‘ఐరన్‌లెగ్’ వేణు స్వామి పరార్!
posted on May 28, 2024 @ 12:13PM
చేతికి దొరికినన్ని ‘భవిష్యత్తు జాతకాల’ రాళ్ళు విసిరి, ఆ రాళ్ళలో ఒక రాయి ఎక్కడో తగిలితే, ‘చూశారా నా గురి’ అని ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసే వేణు స్వామి గత కొద్ది రోజులుగా పరారీలో వున్నట్టు తెలుస్తోంది. గతంలో అనేకమంది సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద, ఆఖరికి వాళ్ళ ఆరోగ్యం, ప్రాణాల మీద కూడా తన ‘భవిష్యత్తు రాళ్ళు’ విసిరిన వేణు స్వామి ఈమధ్యకాలంలో రాజకీయ నాయకుల మీద కూడా ఆస్ట్రాలజీ రాళ్ళు విసురుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ తప్పకుండా గెలుస్తారని చెప్పిన వేణు స్వామి, కేసీఆర్ ఓడిపోవడంతో కొంతకాలం కిక్కురుమనలేదు. మళ్ళీ కొన్ని రాళ్ళు సమీకరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఈసారి కూడా గెలుస్తారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అలాగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని తేల్చేశారు. అయితే మే 13న పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కి అంత సీన్ లేదని అర్థమైపోయింది. అలాగే ఐపీఎల్‌లో వేణుస్వామి ఏ జట్టు అయితే గెలుస్తుందని చెప్పారో అదే సన్ రైజర్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో వేణు స్వామి మీద సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. వేణు స్వామిని చాలామంది మరో ‘ఐరన్‌లెగ్’ శాస్త్రి-2 అని అభివర్ణిస్తున్నారు.
ఇది ఇలా వుంటే, వేణు స్వామి ఎవరు గెలుస్తారని చెబితే వాళ్ళు వరసబెట్టి ఓడిపోతున్నారు. జగన్ కూడా గెలుస్తారని వేణు స్వామి చెప్పినప్పుడు మొదట్లో వైసీపీ వర్గాలు భలే అనుకున్నారు. కానీ, ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్.తోపాటు వేణు స్వామి జోస్యం ఫ్యాక్టర్ కూడా వౌైసీపీ వర్గాలకు వణుకు పుట్టిస్తోంది. ఆయన ఎవరు గెలుస్తారంటే వాళ్ళు ఓడిపోతూ వుండటంతో ఈ ‘ఐరన్ లెగ్’ ప్రభావం తమ పార్టీ మీద వుంటుందోమోనని మూఢనమ్మకాలతో భయపడిపోతున్నారు.
మొత్తమ్మీద ‘జ్యోతిషం’ అనే శాస్త్రాన్ని తన పబ్లిసిటీ కోసం సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకున్న వేణు స్వామి కేసీఆర్, సన్ రైజర్స్ ఓటమి తర్వాత జనానికి, బుచికీ యూట్యూబ్ ఛానళ్ళకి అందుబాటులో లేకుండా పరార్ అయిపోయనట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాలు కూడా వేణు స్వామి మీద గుర్రుగా వుండటంతో, ముఖ్యంగా వాళ్ళకి దొరక్కుండా వుండాలని వేణు స్వామి అబ్ స్కాండ్ అయినట్టు తెలుస్తోంది.