ఈ సందర్భంగా నారా భువనేశ్వరి  తన తండ్రి  అభిమానిగా ఎన్టీఆర్ రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు. నారా లోకేష్, బ్రహ్మణి  ఎన్టీఆర్ రాజుతో  తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ  సందర్భంగా నారా దేవాన్ష్ కు ఎన్టీఆర్ రాజు శుభాశీస్సులు అందించారు.

తెలుగుదేశం మూడో జాబితా..13 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

సుదీర్ఘ కసరత్తు తరువాత తెలుగుదేశం తరఫున పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలలో  పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ శుక్రవారం (మార్చి 23)మూడో జాబితాను విడుదల చేశారు.   దీంతో  తెలుగుదేశం పార్టీ ఐదు అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ జాబితాలో తెలుగుదేశం కొన్ని కీలక స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉంచిన బోడె ప్రసాద్ కు తెలుగుదేశం అధినేత టికెట్ ఖరారు చేశారు. ఆయనకు పెనమలూరు స్థానాన్ని కేటాయించారు. అలాగే తొలి రెండు జాబితాలలోనూ పెండింగ్ లో పెట్టిన సర్వేపల్లి స్థానాన్ని సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.   అలాగే మైలవరం అసెంబ్లీ నియోజవకర్గం విషయంలో కూడా కూడా ఊగిసలాటకు తావివ్వకుండా ఆ స్థానానికి వసంత కృష్ణ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ గత ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే.  అలాగే పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష, కాకినాడ సిటీ నియోజవవర్గం నుంచి వనమాడి వెంకటేశ్వరరావులకు అభ్యర్థులుగా ప్రకటించారు.  ఇక నరసరావు పేట స్థానాన్ని చదలవాడ అరవింద్ బాబుకు కేటాయించారు.  ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే విశాఖపట్నం లోక్ సభ స్థానాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కు కేటాయించారు. అలాగే విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని చిన్నిని అభ్యర్థిగా ప్రకటించారు.  అలాగే హిందుపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తుందని గట్టిగా వినిపించినప్పటికీ ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థగా బీకే పార్థ సారధిని నిలబెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.  ఇక ఏలూరు లోక్ సభ స్థానాన్ని యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు కేటాయించారు.   గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తారు.  అదే విధంగా నరసరావు పేట నుంచి వైసీపీకి రాజీనామా చేసిన వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయులు,  నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరిలు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తారు.  అమలాపురం లోక్ సభ స్థానం నుంచి దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ ను చంద్రబాబు ఎంపిక చేశారు.  

కవిత బెయిలుకు సుప్రీం నో.. ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచన

బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఆమె బెయిల్ పిటిషన్  విచారణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీం పేర్కొంది.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనను  ఈడీ  అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం(మార్చి 23) విచారణ జరిగింది. ఈ సందర్భంగా  బెయిల్‌ విషయంపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే కవిత బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును  ఆదేశించింది. పిటిషన్‌లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం   ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15 న ఈడీ  అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించిన సంగతి తెలిసిందే.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన  కవిత ప్రస్తుతం ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు.

