ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం
posted on Mar 27, 2024 9:02AM
ఐపీఎల్- 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం సాధించిన చెన్నై రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 63 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.
చెన్నై బ్యాటర్లలో శివమ్ దుబె ఆకాశమే హద్దుగా చెలరేగాడు.. దుబే కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అలాగే చెన్నై బ్యాటర్లలలో రుతురాజ్ గైక్వాడ్ 46 , రచిన్ రవీంద్ర 46 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిశోర్, స్పెన్సర్ జాన్స్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. దీంతో 207 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు.
చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పరుగుల వేగం మందగించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు చేసిన శుభమన్ గిల్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. వృద్ధిమాన్ సాహా 21 పరుగులు, సాయి సుదర్శన్ 37 పరుగులు చేసినా పరుగుల వేగం పెంచడంలో విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకు పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో దీపక్ చాహర్ 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2, తుషార్ దేశ్‌పాండే 2, డేరిల్ మిచెల్ 1, మతీశా పతిరానా 1 వికెట్ తీశారు. రెండు వరుస విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.