మోడీ మళ్లీ వస్తే.. దేశంలో ఇవే ఆఖరి ఎన్నికలు.. పరకాల ప్రభాకర్

 కేంద్రంలో మళ్ళీ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ... ఏమి జరుగుతుంది? రాజ్యాంగాన్ని మార్చేస్తుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌’లా రాజ్యాంగాన్ని మార్చేసి  జీవితకాల ప్రధానిగా ప్రకటించు కుంటారా?  2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, శాశ్వతంగా అధికారంలో  ఉండేలా, రాజ్యంగాని మార్చి రాచరిక వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు వీలుగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందా అన్న అనుమానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పలు రాజకీయ పార్టీలు ఔననే అంటున్నాయి. సరే అవన్నీ రాజకీయ పార్టీలు కనుక.. మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి కనుక అవే అటువంటి అనుమానాలను వ్యక్తం చేసి, వాటికి అవే ఔనని సమాధానాలు కూడా సరఫరా చేశాయని భావించొచ్చు. కానీ.. కేంద్ర విత్తమంత్రి భర్త, ప్రముఖ సామాజిక, ఆర్థిక విశ్లేషకుడు అయిన పరకాల ప్రభాకర్  కూడా మోడీ మళ్లీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపడితే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.   2024 ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ ను అడ్డుకోకుంటే దేశంలో ఇవే ఆఖరి ఎన్నికలు అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పరకాల ప్రభాకర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రధాని నరేంద్రమోడీ గత పదేళ్లుగా అమలు చేస్తున్న విధానాలను గమనిస్తే ఈ విషయం అవగతమౌతోందని పరకాల అన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే, కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరితే.. ఇవే విధానాలను కొనసాగిస్తే దేశంలో బహుశా ఇవే ఆఖరు ఎన్నికలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.  ఈ సందర్భంగా ఆయన మణిపూర్ ఘటనలను ఉదహరించారు. మణిపూర్ లో గత ఏడాది కాలంగా హింసాకాండ ప్రజ్వరిల్లుతున్నా.. ఆడపిల్లలను నగ్నంగా ఉరేగించిన సంఘటనలు జరిగినా ప్రధాని మోడీకి అక్కడి వెళ్లేందుకు తీరిక లేదు. అయినా కూడా జనం మనను అంగీకరించారన్న భావన బీజేపీలో కలిగితే .. అవే పరిస్థితులు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ జరిగే ప్రమాదం ఉందని పరకాల ప్రభాకర్ అన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా నిలువరించడానికి ఒక అవకాశం 2024 ఎన్నికలలో  దేశ ప్రజలకు ఉందని ఆయన అన్నారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోకుంటే.. దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తీసుకువచ్చిన వారౌతారని ఆయన హెచ్చరించారు.   

అమరావతికే జై.. లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలోకి మూడు రాజధానుల ఉద్యమకారులు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అత్యంత ప్రభావమంతమైన ఆంశం ఏదైనా ఉందంటే అది అమరావతి రాజధాని మాత్రమే. అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానుల నాటకానికి తెరలేపిన జగన్ పై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రచారానికి వెడుతున్న వైసీపీ నేతలు, అభ్యర్థులను ఈ అంశంపై జనం నిలదీస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర మంతటా ఉంది. అటువంటిది.. రాజధాని ప్రాంతంలోనే గత నాలుగేళ్లుగా జగన్ మూడు రాజధానుల నాటకానికి మద్దతుగా రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిందే అంటూ కొందరు టెంటు వేసుకుని ఉద్యమం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారి ఆందోళనకు కర్త, కర్మ, క్రయ అంతా వైసీపీయేనని విమర్శలున్నాయనుకోండి అది వేరే సంగతి. జగన్ కోసం, జగన్ చేత, జగనే నడిపిస్తున్న ఉద్యమంగా మూడు రాజధానుల ఉద్యమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆ ఉద్యమ కారులు మందడం గ్రామంలో టెంటు వేసుకుని మరీ గత నాలుగేళ్లుగా మూడు రాజధానులు కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఆ మందడం గ్రామం  మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 5, 337 ఓట్ల తేడాతో అప్పటి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.  అయితే ఆ క్షణం నుంచీ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్నే తన కార్యక్షేత్రంగా మలచుకుని అక్కడి జనంతో మమేకమయ్యారు. రానున్న ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి  నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు.   తన ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజల మన్ననలూ పొందుతున్నారు. అందరినీ కలుపుకుని పోతూ ముందుకు సాగుతున్నారు. తటస్థులు సైతం ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అటువంటి లోకేష్ కు మద్దతుగా మూడు రాజధానుల కోసం గత నాలుగేళ్లుగా ఉద్యమం కొనసాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించారు. మందడంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన టెంట్ ను తొలగించారు. ఉద్యమ నిర్వాహకులందరూ లోకేష్ సమక్షంలో  మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.  సరిగ్గా ఎన్నికల వేళ.. జగన్ కు జగన్ సర్కార్ కు మద్దతుగా గత నాలు గేళ్లుగా మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న వారు..  తెలుగుదేశం గూటికి చేరి అమరావతికి జై కోట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.   గత ఎన్నికలలో లోకేష్ కు ప్రత్యర్థిగా నిలిచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి విజయావకాశాలు లేవని భావించిన జగన్ లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో బీసీ మహిళలను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు.  అయితే సర్వేలన్నీ  భారీ మెజారిటీతో  లోకేష్ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నాయి. తాజాగా మూడు రాజధానులంటూ ఉద్యమించిన వారంతా ఆ ఉద్యమానికి తెర దించి లోకేష్ కు మద్దతుగా ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆక్కడ వైసీపీ పనైపోయిందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

గుడివాడ‌లో కొడాలి నాని గెలుపు ఆశలు ఆవిరి?!

లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన త‌రువాత ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీతో పాటు కూట‌మి పార్టీలైన బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. దీంతో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో ఎన్నిక‌ల కొలాహ‌లం నెల‌కొంది. ఈ ఎన్నిక‌ల్లో   గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం హాట్ సీట్లలో ఒకటిగా ఉందనడంలో సందేహం లేదు. గుడివాడలో వైసీపీ అభ్య‌ర్థిగా కొడాలి నాని మ‌రోసారి బ‌రిలోకి దిగారు. కూట‌మి త‌ర‌పున తెలుగుదేశం అభ్య‌ర్థిగా వెనిగండ్ల రాము బ‌రిలో ఉన్నారు. కాడాలి నానిని ఓడించేందుకు తెలుగుదేశం నేత‌లు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.  తాజా సర్వేలో  గుడివాడ‌లో కొడాలినానికి ఈసారి ఓట‌మి త‌ప్ప‌ద‌ని తేలింది. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో కొడాలి నానిపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.  ఐదు రోజుల క్రితం ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించిన కొడాలి నాని.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామానికి వెళ్తూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో నానికి ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న ఎదుర‌వుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌పై  ప్ర‌జ‌లు నాని ని నిలదీస్తున్నారు. ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌నఉన్న ప్ర‌తిఒక్క‌రికి కొడాలి నాని పేరు చెప్ప‌గా ముందుగా గుర్తుకొచ్చేది బూతుల ఎమ్మెల్యే అనే.  నాని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస‌గా నాలుగు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా,  2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా కొడాలి నాని విజ‌యం సాధించారు. గత ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొడాలి నానిని క్యాబినెట్‌లోకి తీసుకున్నాడు. అప్ప‌టి నుంచి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్‌తో పాటు చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పైన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తో కొడాలి నాని విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. దీంతో నారా, నందమూరి కుటుంబాల అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు కొడాలి నానిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లో కొడాలి విజ‌యాల ప‌రంప‌ర‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు. కొడాలి నానికి పోటీగా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా  వెనిగండ్ల రాము బరిలో నిలిచాడు. రాము నియోకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల నుంచిసైతం మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం అభ్యర్థికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. దీంతో గుడివాడలో కొడాలి నానికి ఈసారి ఓటమి తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా సర్వే సైతం అదే చెప్పింది.   గుడివాడ‌లో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కొడాలి నానికి ఎదురుగాలి వీస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో స‌మ‌స్య‌ల‌పై కొడాలిని ప్రజలు నిల‌దీస్తున్నారు. అడుగ‌డుగునా నిర‌స‌న సెగ‌లు ఎదుర‌వుతున్నాయి. తాజాగా గుడ్‌మాన్‌పేట మ‌హిళ‌లు కొడాలి నానిని స‌మ‌స్య‌ల‌పై నిల‌దీశారు. తాగునీటి సమస్య, ఇండ్ల పట్టాలపై మహిళలు నిలదీశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని, ఎందుకు అలా చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొడాలి నాని ఆర్డీవోకు ఫోన్ చేసి మహిళలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని సూచించాడు.  ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది.. సాధ్యం కాదని ఆర్డీవో చెప్పారు. మహిళల నుంచి ఎదురవుతున్న నిరసనను తప్పించుకునేందుకు కోడ్ అమల్లో ఉందని తెలిసినా ఆర్డీవోకు నాని ఫోన్ చేశారని, కోడ్ లో ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఇవ్వరని తెలియదా కొడాలి నానికి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొడాలి నానికి గుణపాఠం చెబుతామని, ఓటు ద్వారా బుద్దిచెబుతామని వారు హెచ్చరించారు. నియోకవర్గంలో ప్రతీ గ్రామంలోనూ కొడాలికి గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. దీంతో కొడాలి వర్గీయులు సైతం ఆందోళనలో ఉన్నారు.   వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కొడాలి నాని.. ఐదోసారి విజేతగా నిలవాలని భావిస్తున్నాడు. అయితే, ఈ సారి కొడాలికి భారీ షాకిచ్చేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పలు సర్వేల ఫలితాలు పేర్కొన్నాయి. ఇప్పటికే పేరున్న సంస్థల సర్వేలు విడుదల చేసిన ఫలితాల్లో గుడివాడ నియోకవర్గంలో ఈసారి కూటమి అభ్యర్థి వెనిగడ్ల రాము విజయం సాధించబోతున్నారని పేర్కొన్నాయి. గత 20ఏళ్లుగా నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా కొడాలి నాని కొనసాగుతున్నప్పటికీ.. అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని, దీనికితోడు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైందని అంటున్నారు.  మొత్తానికి బూతుల ఎమ్మెల్యేగా పేరుగడించిన కొడాలి నానికి ఈసారి గుడివాడ ప్రజలు బిగ్ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మనసులో మాట బయటపెట్టిన జయప్రద... చింత చచ్చినా పులుపు చావలేదన్న నెటిజన్లు 