తగ్గేదేలే.. పులివెందుల బరిలో నిలుస్తా.. షర్మిల

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏడాది మారి ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపుగా చెప్పకతప్పదు. నిజానికి షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించిన సమయంలోనో, లేక తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కలకు ముందో కాంగ్రెస్ పార్టీలో చేరితే  ఇంత ఎఫెక్ట్  కచ్చితంగా కనిపించేది కాదు.  కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు, అది కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా జరగనున్న సమయంలో ఆమె హస్తం గూటికి చేరి అన్నపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం సంచలనానికి కారణమైంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, సొంత అన్నపై ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, జగన్ పాలనలోని అరాచకాలను ఎండగడుతున్న తీరు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒకింత జోష్ ను పెంచడం అటుంచి.. తాజాగా ఆమె పార్టీ హైకమాండ్ అనుమతిస్తే పులివెందుల బరిలో తన అన్నను ఢీకొనేందుకు సైతం సై అంటూ చేసిన ప్రకటన జగన్ ను, ఆయన పార్టీనీ షేక్ చేసేసిందని చెప్పొచ్చు. అసలు షర్మిల తనకు వ్యతిరేకంగా గళం ఎత్తడం మొదలు పెట్టగానే జగన్ ధైర్యం, స్థైర్యం మటుమాయమైపోయాయి.   వాస్తవంగా చెప్పాలంటే.. ఐపాక్ సర్వేలైతేనేమి, జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేలైతేనేమి రాష్ట్రంలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని తేల్చేశాయి. దీంతో ఓటమి నుంచి తప్పించుకునేందుకు జగన్ ఎన్నో ఎత్తులు వేశారు. వ్యూహాలు రచించారు. వాటిలో జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. రెండు పార్టీలూ సమన్వయంతో పని చేయడమే కాకుండా, సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించడంతో ఒకటి రెండు చోట్ల వినా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండానే తెలుగుదేశం, జనసేనల మైత్రీ బంధం బలపడింది. ఇక ఆ కూటమితో బీజేపీ కలవకుండా ఉండేందుకు జగన్ చేసిన ప్రయత్నాలూ బెడిసికొట్టాయి.  సిట్టింగుల మార్పుతో తన ప్రభుత్వంపై అసంతృప్తిని తగ్గించుకోవాలన్న ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యాయి. సిట్టింగులపై అసంతృప్తి కంటే జగన్ పాలనపైనే ప్రజలలో ఆసంతృప్తి, ఆగ్రహం ఉన్నాయని తేటతెల్లం చేస్తూ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఇన్ని ఇబ్బందులలోనూ   మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వైనాట్ 175 అంటే బింకంగా విపక్ష కూటమిపై అనుచిత విమర్శలను ప్రోత్సహిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ కు షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం నోరు పెకలని పరిస్థితిలోకి నెట్టి వేసింది. సొంత సోదరి అని కూడా చూడకుండా వైసీపీ సమాజిక మాధ్యమంలో షర్మిల వ్యక్తిగత జీవితంపై కూడా ఇష్టారీతిన పోస్టులను ప్రోత్సహించిన జగన్ కు షర్మిల నేరుగా తనపైనే తలపడతానంటూ విసిరిన సవాల్ తో మైండ్ బ్లాక్ అయిపోయింది. ధైర్యం, స్థైర్యం సన్నగిల్లింది. సొంత అడ్డాలోనే అడుగుపెట్టడానికి బెదిరే పరిస్థితిలో జగన్ పడిపోయారు.   గత ఎన్నికలలో జగనన్న విజయం కోసం శక్తికి మించి కష్టపడిన షర్మిల ఇప్పుడు ఆయనకు బద్ధ శత్రువుగా, పక్కలో బల్లెంగా మారింది. జగన్ ను ఉద్దేశించి నేరుగా, సూటిగా ఆమె చేస్తున్న విమర్శలు వైసీపీలో కాకపుట్టిస్తున్నాయి. కడప లోక్ సభ బరిలో షర్మిల దిగనున్నారన్న వార్తలు వైసీపీలో  అంతంత మాత్రంగా ఉన్న గెలుపు ఆశలను ఆవిరి చేసేశాయి. అది చాలదన్నట్లు తాజాగా షర్మిల అధిష్ఠానం ఆదేశిస్తే జగన్ ప్రత్యర్థిగా పులివెందుల అసెంబ్లీ బరిలోనైనా నిలవడానికి రెడీ అన్న    ప్రకటన జగన్ ను పూర్తిగా డీలా పడేలా చేసింది.   వాస్తవానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ షర్మిల తన అన్న, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వ అరాచకాలను ఎత్తి చూపుతూనే ఉన్నారు. ఇప్పడు తాజాగా ఆమె పులివెందుల గడ్డపై జగన్ తో ఢీకొంటానని చేసిన ప్రకటనపై అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి. నిజానికి షర్మిల కడప లోక్ సభ బరిలో నిలిచినా, ఆ ప్రభావం పులివెందుల లో జగన్ విజయావకాశాలపై తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటిది షర్మిల నేరుగా తన అన్నకు ప్రత్యర్థిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేతగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాల్సిన జగన్ పులివెందులకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ, అలా పరిమితమైనా గెలుపు అవకాశాలు మాత్రం అనుమానమేననీ స్థానికులు బాహాటంగానే చెబుతున్నారు.  

మల్కాజ్ గిరి విషయంలో రేవంత్ తప్పటడుగు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపి అధికారంలోకి తీసుకువచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా వేగంగా అడుగులు వేయడమే కాకుండా 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్ సభ స్థానాలను కైవశం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా రాష్ట్రంలో కనీసం 12 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే ధైర్యంగా లోక్ సభ ఎన్నికలు తన 100 రోజుల పాలనకు రిఫరెండం అని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం పట్ల ప్రజలలో సానుకూలత పెరిగేలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలలో చాలా వరకూ తాను చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే నెరవేర్చారు. దీంతో రేవంత్  సర్కార్ మాటల సర్కార్ కాదు, చేతల సర్కార్ అని జనంలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అదే విధంగా పాలనలో సైతం తనదైన ముద్ర చూపుతూ సాగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కానీ, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ వేగవంతం చేయడంలో కానీ దూకుడు చూపుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష బీజేపీని బలహీన పరచడంలోనూ వేగంగా కదులు తున్నారు. అలాగే లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన మార్క్ చూపుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ అంటూ.. తన సిఫారసులను పార్టీ హైకమాండ్ పరిగణనలోనికి తీసుకునే విధంగా కన్విన్స్ చేయగలుగుతున్నారు.  అయితే మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఆయన తప్పటడుగు వేశారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేసిన కొడంగల్ స్థానం నుంచి పరాజయం పాలైన తరువాత ఆయన 2019 సార్వత్రిక ఎన్నికలలో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగి 10వేల900 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయన ఎంపీగా ఉన్నా కూడా మల్కాజ్ గిరి నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించలేదనీ, దీంతో కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించడంలో విఫలమైందనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఆ కారణంగానే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కించుకోలేకపోయిందని చెబుతున్నారు.   ఇక ఇప్పుడు రానున్న లోక్ సభ ఎన్నికలలో మల్కాజ్ గిరి స్థానం నుంచి కాంగ్రెస్ విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఏకపక్ష నిర్ణయంతో సునీతామహేందర్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని భావించడం, అందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..  ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ తుమ్మల నాగేశ్వరరావు పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకూ దూరంగా ఉండటం ఎన్నికలలో కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం ఎంతమాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు. పైగా మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉండటం, ఆయనకు బీఆర్ ఎస్ శ్రేణులలో ఉన్న పలుకుబడి, మల్కాజ్ గిరి నియోజకవర్గంలో స్వతహాగా బీజేపీకి ఉన్న బలం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండగా, కాంగ్రెస్ కు మాత్రం అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ కు ఒకింత నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అంటున్నారు.   అలాగే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఆ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నదని అంటున్నారు. అయితే మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి యాక్టివ్ గా లేకపోవడం, ఆయన బీఆర్ఎస్ ను వీడతానని ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల నాటి బలం ఉండే అవకాశం లేదు. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తం మీద రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల వంటి బలమైన నాయకుల నుంచి పోటీని తట్టుకుని విజయం సాధించాలంటే కాంగ్రెస్ మల్కాజ్ గిరి నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టడం అవసరం, అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతా రెడ్డిని ఖరారు చేశారు. ఈ ఎంపికపైనే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు టికెట్ ఆశించారు.  పట్నం సునీతా రెడ్డి స్థానికేతరురాలు కావడం,  కాంగ్రెస్ కు ఇక్కడ క్షేత్ర స్థాయిలో పెద్దగా పట్టు లేకపోవడం, మైనంపాటి వర్గీయులు ఏ మేరకు సునీతారెడ్డికి సహకారం అందిస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించడం అంత సులువు కాదన్న అభిప్రాయం పరిశీలకులలోనే కాకుండా, పార్టీ క్యాడర్ నుంచి కూడా వ్యక్తం అవుతున్నది.  మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి తప్పటడుగు వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ విజయం కోసం చెమటోడ్చి కష్టపడక తప్పదని అంటున్నారు. 

రజాకార్ చిత్ర నిర్మాతకు 1ప్లస్ 1 భద్రత.. కేంద్ర హోంశాఖ నిర్ణయం

రజాకార్ చిత్ర నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ. ఇటీవల విడుదలైన ‘రజాకార్‌’ చిత్రాన్ని నిర్మించిన గూడురు సత్యనారాయణకు కేంద్ర హోంశాఖ 1ప్లస్ 1 భద్రత కల్పించింది. హైదరాబాద్ విలీనం నాటి యదార్థ ఘటనలతో ఆయన నిర్మించిన చిత్రం అలరిస్తున్నప్పటికీ, కొందరి నుంచి ఆయనకు బెదరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చింది. కానీ, అప్పుడు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌ మాత్రం 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అధీనంలోనే ఉంది. దేశంలో హైదరాబాద్‌ను విలీనం చేయకుండా ముస్లిం రాజ్యం ఏర్పాటు చేసేందుకు మీర్ ఉస్మాన్ ఖాన్  ప్రయత్నించాడు. నిజాం సైనికాధికారి ఖాసీం రజ్వీకి బాధ్యతలు అప్పగించాడు. దీంతో రజ్వీ అరాచకాలతో తెలంగాణలో విధ్వంసం సృష్టించాడు. అప్పటి కేంద్ర హోంమంత్రి  వల్లభాయ్‌ పటేల్‌ చొరవవల్ల హైదరాబాద్‌ని దేశంలో విలీనం చేసి మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాకిస్థాన్‌ పారిపోయాడు. అతని అధీనంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కష్టాలను ‘రజాకార్‌’ సినిమాలో ఇప్పటి ప్రజలకు అర్థమయ్యేలా చూపించారు.  ఈ సినిమాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్‌ చెయ్యాలని భావించారు దర్శకనిర్మాతలు. అయితే అది వీలుపడలేదు.  ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల  ముందు ఈ  సినిమీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్ర నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి దాదాపు 1100 బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేంద్ర హోం శాఖ వెంటనే ఆయనకు 1+1 సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లను భద్రత నిమిత్తం కేటాయించింది.  

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కేజ్రీవాల్ అరెస్టు!

