30వేల పైచిలుకు మెజారిటీతో పవన్ విజయం.. జేడీ లక్ష్మీనారాయణ జోస్యం

పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి అన్నా, ఆయన కుటుంబం అన్నా తనకు ఎంతో గౌరవాభిమానాలున్నాయని చెప్పారు. ప్రజారాజ్యం అభ్యర్థిగా తాను గతంలో ఎన్నికలలో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా విజయంపై ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. దీంతో పిఠాపురంలో గెలిచేది ఎవరన్న దానిపై కాకుండా అక్కడ పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

ఈ తరుణంగా జేడీ లక్ష్మీనారాయణగా గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధినేత వీవీ లక్ష్మీనారాయణ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ దే విజయం అని చెప్పడమే కాకుండా ఆయనకు 30 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పారు. 

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పిఠాపురంలో పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్ పై తన పరిశీలనను, అభిప్రాయాలను పంచుకున్నారు.  పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ముఫ్ఫై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారనీ చెప్పారు. వాస్తవానికి పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ రికార్డు స్థాయి మెజారిటీతో అంటే దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం 30 వేల మెజారిటీ అని భావిస్తున్నారు.  మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పని చేసిన లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న సమయంలో  కేసులను దర్యాప్తు చేశారు.  

వీటిలో సత్యం కంప్యూటర్స్ కార్పొరేట్ కుంభకోణం, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసు, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. 2018లో ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన  ఆయన 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.   ఆ తరువాత ఆయన జనసేన నుంచి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచీ  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు, యువతలో చైతన్యం కలిగిస్తూ వచ్చారు.  ఇటీవలే ఆయన జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Teluguone gnews banner