ఎపిలో త్రికూటమి ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాటు పూర్తయిన తర్వాత కూడా ఆశావహులు మాత్రం టికెట్లను ఆశిస్తున్నారు. ఒకప్పుడు యుపీ రాజకీయాల్లో సమాజ్ వాది పార్టీ తరపున చక్రం తిప్పిన ప్రముఖ సినీ నటి  జయప్రద పుట్టిన గడ్డపై మమకారంతో రాజకీయాల్లో మళ్లీ రాణించాలని చూస్తున్నారు.  బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నటి జయప్రద తాజాగా తన మనసులోమాట బయటపెట్టారు. తనకు ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుందని తెలిపారు. ‘‘ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా కోరిక, అయితే, ఇదంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని కూడా ఉన్నట్టు జయప్రద పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మట్లాడారు.  అలనాటి నటి  స్టేట్ మెంట్ తో రాజకీయాలు ఒక వ్యసనం అని మరోసారి  నిరూపణ అయ్యింది. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం అయ్యారు.  అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ, బెంగాలి 300కు పైగా సినిమాలలో నటించారు.  జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీ  వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు ఆహ్వానం మేరకు  ఆ పార్టీలో చేరారు. ఆమె 1996లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో యుపిలోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 85వేల మెజారిటీతో  ఎన్నికయ్యారు.  అదే పార్టీకి చెందిన ఆజం ఖాన్ తో విభేధాలు రావడంతో జయప్రద సమాజ్ వాది పార్టీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇదే సమయంలో సమాజ్ వాది మాజీ ప్రదానకార్యదర్శి  అమర్ సింగ్ తో కల్సి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి   అమర్ సింగ్ వ్యవస్థాపక అధ్య క్షులుగా ఉన్నారు.     జయప్రద  ప్రదాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు.      ఆ పార్టీ 2012 లో యుపి అసెంబ్లీ ఎన్నికల్లో  మొత్తం 403 స్థానాల్లో 360 అభ్యర్థులు పోటీ చేసింది. అయితే అనూహ్యంగా  రాష్ట్రీయ లోక్ మంచ్  ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది. దీంతో జయప్రద అమర్ సింగ్ తో కల్సి రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరినప్పటికీ అక్కడ కూడా రాణించలేకపోయారు. ఆ పార్టీ నుంచి బిజ్నోర్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. అమర్ సింగ్ మరణం తర్వాత 2019లో జయప్రద బిజెపిలో చేరినప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.   అయితే, జయప్రద ఏపీ నుంచి బరిలోకి దిగే అవకాశం తక్కువేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తులో ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. టీడీపీ అభ్యర్థులు 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ సీట్లలో జనసేన తన అభ్యర్థులను బరిలో నిలిపింది. మే 13న ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. 

తెలుగుదేశం కూటమిదే విజయం.. ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈ సారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదని పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 17 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.  ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమై నవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలోఅన్ని దారులూ రోమ్ వైపే అన్నట్లుగా అన్ని సర్వేల ఫలితాలూ తెలుగుదేశం కూటమినే సూచిస్తున్నాయి. తాజాగా మరో జాతీయ మీడియా సర్వేలో కూడా ఆంథ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. ఇండియా టుడే మూడ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  అంటూ నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం కూటమికి ఏకపక్ష విజయం ఖాయమని తేలినట్లు పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి 17 నియోజకవర్గాలలో విజయం సాధిస్తుందనీ, జగన్ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుందని పేర్కొంది. ఇటువంటి ఫలితాలే అసెంబ్లీ ఎన్నికలలోనూ వస్తాయని పేర్కొంది. అంటే తెలుగుదేశం కూటమి 119 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే.. తెలుగుదేశం 45శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక వైసీపీకి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని, బీజేపీ2 శాతం, కాంగ్రెస్ 3 శాతం ఓట్లు సాధిస్తాయని ఇండియాటుడే సర్వే పేర్కొంది. ఇతరులకు 9 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది.  ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం బీజేపీ పది స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి.  మిగిలిన స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో ఉంటారు.  వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తున్నది. పోటీ ప్రధానంగా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్యే ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ పార్టీ ఏంత మేర బలోపేతమైతే అంత మేరకు వైసీపీ నష్టపోతుందని సర్వే తేల్చింది.   తెలంగాణలో కాంగ్రెస్ దే హవా! ఇక తెలంగాణలోక్ సభ ఎన్నికలపై కూడా ఇండియా టుడే  సీఓటర్ తన సర్వే ఫలితాన్ని వెలువరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక బీజేపీ మూడు స్థానాలలో, బీఆర్ఎస్ మూడు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధిస్తుందనీ, బీఆర్ఎస్ కు కేవలం 21శాతం ఓట్లు మాత్రమే వస్తాయనీ సర్వే పేర్కొంది. బీజేపీక 29శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్లు, ఇతరులకు 6శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది.  తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్  ఓట్ల శాతం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది.   

సీఎస్ జవహర్ రెడ్డిపై ఈసీ వేటు తప్పదా?

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. పాలనా పగ్గాలు చేతిలో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి  పై తెలుగుదేశం మొదటి నంచీ ఆరోపణలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఆ ఆరోపణలతో సంబంధం లేకుండా  సామాజిక పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఆయన వైఫల్యం, వైసీపీ సర్కార్ కు అనుకూలంగా పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని ఆయన మలచడానికి చేసిన యత్నాలు ఇప్పుడు ఆయన జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేశాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పెన్షనర్లకు ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులివ్వకుండా, సచివాలయాల వద్దకు రప్పించి వారిని  తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులుగా మార్చేందుకు జవహర్ రెడ్డి ప్రయత్నించిన తీరు పట్ల ఈసీ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు.   ఇటీవల అంగన్వాడీలు సమ్మె చేసిన సమయంలో  జగన్ సర్కారు వెంటనే  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ, గ్రామ, వార్డు సిబ్బందిని అంగన్వాడీల సమ్మెవల్ల ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వారిని ఉపయోగించుకుంది.  అయితే అత్యంత కీలకంమైన పెన్షన్ల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పట్టించుకోకుండా జవహర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గాఈ అంశాన్ని పెన్షనర్లలో తెలుగుదేశం పట్ల ఆగ్రహం వ్యక్తం అయ్యేందుకు వీలుగా మలచి, తద్వారా జగన్ సర్కార్ కు మేలు చేయాలన్న లక్ష్యంతోనే జవహర్ రెడ్డి నిష్క్రియాపరత్వం ప్రదర్శించారని ఇప్పటికే తెలుగుదేశం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు తరువాతే ఎన్నికల సంఘం వికలాంగులు, వయోవృద్ధులకు మూడు రోజులలో ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను బట్టి చూస్తే జవహర్ రెడ్డిపై వేటు వేసే విషయం ఈసీ పరిశీలనలో ఉందన్న సంగతి అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే విధంగా ఇన్చార్జి డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమంటే తెలుగుదేశం ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ విషయంకూడా ఈసీ పరిశీలనలో ఉందనీ, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశాలున్నాయనీ అంటున్నారు. 