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వరుస అరెస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంత కాలం ఊరుకుని ఈడీ ఇప్పుడే జూలు విదల్చడం వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా కొంత కాలం నుంచీ దేశ రాజకీయాలలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపణలు సృష్టిస్తూనే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అనూహ్యంగా ఈ స్కామ్ లో ఈడీ, సీబీఐ దర్యాప్తు మందగించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత అరెస్టు వరకూ వచ్చి అప్పుడు ఈడీ వెనక్కు తగ్గడానికీ, ఇప్పుడు తనకు సమన్లపై కవిత పిటిషన్ సుప్రీంలో ఉండగానే ఆమెను ఈడీ రాత్రికి రాత్రి అరెస్టు చేసి ఢిల్లీ తరలించడానికి వెనుక ఉన్నది రాజకీయమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేయడం వెనుక ఉన్నది కూడా రాజకీయమేనని అంటున్నారు.  ఏది ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అగ్రనేతలను ఒక్కరొక్కరుగా ఈడీ అరెస్టు చేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసిన రోజుల వ్యవధిలోనే ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు.  మద్యం కుంభకోణం విచారణకు గాను 12 మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ నివాసానికి  చేరుకుని ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడం గమనార్హం. అయితే ఈ అరెస్టులన్నీ రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ ఆదేశాల మేరకే జరుగుతన్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే.. చట్టం తనపని తాను చేసుకుపోతుంటే.. విపక్షాలు కేంద్రంపై ఆరోపణలు గుప్పించడం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సానుభూతి పొంది ఓట్లు దండుకోవడానికేనని అధికార బీజేపీ ఆరోపిస్తున్నది.  మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడం రాజకీయంగా సంచలనం సృష్టించిందన్నది మాత్రం వాస్తవం. 

 ఎపి సీఈఒ ముందు హాజరైన ముగ్గురు ఎస్పిలు 

ఎపిలో రాజకీయ హత్యలు దుమారాన్ని లేవనెత్తాయి. ఎన్నికల కోడ్ అమలవుతున్న వేళ ఈ హత్యలపై ఎపి ప్రధాన ఎన్నికల అధికారి వివరణ తీసుకుంటున్నారు ఏపీలో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరగ్గా, ఇవి రాజకీయ హత్యలంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత కాకరేపింది.  ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి  ముఖేశ్ కుమార్ మీనా మూడు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలను తన ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు.  ఈ క్రమంలో, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి నేడు ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఎదుట హాజరయ్యారు. ఆయా ఘటనలపై ఎస్పీలు ఇచ్చే వివరణ ఆధారంగా సీఈవో చర్యలు తీసుకోనున్నారు. ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది.

