మంత్రిపదవిపై బాలకృష్ణ మనసులో మాట
posted on Jun 10, 2014 @ 12:12PM
హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ మంత్రి అవ్వాలని ఆయన అభిమానులు ఆశించారు. బాలకృష్ణ కోరుకుంటే ఆ ముచ్చట తీరడం చాలా సులభం. అయితే ఆయన పేరు మంత్రివర్గంలో కనిపించలేదు. ఈ విషయం మీద బాలకృష్ణ స్పందించారు. తనకు మంత్రిపదవి కంటే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ‘‘సేవా మార్గంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నాను. అందుకే అందుకే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి ఆశించలేదు. నేను ఆంధ్రప్రదేశ్లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను’’ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు.