మళ్లీ టీఆర్ఎస్.. పేరు మార్పుపై కేసీఆర్ కసరత్తు!?
posted on Mar 26, 2024 @ 9:38AM
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిపోయిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపులో వచ్చిన క్షణం నుంచే ఆయన పతనం మొదలైందని చెప్పవచ్చు. సరే ఏది ఏమైతేనేం.. తెలంగాణలో అధికారం సాధించిన విధంగానే కేంద్రంలో కూడా అధికార పీఠం దక్కించుకోవాలన్న అశో, దురాశో, పేరాశో ఏదైతేనేం కేసీఆర్ తాను అనుకున్నది చేసేశారు. ఇక్కడే ఆయన తెలంగాణ ప్రజలను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారు. (టీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర సమితిని ఓన్ చేసుకుని సొంత పార్టీగా ఆదరించిన తెలంగాణ ప్రజ (బీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితిని సొంత పార్టీ అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అలాంటి టీఆర్ఎస్ ను కేసీఆర్ ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించేశారు.
దాంతో ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితితో, ఆ పార్టీని స్థాపించి, తెలంగాణ సాధన కోసం పోరాడినన నేతగా ప్రజలతో ఉన్న బంధాన్ని ఆయనే చేజేతులా తెంచేసుకున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన పేరు మాప్పు ప్రయోగం బూమరాంగ్ అయ్యింది. టీఆర్ఎస్ గా ఉన్నంత కాలం కేసీఆర్ సర్కార్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, నిరంకుశ ధోరణిని కానీ పెద్దగా పట్టించుకోని జనం.. ఎప్పుడైతే పార్టీలోని తెలంగాణ పేరును తీసేశారో.. అప్పుడే ఆ పార్టీతో, తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ తో ఉన్న ఎమోషన్ బాండ్ తెగిపోయింది.
ఫలితం ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. సాధారణంగా ఎన్నికలలో ఓటమి అన్నది ఏ పార్టీకైనా, ఏ నేతకైనా సహజమే. అయితే బీఆర్ఎస్ ఓటమి, కేసీఆర్ పరాజయం రెండూ మాత్రం అలా సహజంగా తీసుకోవడానికి వీల్లేని వాతావరణం తెలంగాణలో కనిపిస్తోంది. కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చే విషయంలో పూర్తి ఏకపక్షంగా వ్యవహరించారు. ఈ పేరు మార్పు వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణులకు, నేతలకు ఎవరికీ ఇష్టం లేదు. సూచన ప్రాయంగా ఇచ్చిన సలహాలు కేసీఆర్ లెక్క చేయలేదు. క్యాడర్ అసంతృప్తిని పట్టించుకోలేదు. అధికారంలో ఉన్న కేసీఆర్.. ఎవరినీ లెక్క చేయనవసరం లేదన్నట్లాగానే వ్యవహరించారు. చివరకు ప్రజలను కూడా లేక్క చేయకుండా వ్యవహరించారు. అంతా అయిపోయి పార్టీ ఓడిపోవడమే కాకుండా, పార్టీలో తిరుగులేని తన పట్టు కూడా సడలిపోయి, ఇప్పుడిక పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారి, చేతులు పూర్తిగా కాలిపోయి, పట్టుకోవడానికి ఆకులు కూడా లేని స్థితికి వచ్చిన తరువాత ఎన్నికలలో పరాజయానికి పేరు మార్పిడే ముఖ్య కారణమని తెలిసివచ్చినట్లుంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేయాలని నిర్ణయించుకున్నారు.
జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం అధికారాన్ని దూరం చేయడమే కాకుండా , ప్రజలను కూడా పార్టీకి దూరం చేసింది. మొత్తంగా పార్టీ తెలంగాణలో మనుగడ సాగించేందుకే కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ వరుసగా నిర్వహి స్తున్న సమీక్షా సమావేశాల్లో పార్టీ క్యాడర్ నుంచీ, లీడర్ల నుంచీ కూడా బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చేయాలన్న డిమాండ్ ప్రముఖంగా వినిపించింది. నాయకులైతే ముఖం మీదే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి పేరు మార్పే కారణమని స్పష్టంగా చెప్పేశారు. దీంతో కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చేందుకు అవసరమైన న్యాయ సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకూ చెప్పారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తరువాత బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటానని పార్టీ నాయకులు, క్యాడర్ కు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించి పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది.