మైనర్‌ని పెళ్ళాడనున్న క్రికెటర్ అఖ్తర్

      పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ వయసు దాదాపు 40 సంవత్సరాలు. ఈ లేటు వయసులో ఈయనగారు పెళ్ళి చేసుకోబోతున్నారు. ఆ పెళ్ళికూతురు వయసెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నోరు నొక్కుకుంటారు. అఖ్తర్‌కి ఈ పోయేకాలమేంటని తిట్టుకుంటారు. అఖ్తర్ పెళ్ళాడబోయే అమ్మాయి వయసు అఖ్తర్ వయసులో సగం కంటే తక్కువ. అంటే ఆ అమ్మాయి వయసు కేవలం 17 సంవత్సరాలు. అంటే మైనర్. ఇండియాలో మైనర్‌ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే లోపలేస్తారు. పాకిస్థాన్‌లో ఆ చట్టం వున్నట్టు లేదు. పాకిస్థాన్‌లోని హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుమార్తె అయిన పదిహేడేళ్ళ రుబబ్తో షోయబ్ పెళ్లి నిశ్చయమైంది. ప్రముఖ క్రికెటర్‌ సంబంధం దొరికిందన్న ఆనందంలో రుబబ్ తండ్రి వధూవరుల వయసులను ఎంతమాత్రం పట్టించుకోకుండా పెళ్ళి జరిపించడానికి ఒప్పుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ నెల మూడో వారంలో అఖ్తర్, రుబబ్ వివాహం జరగనుంది. పాపం రుబబ్!

మోడీ విషయంలో తొందరొద్దు: థరూర్‌కి డిగ్గీ సూచన

      వినేవాడికి చెప్పేవాడెప్పుడూ లోకువే అన్నట్టు ఇప్పుడు శశిథరూర్ దిగ్విజయ్‌సింగ్‌కి లోకువైపోయాడు. దిగ్విజయ్‌సింగ్‌కి తనకు, టీవీఛానల్ యాంకర్‌కూ మధ్య వున్న రిలేషన్‌ విషయంలో క్లారిటీ లేదుగానీ, శశిథరూర్‌కి సలహాలిస్తున్నాడు. అమెరికాలోని ఓ వెబ్‌సైట్‌కి శశిథరూర్ రాసిన వ్యాసంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని పొగిడాడు. అది కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వుండి వీలైతే నరేంద్రమోడీని తిట్టాలిగానీ, పొగడ్డమేంటని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఫీలయ్యారు. మణిశంకర్ అయ్యర్ అయితే శశిథరూర్‌ని ఏకంగా ఊసరవెల్లితో పోల్చాడు. ఇదిలా వుంటేఈ విషయంలో శశిథరూర్ అడక్కపోయినా డిగ్గీరాజాకి సలహా ఇవ్వాలని అనిపించినట్టుంది. వెంటనే ఇచ్చేశాడు. ‘‘ప్రధాని నరేంద్రమోడీ విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి, అభిప్రాయానికి రావొద్దు. కొంతకాలం గడిచిన తర్వాతే, మోడీ మరో అవతారం బయట పడిన తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలి’’ అన్నట్టుగా శశిథరూర్‌కి ఉచిత సలహా ఇచ్చాడు. ఇదిలా వుంటే మోడీపై తన వ్యాఖ్యల పైన థరూర్ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మోడీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల్లాగే గతంలో ఆయనను విమర్శిస్తూ చేసిన ప్రతి వ్యాఖ్యకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో ఆయన చర్యలను గమనిస్తూ ఉంటామని థరూర్ గురువారం ట్విట్టర్‌లో ట్విట్ చేశాడు.

వదినని నరికాడు.. వాడు చచ్చాడు!

      వదిన తల్లితో సమానమని అంటారు. తల్లిని ఎంత గౌరవిస్తామో వదిననీ అంతే గౌరవించాలని అంటారు. అయితే వదినతో ఏ విషయంలో గొడవొచ్చిందో ఏమో గానీ, ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ ప్రాంతానికి చెందిన రామ్ సహాయ్ (22) అనే యువకుడు తన వదిన సరోజ్ (24) మీద గొడ్డలితో దాడి చేసి నరికాడు. తన వదినని నరికిన తర్వాత భయపడిపోయిన సహాయ్ గుర్తు తెలియని విష పదార్థాన్ని మింగేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరకి నడుచుకుంటూ వెళ్ళి తాను తన వదినని నరికిన విషయం, తాను విషం మింగిన విషయం పోలీసులకు చెప్పాడు. రామ్ సహాయ్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా అక్కడ అతడు మరణించాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే రామ్ సహాయ్ నరికిన అతని వదిన సరోజ్ ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటోంది.

