గుడివాడ, గన్నవరం.. ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లంటే?
posted on May 28, 2024 @ 4:50PM
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రిపోల్, పోస్ట్ పోల్ అంచనాలన్నీ తెలుగుదేశం కూటమి విజయాన్నే సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తరువాత 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలౌతుంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓట్ల లెక్కింపు మచిలీపట్నంలోకి కృష్ణా వర్సిటీలో జరుగుతుంది. జిల్లాలో అందరి దృష్టి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపైనే ఉంది. ఈ నియోజకవర్గాలలో ఉండటానికి పోటీలో పన్నెండీసి మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే జరుగుతున్నది. గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా, తెలుగుదేశం తరఫున వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొత్తం 17 రౌండ్లలో జరుగుతుంది. ఫలితం మధ్యాహ్నానికే వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ పోలింగ్ సరళిని బట్టి చూస్తే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము స్పష్టమైన ఆధిక్యత సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మరో వైపు వైసీపీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఇక గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పోటీ ప్రధానంగా తెలుగుదేశం అభ్యర్థి యార్గగడ్డ వెంకటరావు, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 22 రౌండ్లలో సాగుతుంది. దీంతో ఈ నియోజకవర్గ ఫలితం తేలేందుకు ఒకింత ఆలస్యం కావచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా పోలింగ్ సరళిని బట్టి చూస్తే యార్లగడ్డ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి.