టీ ఉద్యోగులవి తప్పు లెక్కలు: అశోక్‌బాబు

  చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే రిటైర్మెంట్ వయసును రెండేళ్ళపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల నెత్తిన పాలు పోశారు. ఈ ఒక్క హామీ నెరవేరిస్తే చాలదని, చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నిటీని నెరవేర్చాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తారని అశోక్ బాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మిగులు ఉద్యోగులు ఉన్నారని తేటతెల్లమైందన్నారు. ఉద్యోగుల సంఖ్యపై తెలంగాణ నేతలు తప్పు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు.

తమిళ సాంబారులో జయ ఉప్పు

  ఇక తమిళనాడు సాంబారులో ‘అమ్మ’ జయలలిత బ్రాండ్ ఉప్పు జతచేరబోతోంది. తమిళనాడు ప్రజలు ‘అమ్మ’ ఉప్పు, పులుసు తిని బతకబోతున్నారు. ఆమె ఉప్పు పులుసు తిన్న విశ్వాసాన్ని వచ్చే ఎన్నికలలో కూడా చూపించబోతున్నారు. బుధవారం నుంచి తమిళనాడులో ‘అమ్మ’ బ్రాండ్ ఉప్పు మార్కెట్లో అభించబోతోంది. తమిళ నాడు సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో ఉప్పును తక్కువ ధరలో ప్రజలకు అందించబోతోంది. ఏ తరహా ఉప్పు అయినా కిలో ఐదు రూపాయలకే అందించనున్నారు. ఇప్పటికే జయలలిత తక్కువ ధరకే భోజనం పెట్టే ‘అమ్మ క్యాంటిన్’లను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువయ్యారు. అయిదు రూపాయలకే ఫుల్ మీల్ ను ప్రజలకు అందిస్తోంది. అమ్మ జలం బాటిల్డ్ వాటర్ రూపంలో పది రూపాయలకే దొరుకుతోంది.పేద ప్రజలకు అడపాడదపా కుట్టుమిషన్లు, ఇస్త్రీపెట్టెలు, ఫ్యాన్ల లాంటి గిఫ్టులను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఉప్పు కూడా తక్కువ ధరకి అందిస్తూ తమిళ ప్రజలు తనకు మరింత రుణపడేలా చేస్తున్నారు.

డిప్యూటీ సీటు వద్దు మొర్రో: పద్మా దేవేందర్

  పిలిచి పదవి ఇస్తానంటే వద్దనేవాళ్ళు వుంటారా? వుంటారు.. అలాంటి నాయకురాలే మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎంపిక చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడం తనకి ఎంతమాత్రం ఇష్టం లేదని పద్మా దేవేందర్‌రెడ్డి తెగేసి చెప్పడంతో టీఆర్ఎస్ నాయకత్వం తెల్లబోయింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవిలో వున్నవాళ్ళు ప్రజలకు దూరమైపోతారని, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు తగ్గిపోతాయని, వచ్చే ఎన్నికలలో ఓడిపోయే అవకాశం కూడా వుంటుందని అందువల్ల తనకు డిప్యూటీ స్పీకర్ పదవి వద్దంటే వద్దని పద్మా దేవేందర్‌రెడ్డి చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపడితే హోదా వస్తుందే తప్ప మరే ప్రయోజనమూ వుండదని ఆమె భావిస్తున్నారు. దాంతో టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు రంగంలోకి దిగారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పద్మను బుజ్జగించారు. ‘‘సిద్దిపేటను చూసుకున్నట్టుగానే మెదక్ నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటా. మీకు న్యాయశాస్త్రంలో పట్టా ఉన్నందున సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అవకాశం వస్తుంది’’ అని హరీష్‌రావు సర్దిచెప్పడంతో పద్మా దేవేందర్ రెడ్డి అయిష్టంగానే డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి అంగీకరించినట్టు తెలిసింది.