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోన్లూ ట్యాపింగ్?.. జగన్ కు కేసీఆర్ సర్కార్ హెల్ప్?

తెలంగాణలో  ప్రకంపణలు సృష్టిస్తున్న  ఫోన్ ట్యాపింగ్  ఆంధ్రప్రదేశ్ నూ వదల లేదా?.  తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం వద్ద కూడా  ట్యాపింగ్ వాహనం ఏర్పాటు చేశారా? అంటే అందుతున్న సమాచారం మేరకు ఔనన్న సమాధానమే వస్తున్నది.  హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేతల  ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను చేరవేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసం లక్ష్యంగా ట్యాపింగ్ జరిగినట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఏపీలో తెలుగుదేశం వ్యూహాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీకి సహకరించే ఇండస్ట్రియలిస్టులు ఎవరు?  ఆ పార్టీకి ఎవరెవరి నుంచి నిధులు అందుతున్నాయి అన్న విషయాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించి వాటిని ఎప్పటికప్పుడు ఏపీ సీఎం జగన్ కు చేరవేసినట్లుగా పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  అలాగే జనసేనాని పవన్ కల్యాణ్,  జగన్ చెల్లెలు షర్మిలల నివాసాల వద్ద కూడా ఫోన్ ట్యాపింగ్ కోసం వాహనాలు ఏర్పాటు చేసి మరీ వారితో ఎవరెవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు?  ఎవరెవరు కలుస్తున్నారు?  వారికి అండదండలు అందిస్తున్న ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఇత్యాది వివరాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేసినట్లు సమాచారం. ఈ వివరాలన్నీ ప్రణీత్ రావు, రాధాకిషణ్ ల విచారణలో వెల్లడైందని అంటున్నారు.   ఇక వైసీపీ రెబల్ ఎంపీ జగన్‌పై తిరుగుబాటు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నివాసం వద్దకు  ఏపీ ఇంటలిజన్స్ పోలీసులు వెళ్లేందుకు అనుమతించిన నాటి బీఆర్‌ఎస్ సర్కార్ ఆయన ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు.  రఘురామకృష్ణం రాజు కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ పలు సందర్భాలలో ఫిర్యాదు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.   తన మిత్రుడైన జగన్ కు సహాయపడేందుకే హైదరాబాద్ లోని ఏపీ రాజకీయ నాయకుల ఫోన్ లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని జగన్ కు చేరవేయడం వెనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వం హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అందుకు ప్రతిఫలంగానే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు సాగర్ డ్యామ్ వద్ద హై డ్రామాకు జగన్ తెరలేపారనీ, తద్వారా ఆ ఎన్నికలలో కేసీఆర్ కు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నాడు సానుకూలం.. నేడు ప్రతికూలం.. జగన్ లో ఓటమి భయం

సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. విజయం వరించే దీవెనలే లభిస్తున్నాయి. 2019 ఎన్నికల వేళ పరిస్థితికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. నాటి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఒంటరిగా బరిలోకి దిగింది. ప్రధాని మోడీ సర్కార్ ఏపీ అభివృద్ధి విషయంలో ఇసుమంతైనా సహకారం అందించడం లేదని ఆరోపిస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం రాష్ట్ర విభజన హామీలు సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఊరూ వాడా ఏకం చేసేలా ప్రచారం సాగించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తో చంద్రబాబు విభేదించిన నేపథ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం అధీనంలో ఉన్న అప్పటి అధికార యంత్రాంగం అంతా చంద్రబాబు ఆపద్ధర్మ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేసింది. వైసీపీ ఫిర్యాదులపై ఆఘమేఘాల మీద స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి సీఎస్ ను విధుల నుంచి తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నేరుగా నియమించింది. ఆయన అప్పట్లో వైసీపీకి ఎంత అనుకూలంగా వ్యవహరించారో అందరికీ తెలిసినదే. ఆయన సమన్ చేసి పిలిపించుకోవలసిన డీజీపీ వద్దకు స్వయంగా వెళ్లి మరీ దిశా నిర్దేశం చేశారంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో కుట్ర జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.  అప్పట్లో మీడియా మొత్తం చంద్రబాబుకు అన్నీ అపశకునాలే ఎదురౌతున్నాయంటూ కథనాలు ప్రచురించింది. ప్రసారం చేసింది. ఏది ఏమైనా అప్పటి ఎన్నికలలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడిని తలపించాయి. దాంతో అప్పడు తెలుగుదేశం పరాజయం పాలై విపక్షానికి పరిమితం కావలసి వచ్చింది. ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి తెలుగుదేశం అనూహ్యం, అద్భుతం అనదగ్గరీతిలో పుంజుకుంది.  జగన్ అస్తవ్యస్థ విధానాలు, ప్రజా వ్యతిరేక పాలన, కక్ష సాధింపు ధోరణి కారణంగా ప్రజలలో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతోంది. నాడు అంటే 2019 ఎన్నికల ముందు జగన్ కు కలిసి వచ్చిన ప్రతి అంశమూ ఇప్పుడు వ్యతిరేకంగా మారింది. నాను సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఇప్పుడు జగన్ కు ప్రతికూలంగా మారడమే కాకుండా ఈ రెండు సంఘటనలూ కూడా నాడు చంద్రబాబును ప్రజలలో బదనాం చేయడానికి జగన్ చేత, జగన్ కొరకు జగనే చేయించారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ రెండు సంఘటనల దర్యాపు, కోర్టులలో జరిగిన, జరుగుతున్న విచారణలో వెల్లడౌతున్న అంశాలన్నీ జగన్ వైపే వేలెత్తి చూపుతున్నాయి. అలాగే స్వయంగా వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి, జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా వివేకా హత్య కేసులో జగన్ తీరునే తప్పుపడుతున్నారు. సునీత అయితే అసలు విలన్ జగనేనా అన్న అనుమానాలు వస్తున్నాయని మీడియా సమావేశంలోనే చెప్పేశారు. వివేహా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికే మళ్లీ కడప టికెట్ ఇచ్చి పక్కన పెట్టుకుని ప్రచారం చేయడంతో జగన్ పట్ల ప్రజలలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వివేకా హంతకులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని జనం విశ్వసించడానికి దోహదకారిగా మారింది. ఇక  ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించడంతో ఆయన దిక్కు తోచని స్థితిలో పడినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మేమందరం సిద్దం అని చాటుతూ జగన్ ప్రారంభించిన బస్సుయాత్ర తుస్సు మనడమే కాకుండా, ఆ యాత్ర ప్రారంభించిన నాటి నుంచీ జగన్ కు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. జగన్ బస్సుయాత్ర కడప దాటిందో లేదో కడన లోక్ సభ బరి నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రకటించారు.  అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేరుగా జగన్ ప్రభుత్వం మీద, ఆయన సొంత కుటుంబ సభ్యులను దూరం చేసిన తీరుపైనా నేరుగా విమర్శలు గుప్పిస్తూ.. ఇంత కాలం జగన్ కు అండగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును ఆయనకు దూరం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించిన షర్మిల జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఇంతకాలం వైసీపి వైపు ఉన్న కాంగ్రెస్‌ ఓటర్లు మళ్ళీ కాంగ్రెస్‌ వైపు  చూస్తున్నారు.  ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీ కచ్చితంగా జగన్ కంచుకోటలను బీటలు వారుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మరోపక్క సునీత రెడ్డి తన తండ్రి హత్య కేసు గురించి సాక్షి మీడియాలోనే  జగన్ తోముఖాముఖీకి సిద్ధమని విసిరిన సవాల్ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనడంలో సందేహం లేదు. ఆ సవాల్ ను స్వీకరించనూలేక, అలాగని సమాధానం చెప్పకుంటే సునీత ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ వివేకా హంతకులతో తాను అంటకాగుతున్నట్లు జనం భావిస్తారన్న భయంతో జగన్ దిక్కు తోచని స్థితిలో పడ్డారని అంటున్నారు. అదే సమయంలో పుండుమీద కారం చల్లిన చందంగా  జగన్‌  కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఒక ఐజీ సహా ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ వేటు వేసింది. వారందరినీ ఎన్నికల విధులకు దూరం చేసింది.  గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ తరములేశ్వర్ రెడ్డిలను సరిగ్గా ఎన్నికలకు ముందు విధుల నుంచి తప్పించడం జగన్‌ ప్రభుత్వానికి నిస్సందేహంగా మింగుడుపడని విషయమే.   చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నుంచి లేదా కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి కోరుకున్నది కూడా ఇదే.  జగన్‌ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలలో గెలవాలనే ప్రయత్నిస్తారన్న ఉద్దేశంతోనే దానికి చెక్ పెట్టేందుకే చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని పరిశీలకులు ఎప్పుడో విశ్లేషించారు. ఇప్పుడు ఆ విశ్లేషణలన్నీ సరైనవేనని తెలుతోంది.  ఈ ఐదుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ లపై వేటుతోనే ఈసీ ఆగుతుందని భావించలేమని పరిశీలకులు అంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, రాష్ట్రంలో ఇంకా పలువురు అధికారులు  ఇప్పటికీ జగన్ సేవలో తరిస్తున్నారనీ, వారిపై కూడా రానున్న రోజులలో వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు.  ఇక అన్నిటికీ మించి వాలంటీర్లను పింఛన్ పంపిణీ నుంచి దూరంగా ఉంచాలన్న ఈసీ నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారనీ, కుట్రతో వృద్ధులు, వికలాంగులకు పించన్లు అందకుండా చేస్తున్నారనీ ప్రచారం చేసిన వైసీపీకి  సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇళ్ళవద్దే పింఛన్లు చెల్లించాలని ఈసీ ఆదేశించడం  పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.  ఈసీ   ఈ నెల 6వ తేదీలోగా అందరికీ పింఛన్లు అందించాలని ఉత్తర్వులు జారీ చేయక  తప్పని పరిస్థితిలో జగన్ సర్కార్ పడింది.   సచివాలయ సిబ్బంది మూడు రోజులలో అందరికీ పింఛన్లు చెల్లించగలిగితే, మరి ఇంతకాలం లక్షల మంది వాలంటీర్లను ఎందుకు ప్రభుత్వం ఎందుకు పోషించింది అన్న ప్రశ్న జనంలో ఉత్పన్నం అవుతుందన్న భయం కూడా జగన్ ను వెంటాడుతోంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సానుకూలాంశాలుగా మారుతాయని జగన్ వణికి పోతున్నారు. గత ఎన్నికలలో  కలిసి వచ్చిన అంశాలే ఇప్పుడు ప్రతికూలంగా మారి ముంచేస్తాయని ఆందోళనలో ఉన్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ ఇప్పుడు సానుకూలంగా మారి విజయమే తరువాయి అన్న భరోసాను కల్పిస్తున్నాయి. 

