హిమాచల్‌ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు గల్లంతు?

      హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన కొంతమంది విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. ఎంతమంది కొట్టుకుపోయారన్నది సమాచారం అందాల్సి వుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో వున్న వ్యాస్‌ నది వద్ద 20 మంది విద్యార్థులతో వున్న వ్యాన్ నీళ్ళు లేని నది మధ్యలో వుండగా, డ్యామ్ నుంచి నీరు వదలడంతో ఆ నీటి ప్రవాహంలో వ్యాను కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతోంది. 20 మంది విద్యార్థులూ నీటిలో కొట్టుకుపోయారని తెలుస్తోంది. నీళ్ళు లేని నది మధ్యలో వ్యాన్ ఆపుకుని ఫొటోలు దిగుతూ వుండగా అకస్మాత్తుగా నీటి ప్రవాహం వచ్చినట్టు సమారం. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బాచుపల్లికి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా భావిస్తున్నారు. బాచుపల్లికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులు విహార యాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్ళారు. అనుకోకుండా ఈ సంఘటన సంభవించింది.

జై ఆంధ్రప్రదేశ్: వెంకయ్య నాయుడు

      చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందుకు నాకు ఒకవైపు బాధగా, మరోవైపు సంతోషంగా వుంది. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం బాధని కలిగించే అంశం. కొత్త ఆంధ్రప్రదేశ్‌కి గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. ఆ విషయం గుర్తుకు వస్తేనే ఎంతో బాధ కలుగుతూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు. బడ్జెట్ లోటుగా వుంది, విద్యాలయాలు లేవు, ప్రభుత్వ సంస్థలు లేవు. ఎన్నో ఇబ్బందులున్నాయి. అయినా అధైర్యపడాల్సిన అవసరం లేదని నా మనసు చెబుతోంది. ఎందుకంటే తెలుగువారికి వున్న తెలివి మరెవరికీ లేదు. ఏ రంగంలో అయినా తెలుగువారు పోటీ పడతారు. ముందడుగు వేస్తారు. మనకి పెద్ద సముద్ర తీరం వుంది. తడ నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి వుంది. పొడవైన రైలుమార్గం వుంది. ఇంటర్ లింక్ రైలు మార్గాలు వున్నాయి. రైలు వ్యవస్థ చాలా బాగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియాలోనే నంబర్ వన్ కాంట్రాక్టర్స్ వున్నారు. హోటల్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశే నంబర్ వన్. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తెలుగువారే నంబర్ వన్. అందుకే మనం ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కి అనుభవజ్ఞుడు, సమర్థుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ని అగ్రస్థానంలో నిలుపుతారన్న నమ్మకం వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ పొందిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు చేస్తుంది. దానికి ఉదాహరణ కేంద్ర కేబినెట్ మొదటి సమావేశంలోనే పోలవరం ఆర్డినెన్స్ తేవడం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడం బాధకరమే అయినప్పటికీ, కలసి వుండి కలహించుకోవడం కంటే, విడిపోయి సహకరించుకోవడం మేలు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ శ్రమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తు్న్నాను. జై ఆంధ్రప్రదేశ్’’ అన్నారు.

చంద్రబాబుతో ఎంతో అనుబంధం: పంజాబ్ సీఎం బాదల్

      చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మాట్లాడారు. ‘‘ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎంతో మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు. చంద్రబాబు నాయుడు సమర్థుడైన నాయకుడు. అడ్మినిస్ట్రేటర్. మీకు గొప్ప నాయకుడు దొరికాడు. తెలుగుదేశం పార్టీలో నాకు ఎన్టీఆర్ హయాం నుంచి అనుబంధం వుంది. పంజాబ్‌లో ఏ కార్యక్రమం జరిగినా నేను చంద్రబాబు నాయుడిని పిలుస్తూ వుంటాను. ఆయన ఎంత బిజీగా వున్నా వస్తూ వుంటారు. ఆ అనుబంధంతోనే నేను వచ్చాను. నా తరఫున, పంజాబ్ ప్రజల తరఫున మీకు, చంద్రబాబుకు నా అభినందనలు’’ అన్నారు.

చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం

      ప్రమాణ స్వీకారోత్సవ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘‘నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దకొడుకుగా వుంటాను. కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టాన్ని పూడ్చుకోవలసిన అవసరం వుంది. కాంగ్రెస్ పార్టీ మనకి నష్టం చేసి అది కూడా నాశనమైపోయింది. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. తెలుగువారు రాజధాని కోసం ఒక్క ఇటుక అయినా పంపించాల్సిన అవసరం వుంది. చందాలు ఇవ్వాల్సిన అవసరం వుంది. ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు ఎంతో సహకరించారు. సమైక్య పోరాటం సందర్భంగా పెట్టిన కేసులు మొత్తం రద్దు చేస్తానని హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పాలన సందర్భంగా దేశం ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. ఇచ్చిన హామీలను నెరవేర్చానికి కృషి చేస్తాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. ఆంధ్రప్రదేశ్‌ని పునాదుల నుంచి అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం తప్పకుండా సమహరిస్తుంది. ఆ సహకారంతో మన కాళ్ళమీద మనం నిలబడి ఆంధ్రప్రదేశ్‌ని నంబర్‌వన్ చేస్తామని నమ్మకం వుంది. మనకు తీరప్రాంతం వుంది, పోర్టులు వున్నాయి. తెలివైన వారున్నారు. అన్నదాతలున్నారు. విద్యావంతులున్నారు. మనకి చాలా వసతులు కూడా వున్నాయి. రాబోయే రోజుల్లో మనం మరింత ముందుకు వెళ్తామన్న నమ్మకం వుంది. రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్ర చేయడానికి నిద్రపోకుండా కృషి చేస్తాను’’ అని చంద్రబాబు అన్నారు.

ప్రజలకు, కార్యకర్తలకు ఈ విజయం అంకితం: చంద్రబాబు

      తన ప్రమాణ స్వీకారోత్సవ సభకు వచ్చిన ప్రముఖులు ప్రతి ఒక్కరికీ చంద్రబాబు నాయుడు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారితో తనకున్న అనుబంధాన్ని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వారు అందించిన సహకారాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కి సొంత పార్టీ వున్నప్పటికీ, తనవల్ల ఓట్లు చీలకూడదని, రాష్ట్రంలో తాను, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని ఏమీ ఆశించకుండా సహకరించారని చెప్పారు. బాలకృష్ణకూ చంద్రబాబు థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘వీరందరినీ చూస్తుంటే కొండంత ధైర్యం, ఎక్కడా లేని శక్తి నాకు వచ్చింది. ఈ ప్రమాణ స్వీకారం మీద కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ ప్రమాణ స్వీకారం ఈరకంగా చేసింది ఆంధ్రప్రదేశ్‌కి ధైర్యం ఇవ్వడానికి, భరోసా ఇవ్వడానికి! నాకు అండగా నిలిచిన ఈ పెద్దలందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అగమ్యగోచరమైన స్థితిలో వుంది. ఎన్నో సమస్యలు వున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలుగువారికి ఈ పరిస్థితి తెచ్చింది. మనం కసిగా పనిచేద్దాం. ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఆ శక్తి తెలుగుజాతికి వుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, కేంద్రంలో మోడీ అధికారంలోకి రావాలని అందరూ కోరుకున్నారు. ఈ విజయం తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తల మేలు మరచిపోలేను. ఈ విజయం కార్యకర్తలకూ అంకితం చేస్తున్నాను. హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేయనని నేను ముందే చెప్పాను. అలాగే చేశాను. మొదటి కేబినెట్ విశాఖలో పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్నీ అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నాను. మళ్ళీ రాజధాని కట్టే వరకూ నంబర్‌వన్ కూలీగా పనిచేస్తాను. నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నారు. మనకు ఇప్పుడు ఎన్నో ఇబ్బందుల్లో వున్నాం. ఎంత అప్పుంది. ఆదాయం వుంది.. జీతాలు ఎంత ఇస్తామనేది కూడా నాకు తెలియదు. వెంకయ్య నాయుడి వల్లే పోలవరం వచ్చింది. మనం కష్టపడదాం. శ్రమిద్దాం. మనకి కేంద్రం అండగా వుంటుంది. మోడీ మనతోనే వుంటారు. మనకి సహకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం మనకి న్యాయం చేస్తుందన్న నమ్మకం వుంది. ఈ సందర్భంగా యుగపురుషుడు, తెలుగు జాతి వున్నంతవరకు మరచిపోలేని మహానాయకుడు ఎన్టీఆర్ని ఈ సందర్భంగా తలచుకుంటున్నాను. దేశాభివృద్ధికి తెలుగువారు ఎంతో కృషి చేశారు. 

