తెలంగాణ అసెంబ్లీ 11 తీర్మానాలు ఇవే!

  శనివారం నాడు ముగిసిన తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో 11 తీర్మానాలను ఆమోదించారు. ఈ పదకొండు తీర్మానాలను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవి ఇలా వున్నాయి... 1. తెలంగాణ అమరులకు సంతాపం. 2. హిమాచల్ మతులకు సంతాపం. 3. ఎవరెస్ట్ విజేతలకు అభినందన. 4. టీవీ-9పై చర్య అధికారం స్పీకర్‌కు. 5. పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ. 6. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా. 7. సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయింపు. 8. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు. 9. బీసీలకూ 33 శాతం రిజర్వేషన్. 10. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. 11. రాష్ట్ర హైకోర్టు విభజన.

టీడీపీ ఎంపీకి బెదిరింపు ఫోన్లు

  తాజా ఎన్నికలలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన విద్యావేత్త, మల్లారెడ్డి గ్రూపు విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసిన ఆ వ్యక్తి 30 కోట్లు విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలా ఇవ్వకపోతే మీ విద్యాసంస్థలని బాంబులతో పేల్చివేస్తామని హెచ్చరించాడు. దాంతో మల్లారెడ్డి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు నమోదు చేశారు. ఎంపీ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాయిన్ బాక్స్ ఫోన్ నంబర్‌పై నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మల్లారెడ్డి ఎంపీగా గెలుపొందిన రోజు నుంచి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తాను నక్సలైట్‌నని, తమ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇవ్వాలని, లేని పక్షంలో నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

హాలోగ్రామ్ చూశాక మందు కొట్టవలెను!

  ఇక నుంచి తెలంగాణలో మందుబాబులు మందు బాటిల్ ఓపెన్ చేసేముందు సదరు బాటిల్ మీద హాలోగ్రామ్ వుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే, మీరు తాగే బాటిల్లో కల్తీ మద్యం వుందేమో ఎవరికి ఎరుక? కల్తీమద్యాన్ని నిరోధించే చర్యల్లో భాగంగా మందు బాటిళ్ళ మీద హాలోగ్రామ్ అతికించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావు తెలిపారు. ఆయన సెక్రటేరియట్‌లో మద్యం విక్రయాలకు సంబంధించిన విధివిధానాలతోపాటు తమ ప్రభుత్వ మద్యం పాలసీని ప్రకటించారు. జూలై 1 నుంచి అన్నిరకాల మద్యం సీసాలపై ప్రభుత్వం నిర్దేశించిన 2డీ బార్‌కోడ్‌తో కూడిన హోలోగ్రాంలను అతికించబోతున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తే మొదటి తప్పునకు రూ.లక్ష, అదే తప్పు రెండోసారి చేస్తే రూ.2 రెండు లక్షలు జరిమానా విధిస్తామన్నారు. అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

షర్మిలపై దుష్ప్రచారం దారుణం: మహిళా ఎంపీలు

  వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి అయిన షర్మిల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించడం దారుణమని వైసీపీ మహిళా ఎంపీలు సంబంధీకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు కొత్తపల్లి గీత (అరకు), బుట్టా రేణుక (కర్నూలు) మీడియాతో తమ ఆవేదనని, ఆగ్రహాన్ని వ్వక్తం చేశారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక మహిళా నాయకురాలిపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. షర్మిలను సోషల్ మీడియాలో అవమానించడం వెనుక రాజకీయ హస్తం వుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం షర్మిలపై అభూత కల్పనలు సృష్టించి ప్రచారం చేయడమనేది దిగజారుడు చర్య అని వారు విమర్శించారు. కొందరు వ్యక్తులు, వెబ్‌సైట్లు షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని సమాజంలో మనసున్న ప్రతి మహిళా ప్రతిఘటించాలని, తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై ఆమె చేస్తున్న పోరాటంలో తాము వెంట నిలుస్తామని వైకాపా మహిళా ఎంపీలు చెప్పారు.