కోలుకోగానే తెనాలి వెళ్తా: పవన్ కళ్యాణ్ 

జనసేనాని పవన్ కల్యాణ్ అస్వస్థతతో బాధపడుతూనే నిన్న పిఠాపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగారు. దాంతో, ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో చికిత్స కోసం పిఠాపురం నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. వాస్తవానికి పవన్ ఇవాళ తెనాలిలో  వారాహి విజయభేరి సభలో పాల్గొనాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ వెళ్లిపోవడంతో ఈ సభ వాయిదా పడింది.  పవన్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లోనూ, జనసేన పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  అస్వస్థతకు గురికావడం వల్ల తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెనాలి విచ్చేసి, వారాహి సభలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు.

సుమలత  బీజెపి తీర్థం ? 

ప్రముఖ సినీ నటి, మాండ్యా ఎంపీ సుమలత (60) బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటకలో ఈసారి ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనుండగా, సుమలత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరి, ఎన్డీయే అభ్యర్థి హెచ్ డీ కుమారస్వామికి మద్దతు ఇస్తానని నేడు ఓ ప్రకటనలో తెలిపారు.  జేడీ(ఎస్) నేత కుమారస్వామి రానున్న లోక్ సభ ఎన్నికల్లో మాండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెండ్రోజుల కిందట ఆయన సుమలత నివాసానికి వెళ్లి మద్దతు కోరారు. సిస్టర్... నాకు మీ సహకారం కావాలి అని అర్థించారు. ఈ నేపథ్యంలో, నేడు సుమలత చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  తాజా ప్రకటన చూస్తుంటే, మాండ్యా స్థానం నుంచి ఈసారి ఆమె పోటీ చేయడంలేదన్న విషయం స్పష్టమవుతోంది. గతంలో ఆమె తన భర్త అంబరీష్ మరణానంతరం మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సుమలత... కుమారస్వామి తనయుడు నిఖిల్ పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ నుంచి సహకారం లభించింది. అందుకు ఇప్పుడామె బీజేపీకి కృతజ్ఞత తెలుపుకుంటూ, పోటీ నుంచి విరమించుకున్నారు.  అయితే, తాను మాండ్యా నుంచి ఎక్కడికీ వెళ్లబోనని, రానున్న రోజుల్లోనూ తాను నియోజకవర్గం కోసం పనిచేస్తానని సుమలత స్పష్టం చేశారు. ఇవాళ ఆమె తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.

వాయునాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ 

 దేశంలో బిజెపిసంకీర్ణానికి ఎన్ డి ఏ అయితే కాంగ్రెస్ సంకీర్ణానికి  ఇండియా కూటమి నేతృత్వం వహిస్తుంది. ఎన్ డి ఏ కూటమికి ప్రధాని మోదీ అయితే ఇండియా కూటమికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ప్రచారంలో ఉంది. రాహుల్ గాంధీ దక్షిణాదిలోని కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు.  ఈ నేపథ్యంలో, ఇవాళ ఆయన వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రాగా, కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లి నామినేషన్ పత్రాలన సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నాను.  నామినేషన్ వేసే ముందు కాంగ్రెస్ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో, వాయనాడ్ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానని అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను అని తెలిపారు.

వైసీపీకి కిల్లి కృపారాణి గుడ్ బై 

ఎన్నికల ముంగిట్లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ నుంచి ముఖ్య నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆమెకు అప్పుడు నిరాశ ఎదురయింది. 2024లో అయినా టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఆమెకు ఈసారి కూడా టికెట్ దక్కలేదు. ఆమెకు జగన్ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు.  ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ... తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశారని విమర్శించారు. తనకు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదని చెప్పారు. పదవుల కంటే తనకు వ్యక్తిగత గౌరవమే ముఖ్యమని అన్నారు. తనకు గౌరవం ఎక్కడుంటే అక్కడకు వెళ్తానని చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.   