కరాచీ విమానాశ్రయంపై మరోసారి దాడి

  పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. ఆదివారం ఇదే విమానాశ్రయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో పదిమంది ఉగ్రవాదులతోపాటు మొత్తం 29 మంది మరణించారు. అప్పటి నుంచి ఈ విమానాశ్రయం వైమానిక రక్షణ దళం అధీనంలో వుంది. అయితే భారీ రక్షణ వుందని తెలిసినప్పటికీ ఉగ్రవాదులు మంగళవారం మధ్యాహ్నం మరోసారి కరాచీ ఎయిర్‌పోర్ట్ మీద దాడి చేశారు. ఈసారి వైమానిక రక్షణ దళ వసతి గృహం లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, రక్షణ సిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిషేధించారు. ఇప్పుడు తాజా కాల్పుల నేపథ్యంలో కరాచీ ఎయిర్‌పోర్టు ఒక యుద్ధ భూమిని తలపిస్తోందని తెలుస్తోంది. ఇదిలా వుంటే మంగళవారం పాకిస్థాన్‌లోని తీరాహ్ లోయ ప్రాంతంలో మిటలరీ అధికారులు ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు మరణించారని సమాచారం.

ఐసీయూలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు

  తీవ్ర అస్వస్థతకి గురైన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ విజయవాడలోని హార్ట్‌కేర్ సెంటర్‌లోని ఐసీయులో చికిత్స పొందుతున్నారు. బీపీ, సుగర్ వున్న వెంకట్రావుకు ఛాతీనొప్పి రావడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కృష్ణాజిల్లాకి చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి వెంకట్రావ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి వెంకట్రావుకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగిత వెంకట్రావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వున్నట్టు తెలుస్తోంది.

శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ లాండింగ్

  ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ విషయాన్ని ఆయన విమాన సిబ్బందికి తెలియజేశాడు. దాంతో వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఎమిరేట్స్ విమానానికి అనుమతి ఇచ్చారు. దాంతో విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లో అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్లో గుండె పోటు వచ్చిన ప్రయాణికుడ్ని నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

మంత్రిపదవిపై బాలకృష్ణ మనసులో మాట

  హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ మంత్రి అవ్వాలని ఆయన అభిమానులు ఆశించారు. బాలకృష్ణ కోరుకుంటే ఆ ముచ్చట తీరడం చాలా సులభం. అయితే ఆయన పేరు మంత్రివర్గంలో కనిపించలేదు. ఈ విషయం మీద బాలకృష్ణ స్పందించారు. తనకు మంత్రిపదవి కంటే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ‘‘సేవా మార్గంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నాను. అందుకే అందుకే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి ఆశించలేదు. నేను ఆంధ్రప్రదేశ్లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను’’ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు.

తెలంగాణ స్పీకర్‌గా మధుసూదనాచారి

  తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నాడు స్పీకర్ పదవికి మధుసూదనాచారి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి స్పీకర్ గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ కె. జానారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ సహా వివిధ పార్టీల ఫ్లోర్లీడర్లు మధుసూదనచారిని స్పీకర్ స్థానం వరకు గౌరవంగా తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో ఆయన ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణకు మధుసూదనాచారి చేసిన సేవలను కొనియాడారు. మధుసూదనాచారి వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణహత్య

  తమిళనాడులోని కంచి దగ్గర ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. కంచి సమీపంలోని పరుత్తికులం గ్రామంలో కాంచీపురం - చెంగల్పట్టు రైల్వే పట్టాల పక్కన కాలిపోయిన స్థితిలో 20 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహం షకీనా (23) అనే ఇంజనీరింగ్ విద్యార్థినిదిగా నిర్ధారించారు. షకీనా మృతదేహం దగ్గర్లో ఒక బ్యాంక్ పాస్ బుక్ చినిగిపోయిన స్థితిలో కనిపించింది. పక్కనే ఏటీఎం కార్డు లభించింది. షకీనా కంచి సమీపంలోని పొన్నేరికరై ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆమె సొంత ఊరు దిండుగల్ జిల్లా ఇలాపటి గ్రామం. షకీనా కాలిపోయిన స్థితిలో ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన ప్రాంతంలో ఒక లేఖ కూడా లభించినట్లు తెలుస్తోంది. అందులో కళాశాల ఫీజును చెల్లించలేక పోతున్నందున మనోవేదనతో ఉన్నట్లు విద్యార్థిని రాసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవాలను తారుమారుచేసేందుకు హంతుకుడు ఈ లేఖను రాసి ఉండవచ్చని భావిస్తున్నారు.

