బీజేపీ అపర చాణిక్యం! బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ ఖాతాలోకే!
ఉత్తరాదిలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వున్నా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తొమ్మిది స్థానాలు గెలవబోతోంది. ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడానికి వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేసింది. సికింద్రాబాద్ సీటును పణంగా పెట్టి మొత్తం తెలంగాణాలో ఓట్లను తనకు అనుకూలంగా మలచుకుంది. ఎంఐఎం సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండని పిలుపునివ్వడంతో తెలంగాణా వ్యాప్తంగా హిందు ఓటర్లపై ప్రభావం పడి బీఆర్ ఎస్ ఓట్లు బీజేపీకి మళ్ళాయి. తెలంగాణాలో కాషాయపార్టీకి బాగానే కలిసొచ్చింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి భారీ ఎత్తునే పడ్డాయి.
గ్రౌండ్ లెవెల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్ని చూసినట్లైతే.... బీజేపీ 9, కాంగ్రెస్ 7, ఎంఐఎం 1.
1. ఆదిలాబాద్ః కాంగ్రెస్ - బీజేపీ మధ్యే ఫైట్ కనిపిస్తోంది. అయినా బీజేపీకే ఎడ్జ్ వుంది. మంత్రి సీతక్క బాగా వర్క్ చేశారు. పోల్ మేనేజ్‌మెంట్ బాగా చేశారు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినా, భైంసా, ఆదిలాబాద్ హిందుత్వ ఓటు బ్యాంక్ తో పాటు, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 4 గురు బీజేపీ ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో బీజేపీ విజయావకాశాలు పెరిగాయి. ప్రధాన పోటీ బీజేపీ - కాంగ్రెస్ మధ్య వున్నప్పట్టికీ ఇక్కడ బీజేపీకే గెలుపు అవకాశాలున్నాయి.
2. నిజామాబాద్ః బీజేపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. హిందుత్వ ఎజెండే పని చేసింది. బీజేపీ అభ్యర్థి అరవింద్ ఇమేజ్ తో పాటు ఆయన ప్రసంగాలు, డైలాగ్స్ ఓటర్లను బాగానే ఆకట్టుకున్నాయి. పైగా ఇక్కడి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకి వుండటంతో అరవింద్‌కు బాగా కలిసి వచ్చింది. పోటీ బీజేపీ - కాంగ్రెస్ మధ్య ఉన్నా బీజేపీకీ గెలుపు అవకాశాలున్నాయి.
3. కరీంనగర్ః బీజేపీకే ఎడ్జ్ స్పష్టంగా కనిపిస్తోంది. బండి సంజయ్‌కి సానుభూతి వచ్చింది. ఆయన స్వంత ఇమేజ్‌తో పాటు, మైనార్టీ ఓట్లు కూడా పడ్డాయి. ఇక్కడ పోటీ బీజేపీ - బీఆర్ ఎస్ మధ్య ఉంది. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి. ఇక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి కూడా చేతులెత్తేశారు. కాబట్టి బీజేపీ గెలుపు ఖాయమని చెప్పవచ్చు.
4. పెద్దపల్లిః 7 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇంఛార్జ్ గా పని చేశారు. బీజీపీ వీక్ అయినా బాగా పుంజుకుంది. పోల్ మేనేజ్‌మెంట్ సరిగా చేయలేదు కాంగ్రెస్. దీంతో బీజేపీకి బాగా ప్లస్ అయింది. మోడీ వేవ్ వుండటంతో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ కనిపించింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ వుందని చెప్పవచ్చు.
5. వరంగల్ః మందకృష్ణ మాదిగ ప్రభావం బాగా పనిచేసింది. కాంగ్రెస్ మాదిగల్ని పట్టించుకోలేదనే ప్రచారం ఓటర్లలో బాగా వెళ్ళింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ బలంగా వుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల బీజేపీ సెకెండ్ ప్లేస్ లో వుంది. ఇక్కడ బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వీక్. బీజేపీ అభ్యర్థి బీఆర్ ఎస్ నుంచి వచ్చారు. ఆర్థికంగా కూడా బలమైన నేత. బీజేపీ - కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ వున్నప్పట్టికీ, బీజేపీకే ఎడ్జ్ వుంది.
