కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు.. ఏపీలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ నిఘా?
posted on Mar 26, 2024 @ 11:28AM
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ నిఘా పెట్టిందా? రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ రాష్ట్రంపై ప్రత్యేక నిఘా పెట్టిందా? మరీ ముఖ్యంగా అధికార వైసీపీ నాయకులతో అంటకాగుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ రహస్య దర్యాప్తు చేపట్టిందా? అంటే విశ్వసనీయ వర్గాలు ఔననే అంటున్నాయి.
ఏపీలో ఎన్నికల కోడ్ అసలు అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో పలు వీడియోలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ప్రధాని మోడీ పాల్గొన్న చిలకలూరి పేట సభ ఏర్పాట్ల విషయంలో, ట్రాఫిక్ నియంత్రణ విషయంలో రాష్ట్ర పోలీసులు బాహాటంగానే సభ విచ్ఛిన్నం లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందన్నది ఆ సభ వేదికగా సాక్షాత్తూ ప్రధాని మోడీకే అర్ధమై ఉంటుందని అంటున్నారు. అయితే కోడ్ అమలులోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా, ఆరోపణలకు ఎదుర్కొంటున్న అధికారులపై ఈసీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలవడం వెనుక కూడా ఏదైనా ప్రత్యేక అజెండా ఉందా? రాష్ట్రంలో జగన్ అరాచకాలను నిరోధించే విషయంలో ఈసీ పూర్తిగా చేతులెత్తేసిందా అన్న అనుమానాలూ అన్న వర్గాల నుంచీ వ్యక్తమౌతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే ముఖ్యమంత్రి జగన్ తనకు విధేయులైన వారికే ప్రాధాన్యతనిస్తూ జిల్లాల్లో అధికారుల నియామకాలను చేపట్టారు. ఈ విషయంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. సరే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ఈసీ చర్యలు తీసుకుంటుంది అని అంతా భావించారు. అయితే కోడ్ అమలులోక వచ్చి ఇన్ని రోజులైనా ఈసీ నుంచి క్రీయాశీలకంగా ఎటువంటి చర్యలూ కనిపించలేదు. విపక్షాలు, సోషల్ మీడియా సహా అన్ని వైపుల నుంచీ రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘన ఎలా జరుగుతోందో సాక్ష్యాలతో సహా సమాచారం కనిపిస్తున్నది. అలాగే కొందరు అధికారుల తీరుపై ఫిర్యాదులూ వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధకారుల తీరుపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదులు అందాయి. అయినా ఈసీలో కదలిక లేకపోవడంతో ఈసీ తీరుపై, కూటమిలో బీజేపీ భాగస్వామ్య పాత్రపై అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈసీ తనకు చేరిన సమాచారం, ఫిర్యాదులపై సీరియస్ గా ఉందనీ, రాష్ట్రంలో పలువురు అధికారుల తీరుపై రహస్య దర్యాప్తును చేపట్టిందని తెలుస్తున్నది. దీంతో రాష్ట్రంలో కీలక పదవులలో ఉన్న అధికారుల నియామకం నుంచి పనితీరు వరకూ అన్ని విషయాలపై కూపీ లాగుతున్నదని చెబుతున్నారు. ముఖ్యంగా కొందరు ఎస్పీలు, కలెక్టర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి ఇప్పటికే ఈసీ తన రహస్య దర్యాప్తు ద్వారా ధృవీకరించుకుందని చెబుతున్నారు. అదే విధంగా ఇద్దరు రాష్ట్ర స్థాయి అధికారుల విషయంలోనూ ఈసీ అసంతృప్తిగా ఉందని అంటున్నారు. ఏపీలో కోడ్ ఉల్లంఘనలపై ఈసీ సీరియస్ గా ఉందనీ, తన రహస్య దర్యాప్తులో తేలిన అంశాలు ఆధారంగా ఏ క్షణంలోనైనా సీరియస్ చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియపై ఈసీ దృష్టి సారించగా, వారం తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రత్యేక దృష్టి సారించిన ఈసీ వారిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించనున్నట్లు చెబుతున్నారు.