జగన్ నిర్ణయం కరక్టే

  నిన్నచంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాట్లాడిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అగ్ర నేత యల్.కె.అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తదితరులు చంద్రబాబును ప్రశంసించి, ఆయనతో తమకున్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని కోరుకొంటూ తమ ప్రసంగం ముగించారు. కానీ ఆ తరువాత మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇరువురూ కూడా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా గత వారం రోజులుగా తనను తీవ్రంగా విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో చురకలు వేసారు. ఒకవేళ ఆయన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్, వైకాపా నేతలు వచ్చి ఉంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో కానీ, వారు ఇటువంటి విమర్శలేవో వినవలసి వస్తుందనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒకవేళ హాజరయినా వారు కూడా తప్పనిసరిగా గవర్నర్ నరసింహన్ తో బాటే ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన వెంటనే వెళ్ళిపోవలసి వచ్చేది. ఈ కార్యక్రమానికి తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యేరు గనుక ఒకవేళ జగన్ హాజరయి ఉండి ఉంటే అవమానం ఎదుర్కోవలసి వచ్చేది. ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత తెదేపా రాజకీయ సభ నిర్వహించబోతోందనే సంగతి గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, రఘువీరారెడ్డి అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్నట్లు, ఈ కార్యక్రామానికి రామని ముందే ప్రకటించి, అవమానకర పరిస్థితులు ఎదుర్కోకుండా చాలా తెలివిగా తెప్పించుకొన్నారు. వారిరువురూ ఈ కార్యక్రమానికి హాజరు కాకూడాదని మంచి నిర్ణయమే తీసుకొన్నారని చెప్పవచ్చును.

ఎంసెట్ ఫలితాలు: టాపర్లు వీరే

      ఎంసెట్-2014 పరీక్షా ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఎంసెట్ పరీక్షల్లో 70.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 76.2 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 67.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ మెడికల్ పరీక్షల్లో మొత్తం 83.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 84.75 శాతం ఉత్తీర్ణత, బాలురు 80.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను విద్యార్థులు సంక్షిప్త సందేశాల ద్వారా పొందవచ్చని జగదీష్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ టాపర్స్ ... 1. పవన్‌కుమార్ 99.02 158 (హైదరాబాద్) 2. చాణిక్య వర్ధన్‌రెడ్డి 88.59, 157 (హైదరాబాద్) 3. నిఖిల్ కుమార్, 98.43, 157 (రంగారెడ్డి) 4. దివాకర్ రెడ్డి 98.30, 157(కృష్ణా) 5. ఆదిత్య వర్ధన్ 97.66, 155 (విజయనగరం) 6. ప్రేమ్ అదనవ్ 97.53,155 (హైదరాబాద్) 7. అక్షయ్‌కుమార్, 97.41, 155 (మహబూబ్‌నగర్) 8. సాయికశ్వప్, 97.24,155 (నల్గొండ) 9. ర్యాంక్ బాల సాయిసూర్యప్రహర్ష, 97.19, 154 (రాజమండ్రి, తూగో) 10. ర్యాంక్ చింతపూడి సాయిచేతన్, 97.15, 154 (హైదరాబాద్) మెడిసిన్ టాపర్స్ ... 1. గుర్రం సాయిశ్రీనివాస్, 99.45, 159 (ప్రకాశం) 2. బి.దివ్య, 99.45,159 (నెల్లూరు) 3. కందిగొండ పృద్వీరాజ్, 99.24, 159 (హైదరాబాద్) 4. హరిత, 99.02, 158 (గుంటూరు) 5. గీతారెడ్డి99.02, 158(విజయవాడ) 6. బి భరత్‌కుమార్, 99.02,158(ఖమ్మం) 7. శ్రీవిద్య, 98.98,158(విశాఖ) 8. సాత్విక్ గంగిరెడ్డి, 98.98,158(హైదరాబాద్) 9. సాయిహర్షతేజ, 98.90, 158(ఖమ్మం) 10. గంట సాయినిఖిల, 98.8, 158(గుంటూరు, తెనాలి)

ఓం.. హ్రీం.. క్లీం.. మళ్ళీ పూజలు మొదలెట్టిన కేసీఆర్!

      తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ రెండు పనుల్లో బిజీగా వుంటారు. ఒకటి సీమాంధ్రులను తిట్టేపని, రెండు పూజలు పునస్కారాలు చేసేపని. ఇప్పటి వరకూ కేసీఆర్ చేసిన భారీ పూజలకి లెక్కలేదు. ఈపూజ అని, ఆ పూజ అని, ఈ హోమం అని, ఆ హోమం అని ఏదో ఒక పూజ చేసేస్తూ వుంటారు. కొంతమంది అయితే కేసీఆర్‌ ఎలాంటి రాజకీయ నాయకుడైనప్పటికీ, ఆయన్ని కాపాడుతున్నది ఆయన చేసే పూజలు, హోమాల బలమేనని అంటూ వుంటారు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం.. కేసీఆర్ ఎప్పుడైనా ఏదైనా పూజో, హోమమో మొదలుపెట్టారంటే అప్పుడు తాను ఏదో ప్రాబ్లంలో వున్నట్టు ఫీలవుతున్నారని అర్థం. పూజల తర్వాత మళ్ళీ కేసీఆర్ పుంజుకుని తిడుతూ వుంటారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పది రోజులు కూడా కాకుండానే తెలంగాణలో ఆయన పరువు అడ్డంగా పోయింది. కేసీఆర్నీ గెలిపించిన రైతులే ఇప్పుడు కేసీఆర్ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మళ్ళీ పూజలు మొదలుపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కోసం బేగంపేటలోని కుందన్ బాగ్ ప్రాంతంలో కొత్త క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ప్రస్తుతం ముమ్మరంగా పూజల మీద పూజలు చేసేస్తున్నారు. ఈ పూజల వెనుక అసలు అంతరార్థం ప్రస్తుతం తాను రైతుల రుణ మాఫీ ఇష్యూలో ఇరుక్కుపోయి వున్నారు కాబట్టి, దాంట్లోంచి బయటపడటమేనని పరిశీలకులు అంటున్నారు.

అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న బాలికలు!

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాలకు నిలయంగా మారిపోయింది. రోజు మార్చి రోజు అత్యాచార వార్తలను వినాల్సిన దుస్థితి అక్కడ ఏర్పడింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా సోమవారం నాడు యుపిలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు దళిత బాలికలు తమమీద జరిగిన అత్యాచార యత్నం నుంచి తప్పించుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మైన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా దాబ్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఈ ఇద్దరు బాలికలు బయటకి వెళ్ళినప్పుడు ఇద్దరు యువకులు వీళ్ళని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే వారిని తీవ్రంగా ఎదుర్కొన్న బాలికలిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆ బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, అత్యాచారాల రాజ్యంగా మారిపోయిన ఉత్తర ప్రదేశ్‌లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఇద్దరు బాలికలు అదృష్టవంతులే.

బ్రాహ్మణులను తిట్టినందుకు కేసీఆర్‌కి సమన్లు

      సీమాంధ్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ ఎన్నోసార్లు ఎంతోమందిని తిట్టారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బ్రాహ్మణులను కూడా వదిలిపెట్టకుండా కేసీఆర్ తిట్టారు. ఇప్పుడు ఆ ఫలితం తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనిపిస్తోంది. ఆంధ్రా బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా వ్యాఖ్యానించినందుకు సీమాంధ్రలోని బ్రాహ్మణుల సంఘం కేసీఆర్ మీద కేసు వేసింది. ఈ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 21న తమ ఎదుట హాజరుకావాలని జిల్లా రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింది.