భర్త అనుమానం... భార్య ప్రాణాలకే పెను ప్రమాదం!
posted on Aug 25, 2025 @ 11:09AM
మొన్నటి వరకూ భార్యలు తమ ప్రియుళ్లతో కలసి భర్తలను హతమార్చడం ఒక రేంజ్ లోజరిగింది. ఫస్ట్ నైట్ రోజు, హానీ మూన్ రోజు, పెళ్లయిన కొన్నాళ్లకు ఇలా వరుస ఉదంతాలు నమోదయ్యాయి. ఒక సమయంలో గత ఐదేళ్లలో 780కి పైగా భర్తలు తమ భార్యలు హతమార్చడం ద్వారా చనిపోయినట్టు తేల్చాయి ఎన్సీఆర్ రికార్డులు. ఈ రివర్స్ మేనియా ఏంటో అర్ధం కాక ఒక్కొక్కరూ బుర్ర బద్దలు కొట్టుకున్నారు. కాలం మారడం వల్ల ఇలా జరుగుతుందేమో అనుకున్నారు.
ఇప్పుడిది యదాతథ స్థితి చేరినట్టు కనిపిస్తోంది. మళ్లీ భర్తలే భార్యలను అనుమానం కొద్దీ హతమార్చే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అది కూడా ప్రేమించి పెళ్లాడిన తమ ప్రియ భార్యామణులను వరుస పెట్టున హతమార్చే ఘటనలు నమోదవుతున్నాయి. నాగర్ కర్నూల్ కి చెందిన ఒక భర్త తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెపై పెట్రోలు పోసి తగలబెట్టేసిన ఘటన నమోదయ్యింది.
పదేళ్ల క్రితం శ్రీశైలం- శ్రావణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు కూడా. కానీ శ్రావణిపై శ్రీశైలానికి అనుమానం. దీంతో తరచూ వేధించేవాడు. ఈ పోడు పడలేక శ్రావణి- శ్రీశైలం నుంచి విడిపోయి మహబూబ్ నగర్ లో ఉంటోంది. అయినా సరే శ్రీశైలం వేధింపులు ఆగేవి కావు. అప్పటికీ ఆమె మహిళా పోలీస్టేషన్లో కంప్లయింట్ చేసింది. అలాగని శ్రీశైలం ఆమెపై వేధింపులు ఆపలేదు.
పెపెచ్చు చంపడానికి పథకరచన చేశాడు. ఈనెల 21న తన భార్యను బైక్ పై సోమశిలకు విహారంగా వెళ్లి వద్దామని తీస్కెళ్లాడు. ఆల్రెడీ తన వెంట కత్తి, పెట్రోల్ తెచ్చిన శ్రీశైలం ఒక చోట ఆపి భార్యను కత్తితో పొడిచి చంపి ఆపై పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. తమ కూతురి జాడ కనిపించక పోవడంతో శ్రావణి తల్లిదండ్రులు పోలీస్ కంప్లయింట్ ఇవ్వగా ఆ సరికే పోలీసులకు లొంగిపోయాడు శ్రీశైలం.
మహేందర్ రెడ్డి స్వాతిది మరో ప్రేమ పెళ్లి విషాదగాథ. మహేందర్ రెడ్డి- స్వాతి ఇరువురూ వేర్వేరు కులాల వారు. ఇరుగుపొరుగున వీరికి ప్రేమ కలసింది. తర్వాత పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. గొడవలయ్యాయి. పంచాయితీలు జరిగి తర్వాత ఇరువురికీ యాదగిరి గుట్టలో మళ్లీ పెద్దల సమక్షలంలో పెళ్లయ్యింది. మహేందర్ రెడ్డి ప్రధాన అభ్యంతరం తన భార్యకు అప్పుడే కడుపు రావడం. ఇది వరకే ఆమె గర్భం దాల్చగా తీయించేశాడు. తర్వాత కూడా ఆమె గర్భం దాల్చగా దాన్ని కూడా వద్దంటాడు. దీంతో పారిపోయిన ఆమె పుట్టింటికి చేరింది. పెద్దలు రాజీ చేయడంతో మళ్లీ భర్త దగ్గరకు వచ్చింద.
వినాయకచవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటానంది ఐదు నెలల గర్భవతి అయిన స్వాతి. ఎంతకీ ఒప్పుకోలేదు మహేందర్ రెడ్డి. ఇలాక్కాదని స్వాతిని పూర్తిగా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు మహేందర్ రెడ్డి. దీంతో ఎక్సా బ్లేడు వంటి పరికరాలు తెచ్చుకుని ఇంట్లో దాచి పెట్టాడు. కావాలని భార్యతో గొడవ పెట్టుకుని.. గొంతు నులిమి చంపేసి ఆపై ఆమె మృతదేహాలను కండకండాలుగా నరికేశాడు. ఆపై ఆ విడిభాగాలను మూసీలో పడేశాడు.
ఆ తర్వాత తన భార్య ఫోన్ నుంచి అంతా మంచేనంటూ ఆమె తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపి అనుమానం రాకుండా చేశాడు. ఆపై ఆమె సోదరికి ఫోన్ చేసి, మీ చెల్లెలు కనిపించలేదని అన్నాడు. దీంతో ఆమె తన భర్తను మరిది వద్దకు పంపగా.. అతడు కొంత సేపటి నుంచి స్వాతి కనిపంచడం లేదని అన్నాడు. ఇరువురు కలసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అర్ధం పర్ధంలేని సమాధానాలు చెప్పడంతో.. మహేందర్ రెడ్డిని మరింత డీటైల్డ్ గా విచారించారు. కట్ చేస్తే అసలు నిషం కక్కేశాడు మహేందర్ రెడ్డి.
ఖమ్మం జిల్లా మధిరలో మరో ప్రేమ వివాహ విషాదగాథ. విజయవాడకు చెందిన సూర్యనారాయణ, మంగళగిరికి చెందిన నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కొడుకులు. మూడో మారు నాగలక్ష్మి గర్భం దాల్చింది. అయితే తన భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను తాగేసి వచ్చి వేధించేవాడు. అంతే కాదు పనికి కూడా సరిగా వెళ్లేవాడు కాడు.
అయితే అతడు భార్యపై పీకలోతు కక్ష పెంచుకుని ఆరోజు రాత్రి బాగా తాగేసి వచ్చాడు. పిల్లలిద్దరూ నిద్రిస్తుండగా.. ఆమెపై దాడి చేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో పారిపోయంది నాగలక్ష్మి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను మధిర ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుండగా.. ప్రస్తుతం నిందితుడు సూర్యనారాయణ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ మూడు ఘటనల్లో ముగ్గురిదీ ప్రేమ వివాహాలే. కానీ ఆ భర్తలు ఒక సమయంలో తమ భార్యలపై అనుమానం పెంచుకుని.. ఇదిగో ఇలా కడతేర్చే యత్నం చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.