6. భువనగిరిః బీజేపీకే అనుకూలంగా వున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ జోక్యంతో సీన్ మారింది. సి.ఎం. రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకగా తీసుకున్నారు. కోమటి బ్రదర్స్‌ను పొగుడుతూ సి.ఎం. చేసిన ప్రసంగాలు వైరల్ అయ్యాయి. సి.ఎం. అభ్యర్థి కోమటిరెడ్డి అనే డైలాగ్‌తో మొత్తం సీన్ మారింది. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నప్పట్టికీ కాంగ్రెస్ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నాయి.
7. నల్గొండః కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా ఇక్కడ గెలుపు కాంగ్రెస్ అభ్యర్థిదే.
8. చేవెళ్ళః బీజేపీ భారీ మెజార్టీ తో ఇక్కడ గెలవనుంది. బీజేపీ అభ్యర్థి కుటుంబనేపథ్యం, ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మోడీ వేవ్ బాగా కలిసి వచ్చింది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రంజిత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సపోర్ట్ చేయలేదు. బీఆర్ ఎస్ ఎఫెక్ట్ కూడా అంతగా లేదు. కాబట్టి ఈ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు.
9. మెదక్ః ఇక్కడ బీఆర్ ఎస్ - బీజేపీ మధ్యే పోటీ ఉన్నప్పట్టికీ ఎడ్జ్ బీజేపీకే వుంది. బీఆర్ఎస్‌కు 6 గురు ఎమ్మెల్యేలున్నా పోల్ మేనేజ్‌మెంట్ చేయలేకపోయారు. బీజేపీ అభ్యర్థి రఘునంద్‌రావు ప్రసంగాలు, ఆయన మాట తీరు ప్రజల్లో బాగా వెళ్ళింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అయింది. బీజేపీ అభ్యర్థిగా గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
10. మల్కాజ్‌గిరిః ఎన్నికలకు ముందే ఈటెలకు ఒన్ సైడ్ అనే ప్రచారం జరిగింది. ఇక్కడ గెలవడాన్ని ఈటెల ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ఆయన కోడలు బాగా యాక్టివ్‌గా తిరిగారు. కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ కావడంతో ఇక్కడ పోటీ బీజేపీ - కాంగ్రెస్ మధ్య వుంది. అయితే ఇక్కడ ఈటెల గెలుపు ఒన్ సైడ్ అని చెప్పవచ్చు.
11. నాగర్‌కర్నూల్ః కాంగ్రెస్ పార్టీకి ఈజీ గా గెలిచే సీటు అనుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుకబడ్డారు. అంతగా ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మాల అభ్యర్థిని బరిలో దింపింది. అయితే ఇక్కడ మాదిగ ఓట్లు ఎక్కువగా వున్నారు కాబట్టి వాళ్ళే కీలకం. వాళ్ళంతా బీజేపీ వైపే మళ్ళారు. బీజేపీ అభ్యర్థి భరత్ యువకుడు. మాదిగ కులస్థుడు. అతని తండ్రి గతంలో మంత్రిగా చేశారు. ఇవన్నీ భరత్‌కు బాగా కలసి వచ్చాయి. దీంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం నాగర్ కర్నూల్‌లో వుండటంతో అదీ ప్లస్ అయింది. 2019 లో బీఆర్ ఎస్ నుంచి రాములు 2 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు భరత్‌కు తండ్రికి లభించిన ఓట్లు ప్లస్ అవుతాయని బీజేపీ అంచనా వేస్తోంది. నాగర్ కర్నూల్‌లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోంది.
