ఆ కుటుంబం మీద మృత్యువు పగబట్టింది
posted on May 9, 2014 @ 4:37PM
మృత్యుదేవత కర్కోటకురాలు. జాలి, దయ అనే పదాలే దానికి తెలియవు. అలాంటి మృత్యువు ఒక్కోసారి మరీ కర్కోటకంగా ప్రవర్తిస్తుంది. దీనికి ఉదాహరణగా నిలిచే సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మృత్యువు ఒక కుటుంబం మీద పగబట్టింది. ధనశ్రీ కదమ్ అనే బాలిక పోటీ పరీక్ష రాయడానికి ముంబై - గోవా హైవే మీద ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. కుమార్తె మరణవార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్, ప్రియాంక గుండెలు పగిలేలా రోదించారు. కూతురి మృతదేహం దగ్గరకి చేరుకుని విలపించారు. ఆ తర్వాత కూతురు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ వెనుకే ప్రవీణ్, ప్రియాంక, వీరి సమీప బంధువు నరేష్ దేవ్‌రే కారులో వస్తున్నారు. ఇంతలో రోడ్డుపక్కన వున్న ఒక పొక్లెయినర్ అకస్మాత్తుగా ఒరిగిపోయి కారుమీద పడింది. దాంతో కారులో వున్న ప్రవీణ్, ప్రియాంక, నరేష్ అక్కడికక్కడే మరణించారు. తమ ఇంట్లో ముగ్గురూ ఒకేసారి మరణించడంతో, ప్రవీణ్, ప్రియాంక దంపతుల చిన్న కుమార్తె శివం కదమ్ షాక్‌కి గురైంది. ఈ దుర్ఘటనలను చూసి స్థానికులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.