పిన్నెల్లికి మరో మూడు కేసుల్లోనూ బెయిలు
posted on May 28, 2024 @ 2:31PM
వైసీపీ మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం (మే28) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
అయితే పిన్నెల్లిపై తెలుగుదేశం ఏజెంట్ పై దాడి ఘటనకు సంబంధించి మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా ఆ మూడు కేసులలో కూడా పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ మూడు కేసులలో కూడా ఏపీ హైకోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది. ఈ ఏ కేసులలోనూ కూడా జూన్ 6వ తేదీ వరకూ పిన్నెల్లిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. బెయిలు మంజూరు చేస్తూ కోర్టు పిన్నెల్లికి కొన్ని షరతులు విధించింది.
కోర్టు విధించిన షరతుల మేరకు పిన్నెల్లి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ మాచర్లలో అడుగు పెట్టకూడదు. అలాగే నరసరావుపేటలో ఆయన ఉండే నివాసం చిరునామా ఇవ్వాలనీ, అదే విధంగా ఆయన పాస్ పోర్టును సరెండర్ చేసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు హాజరు వేయించుకోవాలి. అయితే కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లోచ్చని కోర్టు పేర్కొంది. అయితే ఆ రోజు కూడా ఆర్వో ముందు హాజరవ్వాలని పేర్కొంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి కనుకనే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వ్యులలో స్పష్టం చేసింది.