మాజీ సైనికుడి భూమి కబ్జా.. అడ్డంగా దొరికిన బొత్స.. అరెస్టు తప్పదా?
posted on Mar 24, 2024 @ 12:09PM
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ఏపీ ప్రజలు సిద్దమవుతున్నారు. మే 13న జరిగే పోలింగ్‌లో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ఉత్సకతతో ఎదురుచూస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ఏపీలో అభివృద్ధి సంగతి అటుంచితే.. ప్రజలకు కనీస సౌకర్యాలుకూడా కరువయ్యాయి. వేధింపులు తోడయ్యాయి. వైసీపీ నేతలు ఇసుక, మట్టి దోపీడీతో కోట్లాది రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి.. ఐదేళ్లలో మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యాన్ని విక్రయించి వేల కోట్లు ప్రజాసొమ్మును జేబుల్లో వేసుకోవడమే కాకుండా ప్రజారోగ్యాన్ని గుల్ల చేశారు. ఇక భూ కబ్జాల వ్యవహారం చెప్పనే అక్కర్లేదు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ భూములను వైసీపీ నేతలు కబ్జాలు చేస్తూ వచ్చారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి విచారణ చేయాలని హస్తిన నుంచి లేఖ కూడా వచ్చింది. అయితే ఎన్నికల వేళ ఇబ్బంది ఎదురవుతుందని భావించిన ప్రభుత్వం. ఈ లేఖను తొక్కిపట్టినట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా అది కూడా వెలుగులోకి రావటంతో బొత్స సత్యనారాయణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బొత్స సత్యనారాయణపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బొత్సపై వోక్స్‌వ్యాగన్ స్కాం ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆయన భూకబ్జాల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో రెండువేల ఎకరాలకు పైగా భూములు బొత్స కుటుంబ అధీనంలో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. బొత్స, ఆయన వర్గీయులు అందిన కాడికి భూములను కబ్జా చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి చాలవన్నట్లు ఓ మాజీ సైనికుడి భూమిని బొత్స, ఆయన వర్గీయులు కబ్జాకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆ మాజీ సైనికుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
బొత్స సత్యనారాయణ, ఆయన వర్గీయులు తన రిటైర్మెంట్ తరువాత రక్షణ శాఖ కేటాయించిన 4.75 ఎకరాల భూమిని కబ్జాచేశారనీ, కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ మాజీ సైనికుడు సింగంశెట్టి శ్రీనివాస్ ఏకంగా ప్రధాని కార్యాలయంకు లేఖ రాశారు. ప్రధాని కార్యాలయం ఆ లేఖను రక్షణ శాఖకు పంపించింది. సింగంశెట్టి శ్రీనివాస్ లేఖను జత చేస్తూ.. పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్ కు రక్షణ మంత్రిత్వ శాఖ లేఖను పంపించింది. ఒకవేళ నిజంగా కబ్జాకు గురై ఉంటే సంబంధింత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖ స్పష్టంగా పేర్కొంది.
ప్రధాని కార్యాలయానికి మాజీ సైనికుడు పంపించిన లేఖలో భూమికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను జత చేశారు. ఎప్పుడు తాను రిటైర్ అయ్యింది.. ఎప్పుడు తనకు రక్షణశాఖ భూమిని కేటాయించింది అనే విషయాలను పూర్తి వివరాలతో ప్రస్తావిస్తూ ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖలో సింగంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ లేఖలో కబ్జాకు పాల్పడిన వారిలో మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం మున్సిపల్ చైర్మన్ చిన్న శ్రీను, పార్లమెంట్ సభ్యుడు చంద్రశేఖర్ పేర్లను ప్రస్తావించారు. ఈ లేఖను జనవరి 10న ప్రధాని కార్యాలయానికి పంపించగా..రక్షణ శాఖ నుంచి విచారణ జరిపి కబ్బాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిత్తూరు కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి 12న ఆదేశాలు వచ్చాయి. అయితే వాటిని తొక్కిపెట్టారు. కానీ తాజాగా ఆ లేఖ వెలుగులోకి వచ్చింది. లేఖలో రక్షణశాఖ పేర్కొన్నట్లుగా చిత్తూరు కలెక్టర్ విచారణ చేసి నివేదిక పంపించినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదు. దీంతో రక్షణ శాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాళ్లే ఒక కమిటీ వేసి మాజీ సైనికుడి భూమి నిజంగా కబ్జా అయిందా? ఎవరు కబ్జా చేశారు అనే విషయాలపై ఆరా తీయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కబ్జా చేసినట్లు బయట పడుతుందని బొత్స, ఆయన వర్గీయుల్లో ఆందోళన మొదలైనట్లు విజయనగరం జిల్లాలో చర్చ జరుగుతున్నది. మాజీ సైనికుడి భూమిని కబ్జా చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ప్రధాని కార్యాలయం మాజీ సైనికుడి లేఖను సీరియస్ గా తీసుకుంటే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క కబ్జాతోనే విచారణ ఆగదు.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా బొత్స, ఆయన వర్గీయుల భూకబ్జాల వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో మంత్రి వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్న చర్చ జరుగుతున్నది.
మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన అనుచరులు చీపురుపల్లి, విజయనగరం ప్రాంతాల్లో ఇప్పటికే గుట్టలు, కొండలు తవ్వేయడంతోపాటు అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రక్షణ శాఖ, ప్రధాని కార్యాలయం మాజీ సైనికుడి భూమిని కబ్జా విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తే బొత్సాకు కబ్జాల ఉచ్చు బిగుసుకోవటం ఖాయమని అంటున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ అలర్ట్ అయినట్లు సమాచారం. కబ్జాల వ్యవహారం ఉచ్చు మెడకు చుట్టుకోకముందే బీజేపీ నేతలను అప్రోచ్ అయ్యి వారి ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అదీ కాకుంటే అవసరమైతే బీజేపీలోకి వెళ్లి.. మాజీ సైనికుడితో సెటిల్ మెంట్ చేసుకొని ఆ భూమిని ఆయనకే అప్పగించే ఆలోచనలో బొత్స వర్గం ఉన్నట్లు ఏపీలో ప్రచారం జరుగుతున్నది. మొత్తానికి ఎలాగైనా మాజీ సైనికుడి భూకబ్జా వ్యవహారంపై ప్రధాని కార్యాలయం, రక్షణ శాఖ సీరియస్ కాకముందే ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించుకోవాలని, లేకుంటే ఇన్నాళ్లు మనం చేసిన భూకబ్జాల వ్యవహారంలు కూడా వెలుగులోకి వచ్చి అరెస్టుకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళన బొత్స సత్యనారాయణ, ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతోందని అంటున్నారు.