బియాస్ నదిలో ‘సోనార్’ గాలింపు

  హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో బియాస్ నదిలో గల్లంతైన వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం ఆదివారం నుంచి అత్యాధునిక సోనార్ (సైట్ స్కాన్ రాడార్) పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 16 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ కోసం ఏడోరోజైన శనివారం నావికాదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక ఈత నిపుణులు, మరో 450 మంది పనివారు రోజంతా గాలించినా లాభం లేకపోయింది. ప్రమాద స్థలి నుంచి మూడు కిలోమీటర్ల మేరకు నదిలో నీటిమట్టాన్ని గంట పాటు కనీస స్థాయికి తగ్గించి వెదికినా ఒక్క మృతదేహం కూడా లభించలేదు. గురువారం వరకు 8 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం మానవరహిత విమానాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయింది. ఇప్పుడు జరుపుతున్న సోనార్ గాలింపులో కూడా మృత దేహాలు కనిపించకపోతే ఏం చేయాలో అధికారులకు కూడా పాలుపోవడం లేదు. తమ బిడ్డల ఆచూకీ కోసం డ్యామ్ వద్దే పడిగాపులు కాస్తూ, తమ పిల్లల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మనోవేదనకు అంతులేకుండా పోయింది. ప్రమాదం జరిగిన మండి జిల్లాలోనే వున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం స్థానిక ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ప్రత్యేక హోదాపై డౌట్లు వద్దు: వెంకయ్య

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని కేంద్ర పట్టణాభివద్ధి శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం నాడు విశాఖలో వెంకయ్య నాయుడిని ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పై విధంగా భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ప్రణాళికా సంఘం అనేదే లేదని, ఏర్పాటు కావలసి వుందని, అలాంటప్పుడు ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదని చెప్పిందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. ఏ విషయంలో అయినా తెలంగాణకు నష్టం కలిగించే ఏ పనిని బీజేపీ చేయదని, అలాగని ఆంధ్రకు అన్యాయం జరగనీయమన్నారు. కొత్త రాష్ట్రమైన ఏపీకి అభివద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విశాఖను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వేజోన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ట్యూషన్ చెప్పినందుకు ఇండియన్ల అరెస్ట్

  సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులను పోలీసులు అరెస్టు చేసి లోపలేశారు. వారు చేసిన తప్పు ఏంటంటే, తమ ఇళ్ళలో స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పారు. రియాద్‌లోని ఇంటర్నేషన్‌ ఇండియన్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్న కర్నాటకకు చెందిన మహబూబ్ పాషా, తమిళనాడుకు చెందిన మహ్మద్ రిఫాయ్, ఉత్తర ప్రదేశ్‌కి చెందిన అహ్మద్ సిద్ధికి అనే ముగ్గురు వ్యక్తులు తమ ఇళ్ళలో స్కూలు పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పోలీసులకు దొరికిపోయారు. సౌదీ అరేబియా చట్టాల ప్రకారం స్కూళ్ళలో పనిచేసే టీచర్లు ట్యూషన్లు చెప్పకూడదు. ఇది చట్ట విరుద్ధం. అలా ట్యూషన్లు చెప్పిన వారికి సౌదీ చట్టాల ప్రకారం భారీ శిక్షలు పడతాయి. తమ స్కూలుకు చెందిన టీచర్లు అరెస్టు కావడంతో ఉలిక్కిపడిన స్కూలు యాజమాన్యం వారికి బెయిల్ తెప్పించుకునేందుకు తంటాలు పడుతోంది.

కేసీఆర్ మీద భట్టి విక్రమార్కుడికి డౌటొచ్చింది!