ఐదు ఫైళ్ళ మీద చంద్రబాబు సంతకాలు

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మాట ఇచ్చినట్టుగా మూడే ఫైళ్ళ మీద కాకుండా మొత్తం ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ఫైళ్ళ మీద సంతకాల విషయంలో ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చారు. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల రుణాల రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించే ఫైలు మీద మొదటి సంతకం పెట్టారు. అలాగే వికలాంగులకు, వృద్ధులకు గాంధీ జయంతి నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా ఆదేశిస్తూ రెండో సంతకం పెట్టారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద అన్ని గ్రామాలకూ తాగునీరు ఇచ్చే ఆదేశాల మీద మూడో సంతకం పెట్టారు. బెల్టు షాపులను రద్దు చేసే ఆదేశాల మీద నాలుగో సంతకం చేశారు. ఉద్యోగుల వయో పరిమితి పెంచే ఆదేశాల మీద ఐదో సంతకం చేశారు. నిరుద్యోగులకు తాము అండగా నిలుస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

ప్రముఖులను పరిచయం చేసిన వెంకయ్యనాయుడు

      చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభలో వేదిక మీద దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రజలకు పరిచయం చేశారు. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధియా, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణసింగ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్, నాగాలాండ్ ముఖ్యమంత్రి జలన్, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖదేవ్ సింగ్ బాదల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, కేంద్రమంత్రి అనంతకుమార్, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా, కేంద్రమంత్రి హర్షవర్ధన్, కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, సోనావాలా తదితరులను వెంకయ్య నాయుడు పరిచయం చేశారు.

మూడు ఫైళ్ళ మీద సంతకాలు చేయనున్న చంద్రబాబు

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు త్వరలో మూడు ఫైళ్ళ మీద సంతకాలు చేయనున్నారు. 8.35 నిమిషాలకు తన మొదటి సంతకాన్ని చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మొదటి సంతకాన్ని రైతు, డ్వాక్రా రుణమాఫీ ఆదేశాల పైల్ మీద చేయనున్నారు. రెండో సంతకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో బెల్టు షాపులను రద్దుచేసే ఆదేశాల మీద చేయనున్నారు. ముచ్చటగా మూడో సంతకాన్ని ఎన్టీఆర్ సుజల పథకం కింద అన్ని గ్రామాలకూ తాగునీరు ఇచ్చే ఆదేశాల మీద సంతకం చేయనున్నారు. ఇలా మూడు ముఖ్యమైన సంతకాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక సాక్షిగా నిలవనుంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులు ప్రమాణస్వీకారం

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు చంద్రబాబు నాయుడి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా గవర్నర్‌ని కోరారు. అప్పుడు నరసింహన్ చంద్రబాబు నాయుడి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం కచ్చితంగా 7 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. పదవీ ప్రమాణ స్వీకారంతోపాటు, ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల పరిరక్షణ ప్రమాణం కూడా చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానంతరం గవర్నర్ చంద్రబాబుకు కరచాలనం చేసి చంద్రబాబుకు పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆ తరువాత గవర్నర్ చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. కె.ఇ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, డాక్టర్ పి.నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, కింజరాపు అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘవరావు, కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, పైడికొండల మాణిక్యాలరావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత జాతీయ గీతాన్ని ఆలాపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు చంద్రబాబు నాయుడి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా గవర్నర్‌ని కోరారు. అప్పుడు నరసింహన్ చంద్రబాబు నాయుడి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం కచ్చితంగా 7 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. పదవీ ప్రమాణ స్వీకారంతోపాటు, ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల పరిరక్షణ ప్రమాణం కూడా చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానంతరం గవర్నర్ చంద్రబాబుకు కరచాలనం చేసి చంద్రబాబుకు పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆ తరువాత గవర్నర్ చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.

పవన్ కళ్యాణ్‌కి సూపర్ రెస్పాన్స్

      ఏ నిమిషంలో అయితే పవన్ కళ్యాన్ తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుని ప్రచారం చేశారో ఆ నిమిషం నుంచి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌కి వున్న గౌరవం బాగా పెరిగిపోయింది. తెలుగుదేశం, బీజేపీ కూటమి ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఆ గౌరవం మరింత పెరిగింది. ఎన్నికలలో గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ కూడా పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసుకున్నారంటే ఆ గౌరవం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా వుంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అలాగే పవన్ కళ్యాణ్ సభాస్థలి దగ్గరకి వచ్చినప్పుడు తెలుగుదేశ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో హర్షధ్వానాలు చేశారు. పవన్ కళ్యాణ్‌కి సూపర్‌గా తమ రెస్పాన్స్ తెలిపారు.

గవర్నర్ గారు వచ్చేశారు..

      తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదిక దగ్గరకి రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర రాజ్యాంగ బాధ్యుడు నరసింహన్ వచ్చేశారు. ఆయన కాసేపట్లో చంద్రబాబు చేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న గవర్నర్ వెంటనే బెజవాడ కనకదుర్గమ్మను సందర్శించుకున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో వుండే ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునే సంప్రదాయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా కూడా కొనసాగించారు. గవర్నర్‌కి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు.

కాసేపట్లో బాబు ప్రమాణం.. క్రిక్కిరిసిన సభ

      నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులతో క్రిక్కిరిసిపోయింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, సినీ నటులకు సభా స్థలి దగ్గర ఘన స్వాగతం లభిస్తోంది. వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తల జయధ్వానాలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది. కాగా ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌‌లో ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి ఎన్టీఆర్‌‌కి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో షంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయన బాగా బిజీగా వున్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న మహామహులందరినీ కలిసి వారికి బాబు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు మరికొన్ని నిమిషాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మధుర క్షణాల కోసం సభలోని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

      ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున ఉబ్బసం నివారణ కోసం బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అస్త్మా రోగులకు ఎన్నో ఏళ్లుగా బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్నాన్నారు. చేప ప్రసాదం స్వీకరించడానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వేలాదిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.కి తరలి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు రోగులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మందు పంపిణీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదానికి శాస్త్రీయత లేదని జనవిజ్ఞాన వేదిక ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రతి ఏటా మందు స్వీకరించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు తండోపతండాలుగా వస్తూనే వున్నారు.

థాంక్యూ పవన్ కళ్యాణ్: ప్రకాష్ జవదేకర్

  బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి థ్యాంక్స్ చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన జవదేకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జవదేకర్ పవన్ కళ్యాణ్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేలు మరువలేనిదని ప్రకాష్ జవదేకర్ అన్నారు. అలాగే ఎన్డీయే కూటమితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాచంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు.

మెదక్ మెరవాలి: స్మితా సబర్వాల్

  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాని దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని స్మితా సభర్వాల్ అన్నారు. మొన్నటి వరకు మెదక్ కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ తెలంగాణ సీఎం అదనపు కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో స్మితా సబర్వాల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో కేవలం 8 నెలలే కలెక్టర్‌గా పనిచేసినా, ఈ ప్రాంత ప్రజలిచ్చిన సహకారం తనకు ఎల్లప్పుడు గుర్తుంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎంతో పుణ్యం చేస్తేకాని కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం రాదని, అంతటి భాగ్యం తనకు లభించినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్నారు. కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సేవలందినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందన్నారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణలో, ప్రజాభివృద్ధి కార్యక్రమాల అమలులోనూ జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు కేబినెట్.. కులాల కూర్పు!

  సమాజంలో కుల వ్యవస్థ వుండకూడదని అందరూ అంటారు. కానీ కులం అనేది లేకుండా సమాజంలో ఏపనీ జరగదు. అది సామాన్యుల నుంచి మంత్రుల వరకూ వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గంలో కులాల కూర్పు ఎలా వుందో చూద్దాం. చంద్రబాబు ప్రకటించిన తొలివిడతల మంత్రివర్గం ప్రకారం చంద్రబాబుతో సహా ఐదుగురు కమ్మ, ఇద్దరు రెడ్డి, ఆరుగురు బిసి, నలుగురు కాపు, ఇద్దరు ఎస్.సి, ఒక వైశ్య వున్నారు. వీరిలో కమ్మ కులానికి చెందిన పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ వున్నారు. రెడ్డి వర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డి, కాపు నుంచి నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, నారాయణ వున్నారు. బిసి వర్గం నుంచి అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు (కొప్పుల వెలమ), మృణాళిని (తూర్పుకాపు), యనమల రామకృష్ణుడు (యాదవ), కె.ఇ.కృష్ణమూర్తి (గౌడ), కొల్లు రవీంద్ర (మత్సకార) ఉన్నారు. వైశ్య సమాజికవర్గం నుంచి సిద్ధా రాఘవరావు ఉండగా, ఎస్.సి. వర్గం నుంచి పీతల సుజాత, రావెళ్ల కిషోర్‌ వున్నారు. ముస్లిం ల నుంచి టిడిపి కి ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల ఆ వర్గానికి అవకాశం దక్కలేదు. అయితే గిరిజనులు ఉన్నా, ఇవ్వలేదు. ఆసక్తికరంగా తెలంగాణ మంత్రివర్గంలో కూడా గిరిజనుడికి అవకాశం రాలేదు. గిరిజనవర్గానికి కూడా అవకాశం దక్కలేదు. అయితే చంద్రబాబు కేబినెట్ కులాల విషయంలో సమతుల్యంగానే వుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.