వైసీపీ పవన్ ధ్యానం?.. పిఠాపురం జపం!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. ఏపీ అందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత ఏపీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ అధినాయకత్వం కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయని భావిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీ మొత్తం తన శక్తియుక్తులన్నీ పిఠాపురంలో విజయం సాధించడంపైనే వెచ్చిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా వైసీపీ నేతల తీరు ఉన్నది. ఇంకా క్లారిటీతో చెప్పాలంటే రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోందా? ఆ నియోజకవర్గంలో విజయం అధికారపార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చతురంగ బలాలనూ అక్కడే మోహరించిందా అన్నట్లుగా పరిస్థితి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను వైసీపీ నిలబెట్టింది. నియోజకవర్గంలో పవన్ విజయం నల్లేరు మీద బండినడకేనని అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న రాజకీయ నాయకులు చెబుతున్నారు. పరిశీలకుల విశ్లేషణలూ ఆ దిశగానే ఉన్నాయి. అయితే తమ అధినేత మనసెరిగి మసులుకునే వైసీపీ నాయకులు మాత్రం  అక్కడ పవన్ ఓటమే వైసీపీ ఏకైక లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్ దృష్టిలో పడాలంటే పవన్ కల్యాణ్ ను తక్కువ చేసి చూపడం, మాట్లాడటం ఒక్కటే మార్గమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేత అభ్యర్థుల జాబితా విడుదల చేయకముందు పార్టీ టికెట్ దక్కించుకోవడం కోసం అలా చేశారంటే ఏదో అర్ధం చేసుకోవచ్చు. కానీ అభ్యర్థుల ఎంపిక అయిపోయింది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారన్నది తేలిపోయింది.  అయినా వైసీపీలో, వైసీపీ నేతలలో  పవన్ భజన పట్ల ఉన్న ఆసక్తి (భజన అంటే పొగడడమే కాదు..అదే పనిగా తెగడడం కూడా) తమతమ నియోజకవర్గాలలో ప్రచారంపై కనిపించడం లేదు.  ఇలా  పవన్ ను తక్కువ చేసి మాట్లాడి జగన్ దృష్టిలో పడి తరించిపోదామని తాపత్రేయ పడుతున్న వారిలో వెల్లంపల్లి శ్రీనివాస్, రోజా, అంబటిరాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికలలో  తమ తమ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నవారే. అంతే కాదు, ఆయా నియోజకవర్గాలలో వారి  విజయవకాశాలే అంతంత మాత్రంగా ఉన్నాయని పలు సర్వేలు పేర్కొన్నారు కూడా. సర్వేల వరకూ ఎందుకు పార్టీ అధినేత జగన్ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలలో కూడా వీరి గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే అని తేలింది. దీంతో చివరి నిముషం వరకూ వీరికి టికెట్లు ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని జగన్ తేల్చుకోలేకపోయారు. చివరికి అనివార్యంగానో, మరో అభ్యర్థి దొరకకో జగన్ వీరికి టికెట్లు ఇవ్వాల్సి  వచ్చింది. ఇప్పటికీ వీరికి ఆయా నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినా తమ నియోజరవర్గం కంటే వీరికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తోస్తున్నది. అందుకే ఒకింత అతిశయోక్తి అనిపించినా.. తమ ఓటమి ఎటూ ఖాయమని భావించడంతో కనీసం జగన్ దృష్టిలోనైనా తమ లాయల్టీని కాపాడుకోవాలన్న తాపత్రయంతో వీరు పవన్ కల్యాణ్ పై దూషణలు, విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనిపిస్తోంది. ఇక జగన్ కూడా మిగిలిన 174 అసెంబ్లీ నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా పర్వాలేదు.. పిఠాపురంలో పార్టీ విజయం ఒక్కటి చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఇక వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం కూడా పిఠాపురంలో పవన్ పరాజయం ఖాయమంటూ, హేతు రహితంగా కుల సమీకరణాలపై కథనాలను వండి వారుస్తున్నది. వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలోని పోస్టులను గమనిస్తే ఏపీలో పిఠాపురం మినహా మిగిలిన ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ పోటీలో లేదా అనిపించక మానదని పరిశీలకులు అంటున్నారు. అంతలా సజ్జల భార్గవ్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ సోషల్ మీడియా సైన్యం పిఠాపురం నియోజకవర్గంపైనే  దృష్టి మొత్తం కేంద్రీకరించింది. ఇక త్వరలో జనసేనాని పవన్ కల్యాణ్ తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక అప్పుడు వైసీపీ పవన్ వ్యతిరేక ప్రచార పిచ్చి మరో స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఎటూ ఎడ్జ్ ఉంది. దానికి తోడు ఇప్పుడు తెలుగుదేశం మద్దతు కూడా తోడు కావడంతో అక్కడ కూటమి అభ్యర్థిగా జనసేనాని విజయంపై ఎవరికీ ఢోకా లేదు అన్న పరిస్థితి ఉంది. అక్కడ పవన్ కల్యాణ్ ఎంత భారీ మెజారిటీ సాధిస్తారన్నదే తమ ఆసక్తి అంతా అని తెలుగుదేశం, జనసేన శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద జగన్ పార్టీ అత్యుత్సాహం చూస్తుంటే పిఠాపురం స్థానాన్ని వెండిపల్లెంలో పెట్టి పవన్ కల్యాణ్ కు అందించేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆ అత్యుత్సాహంతోనే రాష్ట్రంలోని మిగిలిన స్థానాల గెలుపు ఓటములను గాలికి వదిలేసినట్లు కనిపిస్తోందంటున్నారు.  

హీరోయిన్ల ఫోన్లూ ట్యాప్.. ప్రణీత్ రావు విచారణలో వెలుగులోకి

ఫోన్ ట్యాపింగ్  కేసు విషయంలో రోజుకో కొత్త సంచలనం వెలుగులోకి వస్తున్నది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటి వరకూ   రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లే ట్యాప్ చేసారని భావిస్తుంటే.. పలువురు సినీ హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు వెలుగులోనికి వచ్చింది. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి. వీరి ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం అంతా రాజకీయనేతలకు అందించినట్లు ప్రణీత్ రావు తన విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.  ఇందు కోసం పలువురు హీరోయిన్ల ఫోన్ కాల్స్ రికార్డు కూడా చేశారని అంటున్నారు.  అంతే కాకుండా వారి చాట్ హిస్టరీని   చోరీ చేసి, ఆ డాటాను పెన్‌డ్రైవ్‌లు, ఈ మెయిల్స్ ద్వారా కొందరు బడా రాజకీయ నేతలకు చేరవేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే  ఆ డేటా ద్వారా హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి ఉంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో బడాబడా రాజకీయ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ఈ పోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఆయనే కాకుండా బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు కూడా వినవస్తున్నాయి. మొత్తం మీద ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఫోన్ లు ట్యాప్ అయిన నేతలలో ప్రతిపక్షాలకు చెందిన వారే కాకుండా అధికార బీఆర్ఎస్ నేతలూ ఉన్నారని సమాచారం. అలాగే ఈ ట్యాపింగ్ ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదనీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బడా నేతల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనీ అంటున్నారు. 

సుప్రీంలో మీడియా రూం... నెలకోసారి ప్రధాన న్యాయమూర్తితో ఇంటరాక్షన్  

సమాజంలో నాలుగో స్థంభం మీడియా. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే నాలుగో స్థంభం  ఆవశ్యకతను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గుర్తించింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియాకు అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత గౌరవం ఇచ్చింది. ఈ మేరకు పాలకులకు ఆదేశాలు జారి చేసింది. ప్రజాస్వామ్య పునరుద్దరణకు  న్యాయవ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా ఆదేశాలు ఇవ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో మీడియా కోసం ఇప్పటివరకు ప్రత్యేక గది లేదు. ఈ సమస్యను గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి మీడియాకు ప్రత్యేక గది కేటాయించారు. భావప్రకటన స్వేచ్చకు పెద్ద పీట కల్పించే విధంగా మీడియా ప్రతినిధులకు 30 రోజుల కోసారి చర్చా గోష్టి నిర్వహించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నేరుగా ప్రధాన న్యాయమూర్తి ఈ చర్చా గోష్టిలో పాల్గొంటారు. మొత్తానికి స్వాతంత్య్రం సిద్దించిన ఏడు దశాబ్దాల చరిత్రలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రజాస్వామిక వాదులు స్వాగతించారు

కేంద్రానికి ఈసీ షాక్.. ఆ మెస్సేజ్ లు నిలిపివేయాలంటూ ఆదేశాలు

ఎన్నికల కోడ్ అమలు విషయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయో కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి.. కేంద్రంలోని మోడీ సర్కార్ పౌరల ఫోన్ లకు వాట్సాప్ మెసేజ్ ల రూపంలో పంపుతున్న ప్రకటనలు. ఇవి ప్రభుత్వ ప్రకటనలే అయినా ఎన్నికల వ్యయంలో చూపాల్సిన పని లేదు. అలాగే ప్రభుత్వం ప్రజలకు చేసిన మేళ్లు ఇవీ అంటూ మోడీ  చిత్రంతో వికసిత్ భారత్ పేరిట కుప్పలు తెప్పలుగా ప్రజలకు మెస్సేజ్ లు వస్తున్నాయి. ఇలా మెస్సేజ్ లు పంపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమే అయినా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని హెచ్చరించే వరకూ కేంద్రం పట్టనట్లే వ్యవహరించింది. అయితే ఆ మెస్సేజ్ లను తక్షణమే నిలిపివేయాలంటూ ఈసీ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసే వరకూ కేంద్రం కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నదన్న విషయం సామాన్యులెవరికీ తెలియనేలేదు.  ఈ మెస్సేజీలు పంపించడం ద్వారా కేంద్రం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందనీ, వెంటనే వీటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశించాలనీ కోరుతూ విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే వరకూ కేంద్ర ఎన్నికల సంఘం మిన్నకుండటం విమర్శలకు తావిస్తున్నది. విపక్షాల ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు   కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజులకు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. వికసిత భారత్  పేరిట కేంద్రం పౌరల ఫోన్లకు పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్ లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇటువంటి మెసేజ్ లను పౌరులకు పంపించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.   గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్  చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ తక్షణమే ఆ మెస్సేజ్ లను నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది.  

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు !

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమికి లోక్‌సత్తా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ  ప్రకటించారు. ఎపి రాజకీయాల్లో ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న జయప్రకాశ్ నారాయణ ఇక నుంచి  పూర్తిగా తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ అని ఈ ప్రకటనతో తేలిపోయింది. మీడియాతో మాట్లాడుతూ  తన పార్టీ ఎన్ డి ఏకు మద్దత్తునిస్తుందన్నారు. ఆయన ఈ విషయాన్ని  స్వయంగా వెల్లడించడంతో ఎపిలో టిడిపి కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడింది.  ఏపీలో అరాచక పాలన సాగుతోందని జయప్రకాశ్ నారాయణ్ ఆరోపిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని  ఆయన కోరారు. భయం లేకుండా అందరూ పోలింగ్‌లో పాల్గొని.. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పాలన సాగించేవారిని ఎన్నికోవాలని సూచించారు.అయితే జయప్రకాశ్ నారాయణ్ ప్రకటనపై వైసీపీ ఇంత వరకు తన వైఖరి ప్రకటించకపోవడం గమనార్హం.  ఏపీలో రాజకీయ పరిస్థితులుఅంతకంతకూ దిగజారుతున్నాయి.   మంచి పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు. దానితో పాటు అభివృద్ధి కూడా కావాలి అనేది వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చుపెట్టడం మంచిదికాదని జయప్రకాశ్ నారాయణ్ వాదిస్తున్నారు.సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనం, అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం" అని ఆయన అభిప్రాయపడుతున్నారు ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన  జయప్రకాష్ నారాయణ  ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.  అరాచకపాలనకు చరమగీతం పాడి.. అభివృద్ధి , సంక్షేమానికి పాటు పడేవారికి మద్దతిస్తున్నానని  ఆయన ఖరా ఖండిగా తెలిపారు.  ఇలా మద్దతు ప్రకటించినందుకు తనపైనా కులం ముద్ర  వేసి తిట్టే వాళ్లు ఉన్నారని జయప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.  అయినా నిజాయితీ రాష్ట్ర భవిష్యత్ కోసమే మద్దతు  ప్రకటిస్తున్నానని జయప్రకాశ్ నారాయణ్   ఘంటాపథంగా తెలిపారు.

