పిఠాపురంలో స్టిక్కర్ల వార్
posted on May 28, 2024 @ 6:16PM
పిఠాపురంలో ఏది జరిగినా సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినప్పట్టి నుంచీ ట్రెండింగ్ లో ఉన్న సెగ్మెంట్ ఇది. అక్కడ ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా కొన సాగింది. యువత అర్థరాత్రి వరకు ఓటు వేశారు. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త…చాలా పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ పవన్ అభిమానులు బైకులు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మనల్నెవడ్రా ఆపేది అనే కొటేషన్స్ తో రచ్చ చేస్తున్నారు. ‘మా MLA పవన్' అంటూ రాయించుకుంటున్నారు.
అటు జనసేన కార్యకర్తలకు ధీటుగా వైసీపీ అభ్యర్థి వంగా గీతా అభిమానులు కూడా స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీతా అంటూ బైక్ లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిజల్ట్స్ కు ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఫ్లెక్సీలతో హంగామా చేస్తున్నారు.
పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో నడుస్తుందనడానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. పవన్ అనుచరులు మొదలు పెట్టిన మైండ్ గేమ్‌కి వైసీపీ కౌంటర్ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్‌ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీత కు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. టూవీలర్‌ల నెంబర్ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడంలేదు.
పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ బరిలో ఉండగా, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. అయితే వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడి ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.