చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు... ఇదీ ఇప్పటి వరకు చాలామంది చూస్తున్న దృక్కోణం! కానీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్న కోణం మరొకటి వుంది.. అదే ‘‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?’’
ఈసారి ఎన్నికలలో నాలుగు వందల స్థానాలు సాధించాలని బీజేపీ ఊహల పల్లకీలో విహరిస్తోందిగానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల పోలింగ్ సందర్భంగా బీజేపీ సొంతగా దుమ్ముదులిపేసింది అని చెప్పుకునే స్థాయిలో ఓట్లు పడలేదు. ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న పార్టీలు కొన్ని తమ సత్తాను చాటగలిగాయిగానీ, బీజేపీకి తాను ఊహిస్తున్న స్థాయిలో సీట్లు వస్తాయన్న ఆశ కనిపించడం లేదు.. ఒక వేళ బీజేపీకి రావలసిన మెజారిటీ కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈసారి ప్రధానమంత్రి పదవి మోడీకి, బీజేపీ నాయకుడికి కాకుండా ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న మిగతా పక్షాల్లో వున్న సమర్థుడైన నాయకుడికి ప్రధానమంత్రిగా అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించే అవకాశం వుంది. ఆ నాయకుడు చంద్రబాబు ఎందుకు కాకూడదు?
దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు, ఇండియా భాగస్వామ్య పక్షాలతోపాటు, ఈ రెండు కూటములలోనూ లేని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగట్టగల శక్తి వున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆమాటకొస్తే బీజేపీలో కూడా మోడీ, అమిత్ షా మినహా చాలామంది చంద్రబాబు అభిమానులు వున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడిన చంద్రబాబు చరిత్రను గుజరాత్ బ్యాచ్ మరచిపోయి వుండొచ్చేమోగానీ, బీజేపీ మరచిపోదు. ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థి మారాల్సి వచ్చిన పక్షంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేరు.
ఈ మాట అంటే కొంతమందికి కోపాలు వస్తే వచ్చాయిగానీ, అందర్నీ కలుపుకుని వెళ్ళే విషయంలోగానీ, నీతివంతమైన రాజకీయాలు నడపడంలోగానీ, ప్రజాస్వామిక విలువలను, లౌకిక విలువలను పాటించడంలోగానీ, సుదీర్ఘ అనుభవం విషయంలోగానీ, దేశాన్ని ముందుకు నడిపే విజన్‌లోగానీ, ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోగానీ నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు ఒక మెట్టు పైనే వుంటారు. అందుకే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అవ్వాల్సిన ఒక కీలక అంశం.. ‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్’!