కాంగ్రెస్ ఓటమి స్వయంకృతాపరాధమే
సిపిఐ నేత కె.నారాయణ మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని" జోస్యం చెప్పారు. "తెలంగాణాలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవడం వారి స్వయంకృతాపరాధమేనని" ఆయన అన్నారు. కాంగ్రెస్ విషయంలో ఆయన మాటలు చాలా చేదుగా ఉన్నప్పటికీ అవి నూటికి నూరు పాళ్ళు నిజమని అంగీకరించక తప్పదు. ఎందుకంటే సోనియాగాంధీ ఎంతసేపు కూడా తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఏవిధమయిన ఎత్తులు వేయాలనే ఆలోచించారు తప్ప ఏనాడు తెలుగు ప్రజల భావోద్వేగాలను, వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఆ ప్రయత్నంలోనే వరుసపెట్టి అనేక తప్పులు చేసుకొంటూ వెళ్ళిపోయారు. స్వంత పార్టీ నేతలను కాదని, కాంగ్రెస్ పార్టీని సవాలు చేస్తున్న కేసీఆర్, జగన్ లను అక్కున చేర్చుకొన్నారు. నమ్మదగని వ్యక్తులను నమ్ముకొని చేయకూడని పనిని, సమయం కాని సమయంలో చేసి చేతులు కాల్చుకొంది హస్తం పార్టీ. సీమాంధ్రలో పార్టీని, నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి, ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, పార్లమెంటరీ వ్యవస్థకు మాయని మచ్చగా రాష్ట్ర విభజన చేసింది. యావత్ దేశమంతా ఆ ఘోరకలిని చూసి నివ్వెరపోయింది. అందువలన ఆ ప్రభావం కేవలం ఆంధ్ర, తెలంగాణాలకే పరిమితమయిపోక యావత్ దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ దోషిగా నిలబడింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఏనాడు బాధపడిందీ లేదు. పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. పైగా తెలంగాణాలో ఒకమాట, ఆంధ్రాలో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్, జగన్ లతో రహస్య ఒప్పందాలు చేసుకొని, పైకి మాత్రం వారు తమ శత్రువులన్నట్లు వారితో యుద్ధం చేస్తూ ప్రజలను వంచించింది. ఇప్పుడు ఆ తప్పులకు ఫలితం అనుభవించబోతోంది. అయితే ఇదంతా ఎవరి కోసం చేసిందో వారికి లబ్ది కలగలేదు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పుల వలన రాహుల్ గాంధీ రాజకీయ జీవితమే కాదు, అనేకమంది నిఖార్సయిన కాంగ్రెస్ నేతల జీవితాలు కూడా బలయిపోయాయి. ఇది స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు.