శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...భక్తుల రద్దీ సాధారణం
posted on Aug 25, 2025 @ 10:28AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత వారం రోజులు దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కాస్తా త్వరగానే శ్రీవారి స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుంది. సోమవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 4 కాంపాట్‌మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు.
ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు తిరుమల సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 72,119 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీకి రూ.4.02 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశమంతటా మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సైనికులు పట్టుదలతో, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. దేశ సైనిక శక్తి, దేశ భద్రత మరింత శక్తిమంతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.