12. మహబూబ్‌నగర్ః ఇక్కడ బీజేపీ - కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. సి.ఎం. స్వంత నియోజకవర్గం. బీజేపీ అభ్యర్థి డికె అరుణకి స్థానికంగా మంచి పట్టు వుంది. ఆర్థిక బలం వుంది. గెలిస్తే మంత్రి అవుతారు. మోదీ వేవ్ కలిసి వస్తుందనుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ గెలుపు కోసం సి.ఎం. రేవంత్ బాగానే కష్టపడ్డారు. అయితే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి మధ్య కొంత ఆధిపత్యపోరు కనిపించింది. అది కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. మరో వైపు బీఆర్ ఎస్ ఓట్లు కూడా బీజేపీకే పడ్డాయి. సి.ఎం. రేవంత్‌రెడ్డి ఎనిమిది సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న కాంగ్రెస్ కే ఎడ్జ్ కనిపిస్తోంది.
13. ఖమ్మంః కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. బీజేపీ సెకెండ్ ప్లేస్‌కు ఎదిగింది. ట్రైబల్ ఏరియా లో బీజేపీ బాగా బలపడింది. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది.
14. మహబూబాబాద్ః కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది.
15. జహీరాబాద్ః బీజేపీ - కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ గెలుపు అవకాశం బీజేపీకే వుంది. పోల్‌మేజేజ్‌మెంట్ గట్టిగా చేసింది బీజేపీ. నార్త్ ఇండియా వాళ్ళు ఇక్కడ ఒటర్లుగా ఉన్నారు. వారి ఆధిపత్యం ఎక్కువ. ఆర్థికంగా బలమైన వ్యక్తి వుండటంతో అది బీజేపీకి కలిసి వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వుండటం బీజేపీకి కలిసి వచ్చింది. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి... గతంలో బీఆర్ ఎస్ నుంచి 2 సార్లు గెలిచారు. ఇప్పుడు బిజేపీలోకి వచ్చి పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.
16. సికింద్రాబాద్ః కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ వుంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు 6 లక్షకు పైగా వున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆర్థికంగా బలవంతుడు. పోల్ మేనేజ్‌మెంట్ చేయడంలో ఆయనకు తిరుగులేదు. పైగా ఎంఐఎం తమ అభ్యర్థిని పోటీలో పెట్టకపోవడం, కాంగ్రెస్‌కు కలిసి వస్తుంది. ఎంఐఎం వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌కు ఓటు వేయమని, బీజేపీని ఓడించమని పిలుపునిచ్చింది. ఎంఐఎం చేసిన ప్రచారం, మొత్తం తెలంగాణాలో హిందూ ఓట్లపై ప్రభావం చూపింది. బిజెపి-ఎంఐఎం కలిసి గేమ్ ప్లాన్ ప్లే చేయడంతో బీజేపీ తెలంగాణాలో భారీ ఎత్తున సీట్లు గెలిచే అవకాశం దొరికింది. బీజేపీ ఎత్తుగడ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం చేకూర్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరో వైపు కిషన్‌రెడ్డి డబ్బు పంచలేదు. లోకల్‌గా అందుబాటులో వుండరనే ప్రచారం కూడా ఆయనకు మైనస్ చేసింది. మొత్తానికి ఎంఐఎం ప్రచారం, సికింద్రాబాద్‌లో డ్యామేజ్ చేసినా, తెలంగాణాలో బీజేపీకి అలా కలిసివచ్చింది.
17. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి యూట్యూబ్ వ్యూస్ మీద చూపిన ఆసక్తి ఓటర్లపై చూపించలేదు. కేవలం సోషల్ మీడియా ప్రచారాన్నే నమ్ముకుని నటనలో జీవించారు. గొప్ప నటిగా పేరు పొందారు కానీ రాజకీయ నాయకురాలిగా రాణించలేకపోయారు. బీజేపీ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఎప్పట్టి లాగా భారీ మెజార్టీతో ఎంఐఎం ఈ సారి కూడా విజయం సాధించనుంది.
- ఎం.కె. ఫజల్