వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు
posted on May 12, 2014 @ 4:01PM
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న వారణాశిలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ పోటీలో వుంటే, కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ అనే వ్యక్తి పోటీలో వున్నాడు. స్థానిక ఎమ్మెల్యే అయిన అజయ్ రాయ్‌ని కాంగ్రెస్ పార్టీ మోడీ మీద పోటీకి దించింది. ఇదిలా వుంటే గుజరాత్‌లోని వదోదరలో కూడా పోటీ చేసిన నరేంద్రమోడీ పోలింగ్ ముగిసిన తర్వాత కమలం గుర్తు చూపించారని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం, దాంతో ఎన్నికల సంఘం మోడీ మీద కేసు పెట్టడం తెలిసిందే. తాజాగా సోమవారం నాడు వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఇదే తరహా పని చేశాడు. వారణాశిలో ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకి వచ్చిన అజయ్ రాయ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘హస్తం’ ఓట్లు వేయడానికి క్యూలో వున్న అందరికీ చూపిస్తూ వెళ్ళడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అజయ్ రాయ్ మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టింది.