కడప, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతున్న అల్లర్లు
posted on May 9, 2014 @ 1:54PM
ఎన్నికలు పూర్తయ్యి రెండురోజులు కావస్తున్నా నేటికీ కడప, నెల్లూరు జిల్లాలలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రెండు జిల్లాలు కూడా వైకాపాకు మంచి పట్టున్న ప్రాంతాలే కావడం వలన సహజంగానే వైకాపానే అనుమానించవలసి వస్తోంది. కడప జిల్లాలో జమ్మలమడుగు, ఖాజీపేట్, నెల్లూరులో దంతలూరు ప్రాంతాలలో నేటికీ ఇరువర్గాల నడుమ వీధిపోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి, వాటిలో ఇరువర్గాలకు చెందిన అనేకమంది గాయపడుతూనే ఉన్నారు. ఈ గొడవలకు ప్రధాన కారణం వైకాపాకు కంచుకోట వంటి ఈ ప్రాంతాలలో తెదేపా నేతలు పోటీకి దిగి, ఆ పార్టీ అభ్యర్ధులతో సమానంగా ప్రచారం చేసుకొని, వారితో సమానంగా డబ్బు, మద్యం వగైరాలు పంచడమే. తెదేపాకు చెందిన పీ.వెంకట శివారెడ్డి, వైకాపాకు చెందిన యం.యల్సీ. సీ.నారాయణ రెడ్డి వర్గాల మధ్య నిన్న జమ్మలమడుగులో ఘర్షణలు జరిగాయి. షరా మామూలుగా ఇరువర్గాల వారు గాయపడ్డారు, ఒకరిపై మరొకరు పోలీసు స్టేషన్లలో పిర్యాదులు చేసుకొన్నారు. కాజిపేట్ లో మైదకూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లా ఎరుకొల్లు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకు ముందు ఎన్నికలలో కూడా ఇటువంటి అల్లర్లు, గొడవలు జరిగినప్పటికీ, అవి ఏనాడు కూడా ఇంతగా ఎన్నికల ముగిసిన తరువాత కూడా సాగిన దాఖలాలు లేవు. ఇటువంటి రాజకీయ వాతావరణం రాష్ట్రానికి, రాజకీయాలకు కూడా హానికరం. రెండు పార్టీల అధినేతలు ఏసీ రూముల్లో కూర్చొని మీడియా ద్వారా ఒకరిని మరొకరు నిందించుకొంటూ కాలక్షేపం చేస్తుంటే, అక్కడ గ్రామాలలో కార్యకర్తలు వీరికోసం బుర్రలు పగలగోట్టుకొని రక్తాలు ధారపోస్తున్నారు. కనీసం ఇప్పటికయినా ఆ రెండు పార్టీల అధినేతలు చొరవ తీసుకొని తమ తమ కార్యకర్తలను నియంత్రిస్తే తమ కార్యకర్తల కుటుంబాలకి మేలు చేసినవారవుతారు.