సిక్కోలు జిల్లాలో తొలి ఫలితం.. తమ్మినేని ఫేట్ డిసైడ్ చేస్తుంది!
posted on May 28, 2024 @ 12:13PM
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడతాయి. ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టబోయేది ఎవరు? పరాజయం పాలై ఇంటికి చేరేదెవరు అన్నది తేలడానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ లోగా గెలుపు ఓటములపై పలు చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఒక వరుస ప్రకారం జరుగుతుంది. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తొలుత వెలువడుతుంది. చివరిగా పాతపట్నం నియోజకవర్గ ఫలితం వెలువడుతుంది. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకూ ఈ నెల 13న రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పాటే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక సిక్కోలు జిల్లా నుంచి మొదటిగా వెలువడబోయే ఫలితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గానిదే. ఈవీఎంలు ఎచ్చర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాల స్టోర్ రూంలో భద్రంగా ఉన్నాయి.
ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. నిబంధనల ప్రకారం తక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజ కవర్గ ఫలితాలను ముందుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం చూసుకుంటే ముందుగా వెలువడే ఫలితం ఆముదాలవలస. ఎందుకంటే ఈ నియోజకవర్గ కౌంటింగ్ 19 రౌండ్లలో పూర్తి అవుతుంది. అంటే జిల్లాలో తొలి ఫలితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ పోటీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గానిదే ఔతుంది. ఇప్పటికే ఇక్కడి ఫలితం ఏమిటన్నదానిపై పరిశీలకులు, స్ట్రాటజిస్టులు ఒక అంచనాకు వచ్చేశారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ పరాజయాన్ని అంగీకరించేసి చేతులెత్తేసిన పరిస్థితి.
సో తొలి ఫలితం స్పీకర్ తమ్మినేని భవితవ్యాన్ని తేల్చేస్తుందన్న మాట. ఇక ఆతరువాత వరుసగా పలాస, ఇచ్చాపురం, నరసరావుపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతాయి. 323కు పైగా పోలింగ్ కేంద్రాలున్న పాతపట్నం నియోజకవర్గ ఫలితం చివరిగా వెలువడుతుంది. ఇక శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గ ఫలితం వెలువడేసరికి మధ్య రాత్రి అవుతుందని అంటున్నారు.