ఢిల్లీలో క‌ద‌లిక.. జ‌గ‌న్ వణుకే ఇక!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు.. అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మే13న జ‌రిగే పోలింగ్‌లో జగన్ కు ఆయన పార్టీకీ ఓటుతో   గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అయిపోయారు. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేత పెల్లుబుకుతుండ‌టంతో మ‌రోసారి అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని స‌ర్వేల‌ ద్వారా గుర్తించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాగోలా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీ నేత‌లు రాష్ట్రంలోని కొంద‌రు అధికారుల స‌హ‌కారంతో రెచ్చిపోతున్నారు. మ‌ రోవైపు వాలంటీర్లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎన్నిక‌ల ప్ర‌చారాల్లో పాల్గొన్నా, రాజ‌కీయ పార్టీల స‌మావేశాలకు హాజ‌రైనా, ఎన్నిక‌ల విధుల్లో నిమ‌గ్న‌మైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసీ ఉత్త‌ర్వుల‌కు లోబ‌డి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిసైతం ప్ర‌త్యేకంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయినా, కొంద‌రు వాలంటీర్లు బ‌హిరంగంగానే వైసీపీ అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా  ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయాల‌ని కోరుతున్నారు. దీనిపై  ప్ర‌తిప‌క్ష పార్టీల‌ నేత‌లు ఈసీకి ప‌లు సార్లు ఫిర్యాదులు  చేశారు.  ఏపీలోజగన్  హ‌యాంలో ఐదేళ్ల‌పాటు అరాచ‌క పాల‌న సాగింద‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ప్ర‌శ్నించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం, జైలుపాలు చేయ‌డంతోపాటు.. దాడులుసైతం చోటుచేసుకున్నాయి. మేము ఏం చేసినా మాకు ఎవ‌రూ ఎదురు మాట్లాడొద్దు.. మాట్లాడితే దాడులు త‌ప్ప‌వు అన్న‌ట్లుగా వైసీపీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేశారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా అక్ర‌మ కేసులు పెట్టింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. పోలీసులు, అధికారుల‌ను అడ్డంపెట్టుకొని ఐదేళ్లు రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగించాడు. జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ పాల‌న‌కు చెక్ పెట్టాలంటే కేంద్రంలో బీజేపీ అండ‌దండ‌లు ఉండాల‌ని భావించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్రంలో బీజేపీకి ప్ర‌జాబ‌లం లేక‌పోయినా వారు కోరిన సీట్లు ఇచ్చిన తమ కూటమిలో చేర్చుకున్నాయి. తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిలో బీజేపీ క‌లవ‌డం, గ‌త నెల‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూట‌మి బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆట‌ల‌కు చెక్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్, వైసీపీ నేత‌లు చేస్తున్న అరాచ‌కాల‌కు చెక్ పెట్ట‌డంలో తాత్సారం చేస్తూ వ‌చ్చారు. దీనికి తోడు పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌లో బీజేపీ అధిష్టానం జ‌గ‌న్ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌న్న  చ‌ర్చ‌ కూడా రాజకీయాలలో జరిగింది.  జ‌గ‌న్ ప్ర‌మేయం వ‌ల్ల‌నే బీజేపీ నుంచి టికెట్ ఆశించిన రాఘురామ‌ రాజుకు చుక్కెదురైంద‌న్న వాద‌న‌లు తెర‌పైకి వ‌చ్చాయి. స్వయంగా ర‌ఘురామ‌ రాజు సైతం త‌న‌కు బీజేపీ టికెట్ రాక‌పోవటానికి కార‌ణం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఏపీలోతెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌తో బీజేపీ పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీ పెద్ద‌లు మాత్ర‌మే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా జ‌రుగుతున్నది. దీంతో తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణులు బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. పొత్తు ధ‌ర్మాన్ని బీజేపీ తుంగ‌లో తొక్కుతున్నద‌న్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే  తాజాగా బీజేపీ కేంద్ర పెద్ద‌ల్లో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో గ‌త నాలుగు రోజులుగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా షాక్‌లు త‌గులుగుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వాలంటీర్లు ఎన్నిక‌ల్లో పాలు పంచుకోవ‌ద్ద‌ని ఇప్ప‌టికే ఈసీ ఆదేశించింది. దీనికితోడు పెన్ష‌న్ల పంపిణీలోనూ వాలంటీర్ల ప్ర‌మేయం ఉండొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలున్న వాలంటీర్లు పెన్షన్ల పేరుతో, రేషన్‌ పేరుతో ఓటర్ల వద్దకు వెళ్తుండడంతో ఇక నుంచి అలాంటివి కుదరవని ఈసీ తెల్చి చెప్పింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వైసీపీ పార్టీ అభ్య‌ర్థుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న అధికారుల‌పైనా ఈసీ గురిపెట్టింది. పలువురు కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల విధులకు దూరం చేసింది. దీంతో జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వారి ఆందోళల ప్రస్ఫుటంగా కనిపిస్తోంది‌. దీనికితోడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కు జ‌డ్ సెక్యూరిటీని కేంద్రం క‌ల్పించింది. వైసీపీ ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ పై అనేక‌సార్లు వైసీపీ నేత‌లు దాడుల‌కు య‌త్నించారు. ఆ స‌మ‌యంలో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరిన‌ప్ప‌టికీ వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికల మేర‌కు లోకేశ్ కు కేంద్ర జ‌డ్ కేట‌గిరి భ‌ద్ర‌త‌ను కేంద్రం క‌ల్పించింది. లోకేశ్ కు జెడ్ సెక్యూరిటీ ఇవ్వ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ నేత‌లు.. అవాకులు చ‌వాకులు పేలుతున్నారు.  సుప్రీం కోర్టులోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆదేశించింది. ఈసీ ఎన్నిక‌ల నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వైసీపీ నేత‌ల‌పై కొర‌డా ఝళిపిస్తుండ‌టంతో పాటు మ‌రోప‌క్క జ‌గ‌న్ కేసుల విచారణ కూడా వేగం పుంజుకుంటుండటంతో  బీజేపీ పెద్ద‌లు రంగంలోకి దిగార‌ని, జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయుల ఆగ‌డాల‌కు చెక్ ప‌డిన‌ట్లేన‌ని ప్ర‌తిప‌క్షాల నేత‌లు పేర్కొంటున్నారు. దీంతో జగన్ కు, ఆయన పార్టీ నేతలకూ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 

తైవాన్ లో భారీ భూ కంపం.. రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదు 

 తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7. 4 తీవ్రతగా నమోదు అయింది. ఇప్పటికే అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తైవాన్‌లో హువాలియన్‌ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఎంత మేర ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు. సునామీ హెచ్చరికలు.... భూకంపానికి భవనాలు కూడా కుంగిపోయిన దృశ్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తైవాన్ లో కుంగిపోయిన ఒక బిల్డింగ్ కుంగిపోయిన దృశ్యాలు వైరల్ గా మారాయి. భూకంపం తీవ్రతకు భయపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ అయ్యాయి. జపాన్‌లో నీటి మట్టాలు పడిపోతున్న దృశ్యాలు, ఇది సాధారణంగా సునామీకి ముందు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.  

 తెలంగాణ డిఎస్సీ పరీక్ష గడువు పొడగింపు 

తెలంగాణలో డీఎస్సీ పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ అప్లికేషన్లకు నేటితో గడువు ముగిసింది. అయితే దీనిని జూన్ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే డీఎస్సీ పరీక్ష తేదీలను ఖరారు చేశారు. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.తెలంగాణలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి

రఘునందన్ రావ్ పై కేసు నమోదు 

గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీచేసి పరాజయం చెందిన రఘునందన్ రావు టార్గెట్ గా బిఆర్ఎస్ పావులు కదుపుతోంది. గత ఎన్నికల ప్రచారంలో  దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై రఘునందన్ రావ్ హత్యాయత్నం చేయించినట్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దుబ్బాక నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుతో భారతీయ జనతాపార్టీ రఘునందన్ రావుకు మెదక్ లోకసభ స్థానం టికెట్ ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని బిఆర్ఎస్ నేతలు రఘునందన్ రావ్ పై ఏకంగా ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదయింది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

సునితారెడ్డి సవాల్.. వణికిపోతున్న వైసీపీ?

