చినజీయార్ స్వామి కాళ్లు మొక్కినప్పుడు తెలంగాణ గుర్తురాలేదా కేసీఆర్?
posted on May 28, 2024 @ 4:27PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏమైనా అభినవ గజనీయా? గతంలో ఆయన చేసినవేవీ ఆయనకు ఇప్పుడు గుర్తుకు లేవా? లేక తన కన్వీనియెన్స్ కోసం మరిచిపోయినట్లు నటిస్తున్నారా? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయహే తెలంగాణకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించే విషయమై బీఆర్ఎస్ గగ్గోలు పెట్టేస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి సంగీతమందించడమా అంటూ గుండెలు బాదేసుకుంటోంది. అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనమేంటని గొంతెత్తి అరుస్తోంది.
వాస్తవానికి కీరవాణి ఎప్పుడో మూడు దశాబ్దాల కిందటే.. హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అంతే కాదు ఆస్కార్ అవార్డు గెలుచుకుని యావత్ భారత దేశానికీ గర్వకారణంగా నిలిచారు. అటువంటి కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందిస్తుంటే బీఆర్ఎస్ నేతలు గంగవెర్రులెత్తిపోతున్నారు. ఇంత అన్యాయమా, ఇది తెలంగాణకు ద్రోహం చేయడం కాదా అంటూ ఊరూవాడా ఏకం చేసేస్తున్నారు. తన పార్టీ నేతలు, శ్రేణులూ ఇంత గొడవ చేస్తుంటే కేసీఆర్ మాత్రం పూర్తిగా మౌనముద్ర దాల్చారు. గజనీలా గతంలో తాను చేసినవేవీ గుర్తు లేనట్లు.. తన వాళ్ల వాచాలతను తీర్చుకోమని వదిలేసి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్లు పని చేసిన కేసీఆర్ తన హయాంలో ప్రోత్సహించిన వారంతా ఆంధ్రావ్యక్తులేనన్న సంగతిని కన్వీనియెంట్ గా మరచిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి అందివచ్చిన అవకాశంగా భావించి తమ వారిని అవాకులూ చెవాకులూ పేలుతున్నా కిమ్మనకుండా ఊరుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గీతాన్ని రచించినది తమిళుడైన శంకరంబాడీ సుందరాచారి. అలాగే అమరావతిపై విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం రచించినది తెలంగాణ వ్యక్తి అయిన సుద్దాల అశోక్ తేజ. ఈ విషయంలో ఆంధ్రులెవరూ ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. అంతెందుకు కేసీఆర్ మానస పుత్రిక, బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన మేఘా కృష్ణారెడ్డి. ఆ ప్రాజెక్టును ప్రారంభించినది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కేసీఆర్ గజినీలా మర్చిపోయారా? అప్పట్లో మేఘా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబెట్టడంపై అప్పటి మంత్రి హరీష్ రావు పూర్తిగా సమర్ధత ఆధారంగానే మెఘాకు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు.
ఇక కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పునర్నిర్మించి యాద్రాద్రి ఆలయ చీఫ్ ఆర్టిటెక్ట్ ఆనంద సాయి కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. అదే ఆంధ్రప్రదేశ్ కు చెంది స్వామి చినజీయర్ స్వామిని కేసీఆర్ తన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి మరీ పాద సేవ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే విశాఖ పట్నానికి చెందిన స్వామి స్వరూపానంద స్వామికి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో విలువైన భూములను కట్టబెట్టిన సంగతీ తెలిసిందే. ఇంతెందుకు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ జనమే ఉండేవారు. గజినీలా ఇప్పుడవన్నీమర్చిపోయి రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ సెంటిమెంటు అంటూ యాగీ చేస్తే జనం నమ్మరు.