ఆముదాలవలసలో తమ్మినేనికి అసమ్మతి పోటు!?

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం ఆమదాలవలస.. ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచిన వారు క్యాబినెట్ స్థాయి పదవిని అనుభవించడం గడచిన కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది.  తెలుగుదేశంలో కూన రవికుమార్, వైసీపీలో తమ్మినేని సీతారాం కూడా ఈ కోవకు చెందిన వారే. సిక్కోలు పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన ఆమదాలవలసలో టికెట్ కోసం ఆశపడే వారి జాబితా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ బహునాయకత్వ సమస్య టిడిపిలో లేకపోవడం ఆ పార్టీకి కలసి వస్తోంది. ఇదే తలనొప్పితో బాధపడుతున్న వైకాపా నేత, ప్రస్తుత ఆమదాలవలస ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన పేరును అధిష్టానం ప్రకటించిన తరువాత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.    ఔను  బహునాయకత్వ సమస్యలు స్పీకర్ తమ్మినేని సీతారాం కు తల బొప్పి కట్టించాయి. మూడు పార్టీ ఆఫీసులు, ఆరుగురు ఆశావహులతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క స్పీకర్ నియోజకవర్గం ఆమదాలవలసలోనే తీవ్ర స్థాయిలో ఉన్న వర్గ పోరు,  ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ  అభ్యర్ధిగా స్పీకర్ తమ్మినేని పేరు ప్రకటన తరువాత ముదిరి పాకాన పడింది.  వైసీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం లోనే వర్గపోరు సభాపతికి తలనొప్పిగా మారింది. గడచిన నాలుగేళ్ళగా స్పీకర్ తో విభేదించిన స్థానిక నాయకులు మూడు పార్టీ ఆఫీసులు ప్రారంభించి క్యాడర్ తో మూడు ముక్కలాట ఆడుతూనే ఉన్నారు.  స్పీకర్ తమ్మినేనితో విభేదిస్తూ.. మొన్నటి వరకూ ఈ ముగ్గురూ ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు  చేసుకుంటూ వచ్చేవారు.  క్యాడర్ శ్రమను స్పీకర్ గుర్తించడం లేదని వేరు కుంపటి పెట్టిన వైకాపా నేతలు ఎవరికీ వారు ఈ ఎన్నికల్లో  టికెట్ కోసం క్యాడర్ ను సైతం మూడు ముక్కలు చేసి తమ  ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  గడచిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన క్షణం నుంచీ పార్టీలో స్పీకర్ తమ్మినేని వర్గపోరు ఎదుర్కుంటూనే ఉన్నారు. గెలిపించిన నేతలకు విలువ ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలలో   గుర్తింపు ఇవ్వడం లేదని ఇద్దరు సీనియర్ వైసీపీ నేతలు స్పీకర్ కు వ్యతిరేకంగా నాలుగేళ్ల క్రితమే పార్టీలో సొంత కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా మొన్నటి వరకూ మూడు పార్టీ ఆఫీసులు ఆమదాలవలస నియోజకవర్గంలో నడుస్తూ ఉండేవి..  నాలుగేళ్ళుగా తమ్మినేని తీరుని బహిరంగంగానే వ్యతరేకిస్తూ.. ఈ ఎన్నికల్లో టికెట్ ను ఆశిస్తూ స్థానిక నేతలు  నేతలు సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్ లు పర్యటనలు చేస్తూ వచ్చారు... మండల స్థాయి నేతలను తమ గ్రూపులలో చేర్చుకుని  ఎవరికీ వారు తమ క్యాడర్ ను బలపరుచుకుంటూ.. క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ అధిష్టానం ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు చేశారు.. అయితే చాలా నెలల హైడ్రామా తరువాత.. ఇటివల ప్రకటించిన వైకాపా అభ్యర్ధుల జాబితా లో తిరిగి  తమ్మినేని పేరునే అముదాలవలస పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో స్థానిక నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఆమదాలవలస వైసిపి నేత సువ్వారి గాంధీ.. తన క్యాడర్ తో సహా పార్టీకి రాజీనామా చేసి.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తానని  స్పష్టం చేశారు.   ఆమదాలవలస లో స్పీకర్ తమ్మినేనితో విభేదించి నాలుగేళ్ల క్రితమే తన వర్గాన్ని తాను ఏర్పాటు చేసుకున్న  వైసిపి నేత సువ్వారి గాంధీ.. పార్టీలో తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.  చాలా చోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతును కూడగట్టుకున్నారు.  తీరా ఇప్పుడు ఆమదాలవలస అభ్యర్ధిగా స్పీకర్ తమ్మినేనినే జగన్ ఖరారు చేయడంతో  ఆమదాలవలస ఫ్యాన్ పార్టీ మూడు రెక్కల దిగువ ఉన్న క్యాడర్ లో తన అనుయాయులతో కలసి సువ్వారి గాంధీ రెబల్ గా అవతారం ఎత్తారు.  ఇప్పటికే అభివృద్ధి లేదనే ఆరోపణలకు తోడు అనేక సమస్యలతో సతమతమవుతున్న స్పీకర్ తమ్మినేనికి సువ్వారి గాంధీ రూపంలో ఇప్పుడు మరో గట్టి జలక్ తగిలింది.  

