భద్రతా వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ
posted on Aug 25, 2025 @ 11:42AM
నేడు ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు – ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించడంతోపాటు నిరుద్యోగులు నిరసన తెలిపే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
యూనివర్సిటీ మొత్తం ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా కంచెలు బిగించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకు? అని మండిపడ్డారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకని, విద్యార్థులేమైనా ఉగ్రవాదులా అని నిలదీశారు.
ఓయూ మెయిన్ గేట్ నుండి 3 కిలోమీటర్లు కాలి నడకన పలు సెక్యూరిటీ తనిఖీలు దాటుకొని వచ్చిన మీడియా ప్రతినిధులను ఠాకూర్ ఆడిటోరియం వద్ద పోలీస్ అధికారులు నిలిపివేశారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కేవలం తమ అనుకూల మీడియాకు మాత్రమే లోపలికి అనుమతిస్తూ మిగతా వారిని ఆపేస్తున్నారని జర్నలిస్టులు వాపోయారు. ఈ మాత్రం దానికి ఎంట్రీ పాసులు ఎందుకు ఇచ్చారంటూ మీడియా ప్రతినిధుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.