మే 12 సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ కి ఓకే: సి.ఇ.సి.
posted on May 9, 2014 @ 5:39PM
గతంలో ఎన్నికలు జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కి అవకాశం వుండేది. అయితే ఈసారి ఎన్నికలలో ఆ అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు అనేక దశల్లో జరగడంతోపాటు ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల మీద ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల కమిషన్ 12వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని నిషేధం విధించింది. ఎన్నికలు ముగిసినా ఎగ్జిట్ పోల్స్ సందడి లేకపోవడంతో రాజకీయంగా వేడి వాతావరణం అకస్మాత్తుగా తగ్గిపోయిన ఫీలింగ్ అందరిలో ఏర్పడింది. ఎన్నికల వేడిని మళ్ళీ రగలబోతోంది. ఈనెల 12 నుంచి ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించుకోవచ్చని ఎన్నికల కమిషన్ తాజాగా స్పష్టం చేసింది. తుది విడత పోలింగ్ గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఎవరైనా ప్రకటించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 12 సాయంత్రం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడేవరకూ మీడియా, ప్రజలు, రాజకీయ నాయకులు అసలైన ఎన్నికల పండుగ చేసుకోబోతున్నారు.