ఆ మూడు చోట్లా వైసీపీ గెలుపు ఆశలు గల్లంతేనా?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వచ్చే ఎన్నికలలో జిల్లాలో వైసీపీకి ఘోర పరాజయం తథ్యమని ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా జగన్ పార్టీ ఓటమి దిశగానే నడుస్తోందని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీకీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో పార్టీ గుర్తు ఫ్యాన్ కే గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతోంది.  ప్ర‌జ‌ల్లో  పార్టీ పట్ల వ్యతిరేకతను గుర్తించిన జగన్  దానిని సాధ్యమైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో  చేసిన సిట్టింగుల మార్పు ప్రయోగం మరింత చేటు చేసిందని జిల్లా పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఇప్పుడు జిల్లాలో ముగ్గురు సిట్టింగులు అయితే జగన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ముగ్గురికీ కూడా తామ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం నుంచి జగన్ టికెట్ ఇవ్వకపోవడమే కాదు,  అసలు పోటీ చేసేందుకు ఏ నియోజకవర్గం నుంచీ టికెట్ ఇవ్వలేదు.   వారు మేడిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహీధర్ రెడ్డిలు. ముగ్గురూ కూడా తమ పట్ల జగన్ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంతో  ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా చివరి క్షణం వరకూ తమకు తమతమ నియోజకవర్గాల నుంచే పోటీ చేసేందుకు జగన్ టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే పార్టీ ప్రకటించిన జాబితాతో  తమకు  అసలు పోటీ చేసే అవకాశమే లేకుండా పోవడంతో రగిలిపోతున్నారు.   వీరిలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అయితే  పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఒక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి.  అయితే అక్కడ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఇప్పుడాయన మొత్తంగా ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసేది లేదని సన్నిహితులకు, సహచరులకూ చెప్పడమే కాకుండా వారినీ పార్టీకి దూరంగా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు.   అదే విధంగా  ఎమ్మెల్యే మేడిశెట్టి వేణుగోపాల్ తన సీటు మారిస్తే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారనీ, అయితే జగన్ అందుకు కూడా నిరాకరించి పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన పార్టీకి, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. తన నియోజకవర్గం బాచేపల్లిలో పార్టీ ప్రచారంలో పాల్గొనేది లేదని తెగేసి చెప్పేశారని అంటున్నారు. అంతే కాకుండా తన అనుచరులు, తన వర్గీయులెవరూ పార్టీ ప్రచారంలో పాల్గొనద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, లేదా జనసేన గూటికి చేరదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మేడిశెట్టి వేణుగోపాల్ మొత్తంగా ఈ సారి ఎన్నికలలో  సైలెంటైపోవడానికి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక టికెట్ దక్కని మరో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును బుజ్జగించేందుకు మాత్రం వైసీపీ అధినేత ఒకింత ప్రయత్నం చేశారు. ఆయనను ఒంగొలు లోక్ సభ నియోజకవర్గ డిప్యూటీ కోఆర్డినేటర్  పదవి ఇస్తామని ప్రతిపాదించారు. సంతనూతల పాడు నియోజకవర్గంలో గట్టి పట్టున్న సుధాకర్ బాబు సేవలను ఆ విధంగా ఉపయోగించుకోవాలని జగన్ ప్రయత్నించినప్పటికీ సుధాకర్ బాబు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, ఆయన నేడో రేపో పార్టీ వీడే అవకాశాలున్నాయనీ అంటున్నారు. జిల్లా వైసీపీకి చెందిన మరికొందరు కీలక నాయకులతో కలిసి ఆయన తెలుగుదేశం, లేదా జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ ఆయన సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించకపోవడమే కాకుండా, తన వర్గీయులెవరూ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. సుధాకరబాబు అసంతృప్తి కచ్చితంగా సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున విజయావకాశాలను గణనీయంగా దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తంగా ప్రకాశంలో వైసీపీ ప్రకాశం కోల్పోయిందని అంటున్నారు. 

నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్ పై వేటు 

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల  కోడ్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అధికారులు ఫోకస్ పెట్టారు  టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్‌ సాకిరి రాజశేఖర్‌పై వేటు పడింది. ఈ మేరకు  సస్పెండ్‌ చేస్తూ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి దిశ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ రాజశేఖర్‌  అన్నమయ్య జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి తిరుపతి జిల్లా భాకరాపేట మీదుగా వెళ్తుండగా కలిశారు. కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం ఆయన్న సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతం చేయడం.. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయడం సబబే . కాని వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార దుర్వినియోగం అవుతుంది. వాలంటీర్లను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎస్ పి ఎన్నికల కమిషన్ పరిధిలో వస్తారు అయినా అధికార పార్టీ వ్యవహారాల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.