రఘురామకు నో టికెట్.. కారణమదేనా?
posted on Mar 26, 2024 5:52AM
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, అస్తవ్యస్థ, కక్షపూరిత పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా, తద్వారా జగన్ మోహన్‌రెడ్డిని గద్దెదింపడమే లక్ష్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పట్టుదలతో పనిచేస్తున్నారు. అయితే, బీజేపీ కేంద్ర పెద్దల సహకారం వీరికి పూర్తిస్థాయిలో అందడం లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఆ విషయం నిజమేనని స్పష్టమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. బీజేపీ కేంద్ర పెద్దలకు, రాష్ట్రంలోని పలువురు బీజేపీ నేతలకు వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నారని, బీజేపీ విడుదల చేసిన ఐదో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాతోనే స్పష్టం అవుతున్నదని పేర్కొంటున్నారు. ఎంపీ అభ్యర్థుల ఐదో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. నర్సాపురం నియోజకవర్గం టికెట్‌ను రఘురామ కృష్ణంరాజుకు ఇస్తారని అందరూ భావించారు. కానీ, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరును బీజేపీ హైకమాండ్ నరసాపురం అభ్యర్థిగా ప్రకటించింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణంరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అప్రజాస్వామిక విధానాలతో పాలనగిస్తూ వచ్చారు. దీంతో జగన్ ప్రజావ్యతిరేక విధానాలను తొలిసారి రఘురామరాజు ప్రశ్నించారు. పదునైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తట్టుకోలేక పోయిన జగన్ సీఐడీ పోలీసులతో రఘురామకృష్ణం రాజును టార్చర్ చేయించారు, అంతేకాదు.. అంతా కాదు లాకప్ లో ధర్డ్ డిగ్రీ ప్రయోగిచారు. అయినా రఘురామరాజుపై జగన్ కక్ష తీరినట్లు లేదు. నర్సాపురం సీటు విషయంలో జగన్ జోక్యం వల్లనే బీజేపీ అధిష్టానం రఘురామరాజుకు చెక్ చెప్పిందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన కూడా ఇటీవల జరిగింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాల అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. దీనికి తోడు ఇటీవల ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ ఇన్ఛార్జిలుగా ఇద్దరు నియమితులయ్యారు. వీరిలో ఒకరైన సిద్ధార్థనాథ్ సింగ్ ధర్మారెడ్డిని వెంటబెట్టుకొని బీజేపీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది. అయితే, ఆ సమయంలో నడ్డా బిజీగా ఉండటంతో వారికి అపాయింట్ మెంట్ దొరకలేదని తెలుస్తోంది.
రఘురామరాజుకు నర్సాపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దని కోరడానికే వారు నడ్డా, అమిత్ షాలో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. నేరుగా బీజేపీ కేంద్ర పెద్దలను కలిసే అవకాశం దొరక్కపోవటంతో.. రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగాఉన్న కొందరు బీజేపీ నేతల సహకారంతో వైసీపీలోని పలువురు నేతలు ఫోన్ ద్వారా వారిని సంప్రదించి రఘురామ రాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వొద్దని కోరినట్లు సమాచారం. రఘురామరాజుకు కాకుండా వేరేవారికి నర్సాపురం సీటును కేటాయిస్తే, అక్కడ బీజేపీ అభ్యర్థి విజయంతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరికొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థుల విజయానికి సహకారం అందిస్తామని జగన్ రాయభారం పంపినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. జగన్ ఆఫర్‌తో బీజేపీ పెద్దలు రఘురామరాజుకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంపై రఘురామరాజు స్పందిస్తూ.. తొలినుంచి తనను ఇబ్బందిపెట్టాలని చూసిన జగన్.. నర్సాపురం టికెట్ విషయంలో ఎట్టకేలకు పైచేయి సాధించారని, అయితే, ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగాఉన్న బీజేపీ నేతల సహకారం లభించిందని పేర్కొన్నాడు.
రఘురామరాజుకు సీటు నిరాకరించడం వెనుక జగన్ హస్తం ఉందని అనుకుంటే.. ఆయన మాటే ఇంకా బీజేపీలో చెల్లుబాటు అవుతోందనీ, బీజేపీ పెద్దలుసైతం జగన్మోహన్ రెడ్డిని వదులుకునేందుకు సిద్ధంగా లేరని అనుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా బీజేపీ సహకరిస్తుందా అనే అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకు లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుపెట్టుకోవటానికి ప్రధాన కారణం ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరుల అరాచకాలను చెక్ పడుతుందన్న ఉద్దేశంతోనే. అందుకే బీజేపీ అడిగినట్లు ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ సీట్లను ఆ పార్టీకి కేటాయించాయి. ఇలాంటి సమయంలో బీజేపీ కేంద్ర పెద్దలు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీలోని పలువురు నేతలు చెప్పినట్లుగా టికెట్లు కేటాయిస్తున్నారన్న అంశం ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తుంది. పొత్తు ధర్మాన్ని బీజేపీ కేంద్ర పెద్దలతోపాటు, రాష్ట్రంలోని పలువురు కమలం నేతలు విస్మరిస్తున్నారని పలువురు టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు.
జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్ట పడటం లేదు. పోలీస్ శాఖలోని కీలక పదవుల్లో జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకున్నారు. దీంతో తెలుగుదేశం నేతల వాహనాల వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు. వైసీపీ నేతల జోలికి వెళ్లడం లేదని ఉదాహరణలతో సహా చూపుతున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాహనాన్ని ఇప్పటికే నాలుగు సార్లు తనిఖీల పేరుతో ఆపిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా బీజేపీ కేంద్ర పెద్దలు పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన నేతలు కోరుతున్నారు.