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కి చిత్తశుద్ధి లేదన్న సందేహం కలుగుతోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణలోనే కొనసాగించేలా చూడటంలో కేసీఆర్ చిత్తశుద్ధిని కనబరచడం లేదన్న అభిప్రాయాన్ని భట్టి వ్యక్తం చేశారు. కేసీఆర్ మొదటి నుంచి 1956 నాటి తెలంగాణ కావాలని పదేపదే డిమాండ్ చేసేవారని, అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని ఆయన అన్నారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రికి 14 పాయింట్లతో ఇచ్చిన వినతిపత్రంలోనూ, అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంలోనూ పోలవరం ప్రస్తావన లేకపోవడం తన అనుమానాలకు బలం చేకూర్చుతోందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

సీఎం ఇల్లు ఖాళీ చేస్తున్న కేజ్రీవాల్

  ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అయితే వదిలిపెట్టాడుగానీ, ముఖ్యమంత్రి హోదాలో తనకు కేటాయించిన ఇంటిని మాత్రం ఖాళీ చేయకుండా ఇంతకాలం దర్జాగా అందులోనే వుంటున్నాడు. ఈ నివాసాన్ని ఖాళీ చేయాలని గతంలోనే ఢిల్లీ ప్రభుత్వ అధికారులు కేజ్రీవాట్‌ని కోరారు. ఒకవేళ ఖాళీ చేయడం కుదరని పక్షంలో నెలకు 85 వేల రూపాయల అద్దె చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అయితే కేజ్రీవాల్ తన కూతురు ప్లస్ టూ పరీక్షలు ఉన్నందున ఇప్పుడు తాను ఇల్లు ఖాళీ చేయలేనని ప్రభుత్వ అధికారులకు తెలిపాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూతురు ప్లస్ టూ పరీక్షలతోపాటు ఐఐటీ ఎంట్రన్స్ కూడా రాసేసింది. దీంతో కేజ్రీవాల్‌కి ఇల్లు ఖాళీ చేయక తప్పలేదు. త్వరలో తూర్పు ఢిల్లీలోని నివాసానికి మారడానికి కేజ్రీవాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ కొత్త ఇంటిని వెతుక్కుంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీచేస్తారు అని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్పాయి.

చంద్రబాబు-శివరామకృష్ణన్ కమిటీ భేటీ

  ఇప్పుడు అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఎక్కడ ఏర్పడబోతోందనే దానిమీదే. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదిక ఎలా ఇస్తుందో అనేదానిమీద కూడా ఎదురుచూపులు వున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో శనివారం శివరామకృష్ణన్ కమిటీ జరిపిన సమావేశమైంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో ఉన్న పట్టణాల్లో ఒక దాన్ని అభివృద్ధి చేయడం, లేదా కొత్తగా స్థల సేకరణ చేయడం అనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అయితే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిమీద శివరామక‌ృష్ణన్ కమిటీ ఇంతవరకు చంద్రబాబుకు ఎలాంటి సూచన చేయనట్టు తెలుస్తోంది. ఈ కమిటీతో చంద్రబాబు మరోసారి సమావేశమవుతారు.

మాజీ లవరు మైండు తింటున్నాడు: ప్రీతీజింతా ఫిర్యాదు

  ప్రీతీజింతా తన మాజీ లవర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్ నటిగా మాత్రమే కాకుండా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఓనర్ కూడా అయిన ప్రీతీజింతా బిజినెస్‌మేన్ అయిన నెస్‌వాడియాతో గతంలో ప్రేమాయణం నడిపింది. ఇద్దరి మధ్య ఏమైందోగానీ కొంతకాలంగా వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా వున్నారు. లేటెస్ట్.గా నెస్‌వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని, తనమీద చెయ్యి చేసుకున్నాడని, ఈ విషయాన్ని బయటపెడితే తనను చంపేస్తానని కూడా బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు.

షర్మిలమ్మని అవమానిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు

  వైసీపీ నాయకురాలు షర్మిలను కొంతమంది ఇంటర్నెట్‌లో కించపరుస్తున్నారని వైసీపీ నేతలుహైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు శనివారం ఉదయం పోలీసు కమిషనర్‌ని కలసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘షర్మిలమ్మపై కొన్ని రోజులుగా పథకం ప్రకారం సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతోంది. దానిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరాం. చెప్పుకోలేని రీతిలో ఈ ప్రచారం చేస్తున్నారు. అది చాలా బాధాకరం’’ అని ఆయన అన్నారు. షర్మిలపై దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ని కోరామని చెప్పారు. ఈ సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి హామీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదిలా వుంటే, షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

యుద్ధనౌకలో ప్రధాని మోడీ ప్రయాణం

  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో ప్రయాణించారు. ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా గోవాకి వెళ్ళిన మోడీ, మొదట ఆ నౌకలో ప్రయాణించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. అంతకుముందు మోడీ భారత నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించి యుద్ధ నౌక మొత్తాన్ని పరిశీలించారు. యుద్ధనౌకలో ఉన్న మిగ్-29కె యుద్ధవిమానంలో కూడా మోడీ కాసేపు కూర్చుని దాని మీద నుంచి అభివాదం చేశారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. ఇది భారత నౌకాదళంలోనే అత్యంత భారీ నౌక. దీని పొడవు 283.5 మీటర్లు, వెడల్పు 59.8 మీటర్లు. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామర్థ్యం విక్రమాదిత్యకు ఉంది. 44,500 టన్నుల బరువున్న విక్రమాదిత్యను రష్యా నుంచి కొనుగోలు చేశారు. యుద్ధనౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో మోడీతో పాటు నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్కే ధవన్ కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కి ఆ అర్హత వుంది: మంత్రి

  ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అర్హత లేదని మొదట బాంబు పేల్చిన కేంద్ర ప్రణాళికా సంఘం ఆ తర్వాత ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉపశమనం మాటలు చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా పొందడానికి అన్ని అర్హతలూ వున్నాయని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ళ కిషోర్ అన్నారు. రాజధాని లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం, రాష్ట్ర విభజన కారణంగా పరిస్థితులు గందరగోళంగా , ఉండడం, ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం ఈ అర్హతలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని ఇస్తూ త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించి తీరుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

పనికిమాలిన అమెరికా: ఒబామా నిస్పృహ

  భద్రత విషయంలో అమెరికా అంత పనికిమాలిన, దరిద్రపు దేశం మరొకటి లేదని సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అమెరికాలో ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకోవడం మామూలైపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ తమ దగ్గర వున్న తుపాకీని ఎప్పుడు ఉపయోగించాలా అని తహతహలాడిపోతూ వుంటారు. వీలు దొరికితే ఏ కారణం లేకుండానే కనిపించినవారిని కనిపించినట్టు పిట్టల్లా కాల్చేస్తూ వుంటారు. ఈ దారుణాలు ఎక్కువగా అమెరికా స్కూళ్ళలో జరుగుతూ వుంటాయి. ఇలాంటి సంఘటనల మీద అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో వరుసపెట్టి కాల్పులు సంఘటనలు జరుగుతుండటంతో వాటికి ఇంతవరకు అడ్డుకట్ట వేయలేనందుకు అమెరికా సిగ్గుపడాలని ఒబామా అన్నారు. 18 నెలల వ్యవధిలో ఏకంగా 74 కాల్పుల సంఘటనలు అమెరికాలో జరిగాయి. లేటెస్ట్.గా ఓరెగాన్ హైస్కూల్లో 14 ఏళ్ల అబ్బాయిని ఒకడు కాల్చి చంపాడు. ఈ సంఘటన ఒబామా మనసును కలచివేయడంతో ఆయన చాలా నిస్పృహతో మాట్లాడారు. అమెరికాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగడం లేదని, తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు అమెరికా పరువుని ప్రపంచవ్యాప్తంగా తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారానికోసారి ఇలా కాల్పులు జరుగుతున్న అభివృద్ధి చెందిన దేశం ఏదీ ఈ భూప్రపంచం మీద లేదని, అమెరికాలోనే ఇలా జరుగుతోందని అన్నారు. 2012 డిసెంబర్లో జరిగిన హత్యాకాండ తర్వాత ఇప్పటివరకు 74 సంఘటనలు జరిగాయి. అమెరికాలో విచ్చలవిడిగా ఉన్న గన్ కల్చర్ మీద ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినా, దాన్ని మాత్రం ఇంతవరకు అరికట్టలేకపోయారు. చివరకు చిన్నపిల్లల చేతుల్లో కూడా తుపాకులు ఉండటం, వాళ్లు వాటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించడం లాంటివి కనిపించాయి.