రహస్యంగా సీమాంధ్ర రాజధాని అన్వేషణలో శివరామకృష్ణన్ కమిటీ
posted on May 10, 2014 @ 12:00PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నగరాన్ని ఏ ప్రాంతంలో నిర్మించాలనే విషయం మీద పరిశీలన జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించే కార్యక్రమంలో వుంది. ఈ కమిటీ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ, రాష్ట్ర అధికారులు సూచించిన ఇతర ప్రాంతాలలోనూ పర్యటించనుంది. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో తన పర్యటనను విశాఖపట్టణంతో ప్రారంభించింది. కమిటీకి తమ వాదనలు వినిపించడానికి అన్ని ప్రాంతాల నాయకులు విజ్ఞప్తులతో, వినతిపత్రాలతో సిద్ధంగా వున్నారు. కమిటీ మొదట వైజాగ్‌లో పర్యటిస్తుందన్న విషయం బయటకి తెలిసిపోయింది కాబట్టి తమను కలిసిన వారి విజ్ఞప్తులను కమిటీ స్వీకరిస్తుంది. అయితే ముందు ముందు ఇతర ప్రాంతాలలో కూడా ఇలాగే పలువురు తమను కలిసిన పక్షంలో తమ పర్యటన సక్రమంగా జరిగే అవకాశం లేదని శివరామకృష్ణన్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తమ పర్యటనను పూర్తిగా రహస్యంగా నిర్వహించాలని భావిస్తున్నారు. తమ పర్యటన గురించి ఎంతమాత్రం పబ్లిసిటీ చేయకూడదని, మీడియాకు కూడా సమాచారం ఇవ్వకూడదని కమిటీ పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.