కేటీఆర్ మాట్లాడ్డం బంద్‌ చేస్తే మంచిది!

అధికారంలో వున్నప్పుడు ఏం మాట్లాడినా అందరూ ఆహా, ఓహో అని చప్పట్లు చరుస్తారు. అధికారం పోయిన తర్వాత పట్టించుకునేవారే వుండరు. ముఖ్యంగా అధికారంలో వున్నప్పుడు తన మాటే వేదంగా నడిపించుకున్న కేటీఆర్ లాంటి వాళ్ళ మాటలకు అసలు విలువే వుండదు. ఆ విషయాన్ని అధికారం పోయి ఇంతకాలమైన గ్రహించలేని కేటీఆర్ తానింకా అధికారంలోనే వున్నాన్న భ్రమల్లో బతుకుతూ అదే ధో్రణిలో మాట్లాడుతున్నారు. ఆమధ్య ఉగాది రో్జున పంచాంగ శ్రవణం సందర్భంలో పంతులుగారు సాక్షాత్తూ కేటీఆర్ ముందే కూర్చుని, నోరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ చిలక కాదు కదా.. ఒక గండభేరుండం. అందుకే ఆ హితబోధ పట్టించుకోలేదు. ఎంత గండభేరుండమైనా గాలివాన ముందు తల వంచాల్సిందే కదా.. ప్రస్తుతం గాలివానలో చిక్కుకున్న కేటీఆర్ తల వంచడం మరచిపోయి తలెత్తి మాట్లాడుతున్నారు. చివరికి అవి తలవంపులుగా మారుతున్నాయి.

ఆదిలాబాద్‌లో రైతులు ఆందోళన చేశారట. వాళ్ళ మీద పోలీసులు లాఠీఛార్జ్ చేశారట. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి, కేరళకి వెళ్ళడం సిగ్గుచేటు అని కేటీఆర్ ఒక స్టేట్‌మెంట్ మీడియా మొహాన కొట్టేసి చేతులు దులుపుకున్నారు. అక్కడితో తన పని అయిపోయిందని అనుకుని ఆయన రిలాక్స్ అయితే అవ్వచ్చేమో, కానీ ఆయనకు ఆ మాట అనడానికి నైతికంగా ఎంత అర్హత వుందే అర్థం చేసుకోవాలి. రైతుల ఆందోళన పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలనే ఉసిగొల్పి, పరిస్థితిని లాఠీఛార్జ్ వరకు వచ్చేలా రచ్చ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు. బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ఎవర్నయినా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారా? ఎవరూ నోరు ఎత్తకుండా ఆందోళనకారులందర్నీ బూటు కాళ్ళ కింద వేసి తొక్కేశారే... అప్పుడేమయ్యాయి ఈ నీతి సూత్రాలు? ఏదో సినిమాలో సునీల్ డైలాగ్ ఒకటి వుంటుంది.. సార్ రూల్స్ పెడతారు... పాటించరు... అని.. మీ తీరు అలాగే వుంది కేటీఆర్ గారూ! అందువల్ల మీరు ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటలు, ఫ్లాష్‌బ్యాక్ మరచిపోయి చేసే కామెంట్లు మానుకుంటే మంచిది.

Teluguone gnews banner