సీఎస్ జవహర్ రెడ్డి.. ఎటేపమ్మ ఒంటరి నడక!?
posted on May 28, 2024 @ 1:56PM
సీఎస్ జవహర్ రెడ్డి నిబంధనలకు నిలువుపాతరేసి.. అడ్డగోలుగా జగన్ తో అంటకాగిన జవహర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ఎవరకూ కూడా ఆయనకు మద్దతుగా నోరు మెదపడం లేదు. విశాఖలో భూ దందాకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఇప్పుడు అండగా నిలిచి మాట్లాడే వారే కరవయ్యారు. వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడిన ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఖండించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆయనకు కూడా తనపై ఆరోపణలను ఖండించి ఊరుకోవడమే కానీ, ఆరోపణలు చేసిన వారిపై పోలీసు కేసు పెట్టడం కానీ, కోర్టుకు వెళ్లడం కానీ చేయడానికి రెడీగా లేనట్లు కనిపిస్తున్నది.
తొలుత జనసేన నాయకుడు ఒకరు భూ దందా వ్యవహారాన్ని బయటపెట్టగానే జవహర్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఓ లేఖ రాశారు. తక్షణం ఆరోపణలను ఉపసంహరించుకోకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే తన ఆరోపణలకు ఆధారాలున్నాయనీ, తగ్గేదే లేదనీ సదరు జనసేన నేత మీడియా ముఖంగా ప్రకటించడంతో జవహర్ రెడ్డి మౌనం దాల్చారు.
సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కూడా జవహర్ రెడ్డికి అన్ డ్యూ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. జవహర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, కరోనా సమయంలో హెల్త్ సెక్రటరీగా కీలక పదవులను అనుభవించిన జవహర్ రెడ్డిని సీఎం జగన్ సీనియర్లను సైతం తోసి రాజని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక ఆ క్షణం నుంచీ జవహర్ రెడ్డి జగన్ ఆడమన్నట్లల్లా ఆడారన్న విమర్శలు ఉన్నాయి. జవహర్ రెడ్డి నిర్ణయాలన్నీ జగన్ ను మెప్పించడం కోసమే అన్నట్లుగా ఉన్నయని తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది.
ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో ఎస్సీ భూములను బినామీల పేరిట కొనుగోలు చేశారన్న ఆరోపణలకు ఆయన ఇటీవల విశాఖ ప్రైవేటు పర్యటన బలం చేకూర్చింది. కాగా భూముల దందాలో వైసీపీ నేతల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలను ఖండించడానికి ఇంత వరకూ జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారు.
తన అధికారాలను దుర్వినియోగం చేసి మరీ వైసీపీకి పూర్తి మద్దతుగా నిలిచిన జవహర్ రెడ్డి ఇప్పుడు ఎటువైపు నుంచీ మద్దతూ అండా లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. జవహర్‌రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు..చీప్ సెక్రటరీ అంటూ సోమిరెడ్డి చంద్రమేహన్ రెడ్డి వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నా వైపీపీ నుంచి ఎక్కడా సౌండ్ వినిపించడం లేదు. మొత్తం మీద ఎవరి ప్రాపకం కోసం జవహర్ రెడ్డి తన హోదాను, ప్రతిష్టను ఫణంగా పెట్టి పని చేశారో వారే వదిలేయడంతో ఆయన పూర్తిగా ఒంటరి అయిపోయారు.