సార్వత్రిక ఫలితాల తరువాత కింగ్ మేకర్ చంద్రబాబే!
posted on May 28, 2024 @ 12:32PM
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల 1న జరిగే తుదివిడత పోలింగ్ తరువాత జూన్ 4న ఫలితాలు వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ తరువాత పరిశీలకులు, రాజకీయపండితులు ఒక అంచనాకు అయితే వచ్చేశారు. గత రెండు ఎన్నికల తరహాలో ఈ సారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసవరమైనన్ని స్థానాలు సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని గట్టిగా వినిపిస్తున్నది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, బీహార్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలలో బీజేపీ బాగా వెనుకబడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలలో విజయం లభించే అవకాశాలు అంతగా లేవని చెబుతున్నారు. దీంతో బీజేపీ అనివార్యంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు. ఇక బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, జేడీఎస్, షిండే వర్గం శివసేనలు కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అవి కూడా చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుగా చెప్పుకోదగ్గ స్థానాలతో నిలిచే పార్టీ ఏదన్న ప్రశ్నకు సెఫాలజిస్టులు తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెబుతున్నారు. ఔను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరిన సంగతి తెలిసిందే. సో.. మరో సారి మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరేందుకు ఆ పార్టీకి తెలుగుదేశం అండ గట్టిగా అవసరమౌతుందని చెబుతున్నారు. సెఫాలజిస్టుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి 15కు పైగా లోక్ సభస్థానాలలో విజయం సాధిస్తుంది. అప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీదే కీ రోల్ అవుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కింగ్ మేకర్ గా మారుతారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు కచ్చితంగా మేలు జరుగుతుంది.