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య‌ను వాడుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం  తెలిసిందే. వివేకా హ‌త్య‌ను చంద్ర‌బాబు, తెలుగుదేశం నేత‌ల‌పై నెట్ట‌డంలో జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విజ‌యం సాధించారు. అయితే, వివేకా హ‌త్య‌కు కార‌ణం తెలుగుదేశం నేత‌లు కాద‌ని తేలిపోయింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హ‌త్య‌లో ప్ర‌ధాన ముద్దాయి అని విచార‌ణ‌ సంస్థ‌లు తేల్చేశాయి. అయినా  అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అధికారాన్ని ఉప‌యోగిస్తూ అండ‌గా నిలిస్తున్నారని జ‌గ‌న్ చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు సూటిగానే ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య కేసులో నిందితుల‌కు శిక్ష ప‌డాల‌ని సునీతారెడ్డి కోర్టుల్లో పోరాటం చేస్తున్న విష‌యం తెలిసింది. అయినా, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అవినాశ్ రెడ్డికి క‌డ‌ప‌ ఎంపీ టికెట్ ఇవ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ నిర్ణ‌యంతో మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్న సునీతారెడ్డి, వైఎస్ ష‌ర్మిలలు ఈ వ్య‌వ‌హారంపై నేరుగా ప్ర‌జ‌ల్లో తేల్చుకునేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు  పోటీ చేస్తుండ‌గా.. వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు ఎక్క‌డైనా సిద్ధ‌మ‌ని, సాక్షి ఛానెల్‌లోనూ చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని సునీతారెడ్డి సవాల్ చేశారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య వ్య‌వ‌హారం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం పీఠాన్ని అదిరోహించ‌డంలో కీల‌క భూమిక పోషించింది. ప్ర‌స్తుత‌ ఎన్నిక‌ల్లో అదే వివేకా హ‌త్య ఘ‌ట‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌ధాన ఆయుధంగా మార‌బోతుంది. ప్ర‌తిప‌క్షాల‌కు తోడు.. చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ప్ర‌జా క్షేత్రంలో జ‌గ‌న్ అరాచ‌కాలను నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీకి ఎవ‌రూ ఓట్లు వేయొద్ద‌ని, హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించొదంటూ సునితారెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌జ‌ల‌ను కోరారు. తాజాగా, ఆమె మ‌రో అడుగు ముందుకేసి వివేకా హ‌త్య ఘ‌ట‌నపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని, అవ‌స‌ర‌మైతే సాక్షి ఛాన‌ల్ లోనూ తాను చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్చ‌కు రావాల‌ని   ఛాలెంజ్ చేశారు. సునీతా ఛాలెంజ్‌తో వైసీపీ శ్రేణులు వణికిపోతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి సవాల్ లో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన‌ట్లుగా అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అంటూ ష‌ర్మిల‌, సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ అడ్డుకుంటున్నాడ‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న తండ్రిని హ‌త్య‌చేసిన హంత‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతూ సునీతారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌, ఆయన పార్టీ నేతలూ వివేకా హంత‌కులు సునీతారెడ్డి, ఆమె భ‌ర్త అని, వివేకా అక్ర‌మ సంబంధ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మంటూ ప్ర‌చారం చేశారు. ప్ర‌తీరోజూ సునీతారెడ్డిపై బుర‌ద జ‌ల్ల‌ట‌మే ప‌నిగా వైసీపీ వ్యవహరించింది.   ఇలాంటి ప‌రిస్థితుల్లో సునీతారెడ్డి ఛాలెంజ్‌ను జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స్వీక‌రించ‌కుంటే ఇన్నాళ్లూ తాము  సునీతారెడ్డి, ష‌ర్మిల‌పై చేసిన విమ‌ర్శ‌లు త‌ప్పుడు విమ‌ర్శ‌ల‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకొనే ప్ర‌మాదం ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు‌. జ‌గ‌న్ స్థానంలో ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తీరెడ్డి రంగంలోకిదిగి సునీతారెడ్డితో చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని, అలా చేయ‌కుంటే మ‌రికొద్దిరోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ స‌ర్కార్ కుప్ప‌కూలడం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లిన స‌మ‌యంలో పార్టీ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న చెల్లెలు ష‌ర్మిల భుజానికెత్తుకున్నారు. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి జ‌గ‌న్ జైలు నుంచి మ‌ళ్లీ తిరిగొచ్చే వ‌ర‌కు వైసీపీ బ‌లోపేతానికి ఆమె కృషి చేశారు. అలాంటి చెల్లెలు సైతం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పూర్తిగా మారిపోయారని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌కు విరుద్దంగా వైసీపీ పాల‌న ఉందంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో ముద్దాయి అవినాశ్ రెడ్డి అని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మ‌ళ్లీ క‌డ‌ప ఎంపీ సీటును అవినాశ్ రెడ్డికి ఇవ్వ‌డంపై ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ‌కీయంగానే ఎదుర్కొనేందుకు వారు సిద్ధ‌మ‌య్యారు. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల్లో అవినాశ్ రెడ్డిని ఓడించ‌డం ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి షాకిచ్చేందుకు ష‌ర్మిల సిద్ధ‌వ్వ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఒక‌వైపు వివేకా హ‌త్య‌కేసు, క‌డ‌ప‌లో వైఎస్ ష‌ర్మిల పోటీ, మ‌రోవైపు జ‌గ‌న్ తో వివేకా హ‌త్య‌పై చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మంటూ సునీతారెడ్డి సవాల్ ఇలా అన్ని అంశాలు ఏపీ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తుండ‌గా.. వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యాన్ని పెంచుతున్నాయి.