హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి సానియా మిర్జా ?
posted on Mar 27, 2024 @ 1:06PM
హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మహిళను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తుందా? మతపర సెంటిమెంట్ తో ఎన్నికల బరిలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాధవీలత ఉండటంతో ముస్లింలు వోట్లతో గెలుపొందడానికి కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోందా అంటే ఔననే సమాధానం వస్తుంది. తొలుత అలీ బిన్ మస్కతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇటీవలె మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో స్నేహ సంబంధాలు కొనసాగించడంతో అధిష్టానం వెనకడుగు వేసింది. అలీ బిన్ మస్కతీ పోటీ చేస్తే ముస్లింవోట్లు చీలిపోతాయని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. కెసీఆర్ ప్రభుత్వానికి సహకారం అందించిన మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దత్తు పలుకుతోంది. హైదరాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేయనుండటంతో, దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన టెన్నిస్ తార సానియాను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించాలని అధిక సంఖ్యలో అభిమానులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన విషయం విదితమే. దీంతో ఆమె పలుకుబడిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని అభిమానులతో సహా హైదరాబాద్ లోక్‌సభకు చెందిన మహిళా ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.ఇటీవలె రాజ్య సభకు ఎంపికైన అనిల్ కుమార్ యాదవ్ సానియా మిర్జాకు అత్యంత సన్నిహితుడు కావడంతో హైదరాబాద్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. సానియా మిర్జా పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి సహకారం అందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2003 నుంచి టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రస్థానం మొదలు పెట్టి. అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచి దేశానికి కీర్తిని తెచ్చి పెట్టింది. అంతే కాకుండా సానియా మీర్జా సోదరి అనం మీర్జా క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కోడలుగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో సానియాకు పలుకుబడి కూడా ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అంతేకాకుండా 2021లో వైఎస్ కూతురు… షర్మిల వైఎస్సార్డీపీ అధ్యక్షురాలుగా ఉన్నపుడు మర్యాద పూర్వకంగా కలవడం, ఆపై షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ హోదాలో ఉండటంతో సానియాను హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజారుద్దీన్ కూడా సానియా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సలహాలు ఇచ్చినట్లు సమాచారం.
అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సైతం సానియా మీర్జా హైదరాబాద్ లోక్సభస్థానానికి తమ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థినే బరిలోకి దించాలన్న ఏకాభిప్రాయానికి దాదాపు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరా బాద్ అభ్యర్థిగా సానియా మీర్జా టిక్కెట్ ఖరారైతే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలే పోటీ చేస్తే, మహిళల చేతుల్లో ఓటమికి గురికాకూడదని మజ్లిస్ జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో పాటు మజ్లిస్ పార్టీకి మిత్రపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇదే స్థానం నుంచి బరిలోకి పార్టీ అధిష్టానం దించడం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అయోమయానికి గురిచేస్తోంది.
2024 లోక్ సభ ఎన్నికల వేడి పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుకు పైగా స్థానాల్లో ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ పార్టీ మరింత పట్టును పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న మజ్లిస్.. బీజేపీ ఆధీనంలో ఉన్న గోషా మహల్ నియోజకవర్గంలో సైతం పట్టుకు పాగా వేసినట్లు సమాచారం. గత నలభై ఏళ్లుగా హైదరాబాద్ లోక్సభపై ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ యథావిధిగా పతంగిని ఎగరేస్తుందా లేదా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరైనా గెలుస్తారా? అనేది వేచి చూడాల్సిందే.