బాబు దారిలోకి జూనియర్: ప్రమాణానికి హాజరు

      ఎన్నికల సమయంలో మూతి ముడుచుకుని ప్రచారానికి కూడా రాకుండా బెట్టు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎందుకైనా మంచిదని చంద్రబాబు చెంతకు చేరుతున్నాడు. చంద్రబాబు గెలవగానే హరికృష్ణ దారిలోకి వచ్చాడు. చంద్రబాబు ఇంటికి వెళ్ళి అభినందించాడు. మహానాడులో కూడా చాలా బుద్ధిగా పాల్గొన్నాడు. అయితే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి సౌండ్ చేయలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సొంత ఊరైన నిమ్మకూరుకు వెళ్ళి వెళ్లి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఈ ఫ్యామిలీ హాజరవుతుంది.

కేసీఆర్ కు మద్దతు, చంద్రబాబుతో యుద్ధం?

  ఎన్నికలలో ఓడిపోయిన తరువాత చల్లబడిపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్రమంగా ఆ షాకు నుండి తేరుకొని పార్టీ సమీక్షా సమావేశాల పేరిట ఓదార్పు కార్యక్రమం నిర్వహించిన తరువాత, తమ ఓటమికి కారణం ఏమిటో ఆయనే ప్రకటించేశారు. చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని భూటకపు హామీలు ఇవ్వడం వలననే ప్రజలు ఆయనను నమ్మిఓటేసారని, కానీ తను మాత్రం ఆచరణ సాధ్యం కాని అటువంటి హామీలు ఇవ్వనందుకే ఓడిపోయానని తను కనుగొన్న గొప్ప సత్యాన్ని తన పార్టీ నేతలందరికీ తెలిజేసారు.   తను అధికారం కోసం రాజకీయాలలోకి రాలేదని ప్రజల కిచ్చిన మాట కోసమే వచ్చేనని, అందువల్ల తను అధికారం కంటే విస్వసనీయతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారం దక్కించుకోవడం కోసమే అనేక భూటకపు హామీలు ఇచ్చేరని, ఇప్పుడు తన మెడకు గుదిబండలా చుట్టుకొన్నవాటి నుండి ఏవిధంగా బయటపడాలా? అని ఆలోచిస్తున్నారని జగన్ ఎద్దేవా చేసారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున ఆయన ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తానని ప్రకటించారు.   జగన్మోహన్ రెడ్డి పార్టీ సమీక్షా సమావేశాలు పెట్టుకోవడం వెనుక ముఖ్యోదేశ్యం ఎన్నికలలో పార్టీ ఓటమికి గల కారణాలను కనుగొని, లోపాలను సవరించుకోవడం. అయితే ఆయన ఆ పనిచేయకపోగా తన ఓటమికి చంద్రబాబు భూటకపు హామీలు చేయడమే కారణమని వాపోవడం విడ్డూరం. చంద్రబాబు ప్రభుత్వం ఇంకా అధికారం చేప్పట్టనేలేదు. ఆయన హామీలను అమలు చేస్తారో లేదో? చేస్తే ఏవిధంగా అమలు చేస్తారో? ఎవరికీ తెలియదు. కానీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి అవన్నీ భూటకపు హామీలని తేల్చి చెప్పేస్తున్నారు.   అసలు చంద్రబాబు రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీలు చేయడంలో విఫలమవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకొంటున్నారు? అని ఆలోచిస్తే ఆయన విఫలమయితే ప్రభుత్వంపై యుద్ధం చేసి, మళ్ళీ ప్రజలలో మంచిపేరు సంపాదించుకోవాలనే ఆరాటమేనని చెప్పవచ్చును.   గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పుయాత్రలు, షర్మిలమ్మ పాదయాత్రలు, ఒట్టొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్షలు అన్నీ కూడా అధికారం కోసమేనని అందరికీ తెలుసు. చివరికి తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని, ఆయన చేపట్టిన సంక్షేమ పధకాలను కూడా తను అధికారం సంపాదించుకోనేందుకు పెట్టుబడిగానే వాడుకొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుగకముందే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిపోదామని సంతకాల సేకరణ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే స్వంతం. ఇంత అధికార దాహం కల వ్యక్తి తాను కేవలం ప్రజలకు ఇచ్చిన మాట కోసమే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   చంద్రబాబు భూటకపు వాగ్దానాలు చేసారని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తను కూడా అనేక ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు చేసిన సంగతి మరిచిపోయారు. నిజానికి అన్ని సర్వేనివేదికలు వైకాపాయే పూర్తి మెజార్టీతో గెలుస్తుందని బల్ల గుద్ది చెప్పడం వలన, గెలుపుపై ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రుణాలమాఫీ చేస్తానని హామీ ఇవ్వలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తన గెలుపుపై ఏమాత్రం అనుమానం ఉన్నా, పాత రుణాలే కాదు వచ్చే ఐదేళ్ళలో రైతులు తీసుకోబోయే అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తానని ప్రకటించేవారేమో?   తెలంగాణలో అధికారం చేప్పట్టిన కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు వెనుకంజ వేస్తుంటే నోరుపెగలని, జగన్మోహన్ రెడ్డి, ఇంకా అధికారం చెప్పట్టని చంద్రబాబు ప్రభుత్వం రుణాలమాఫీపై యుద్దానికి సిద్దం అనడం మరో విశేషం. రాష్ట్ర విభజనకు కారణమయిన కేసీఆర్ నోరు తెరచి అడగకముందే ఆయన ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంపై మాత్రం అప్పుడే యుద్ధం ప్రకటించేయడం మరో విశేషం.   చంద్రబాబు భూటకపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని జగన్ అనడం చూస్తే, ప్రజలు గొర్రెలు వారికి ఆలోచించే జ్ఞానం లేదు అందుకే చంద్రబాబుని గుడ్డిగా నమ్మి ఓటేసేసారని అభిప్రాయపడుతున్నట్లు ఉంది. ఆయన ఆవిధంగా మాట్లాడటం ప్రజల పట్ల ఆయనకు ఎంతటి చులకన భావం ఉందో తెలియజేస్తోంది.   నిజానికి ప్రజలు చంద్రబాబు హామీల కంటే ఆయన పరిపాలనా సామర్ద్యం, అనుభవం, కార్యదక్షత, కేంద్రంతో ఆయనకున్న సత్సంబంధాలు వంటి అంశాల కారణంగానే ఎన్నుకొన్నారు. పరిపాలనానుభావం ఉన్న ఆయనయితేనే రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలరని నమ్మకంతోనే ఓటేసే గెలిపించారు. కానీ వైకాప ఓటమికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని చెప్పవచ్చును. అక్రమ సంపాదన, సీబీఐ చార్జ్ షీట్లు, కోర్టులు, కేసులు, బెయిళ్ళు, జైలు జీవితం, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీతో, ఆంద్ర ప్రజలను ఘోరంగా అవమానిస్తున్నకేసీఆర్ తో రహస్య సంబందాలు, ఇంకా మున్ముందు కోర్టు కేసులు.. ఇటువంటి గొప్ప ట్రాక్ రికార్డ్ కలిగిన అతని వలననే వైకాపా ఓడిపోయిందని చెప్పక తప్పదు. కానీ ఆవిషయం మరుగునపరచి చంద్రబాబుని తప్పు పట్టడం అవివేకం. అధికార దాహంతో అలమటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికయినా నిజాయితీగా వ్యవహరించగలిగితే, ప్రజలలో వచ్చే ఎన్నికల నాటికయినా ప్రజలలో ఆయన పట్ల ‘విశ్వసనీయత’ ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెండు రాష్ట్రాల అభివృద్ధే మా లక్ష్యం: నిర్మల

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్మల సీతారామన్ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు షంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ను రాష్ట్ర బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి వుందన్నారు. రెండు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాలలో ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధికి తనవంత సహకారం అందిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు అధికమవుతాయని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ముంపు గ్రామాలను కలిపింది బంగ్లాదేశ్‌లో కాదు: వెంకయ్య

      పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అనే అంశం మీద టీఆర్ఎస్ నాయకులు లబోదిబో అని మొత్తుకుంటూ నానా హడావిడి చేస్తున్నారు. వీరి మీద బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయకుడు సెటైర్ వేశారు. పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాలను తాము కలిపింది మన దేశంలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేనని బంగ్లాదేశ్‌లాంటి పరాయి దేశంలో కాదని వ్యాఖ్యానించారు. ఆ మండలాలలను అటు కలిపినా, ఇటు కలిపినా పోయేదేమీ లేదని అన్నారు. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణకు నష్టం రాదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆంద్ర ప్రజల జీవన రేఖ అని ఆయన అభివర్ణించారు. రాజకీయ లబ్ధికోసం ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దని ఆయన అలా విభేదాలు సృష్టిస్తున్న వారికి సలహా ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పక లభిస్తుందని వెంకయ్య పునరుద్ఘాటించారు. కొందరు ఆ నాయుడు,ఈ నాయుడు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరికాదని చెబుతూ నాయుడు అంటే నాయకుడు అని వెంకయ్య నాయుడు అర్థం వివరించారు.

ఉత్తర ప్రదేశ్‌లో మరో అత్యాచారాల పర్వం

      ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం యు.పి.లో అక్కాచెళ్లపై అత్యాచారం చేసి, ఆపై చెట్టుకు ఊరేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృప్టించింది. అత్యాచార సంఘటనలు సృష్టించిన సంచలనం కంటే అత్యాచారాల మీద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిస్తున్న తీరు ఇంకా సంచలనాత్మకం అయింది. ఇదిలా వుంటే, అక్కాచెల్లెళ్ళ అత్యాచార ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే, యు.పి.లో మళ్లీ అటువంటి ఘటనే జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఇటా జిల్లాలోగల సియపూర్ గ్రామంలో 14, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. వీరిద్దరిని ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సమీపంలో వున్న అటవిప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ముగ్గరినీ అరెస్టు చేశారు.

ఢిల్లీ టూర్: కేసీఆర్ టార్గెట్ ప్రత్యేక హోదా!

      ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రత్యేక హోదా సాధించడమేనని స్పష్టమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ శనివారం తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈదఫా పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో సమావేశం అవుతారు. ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాల్సిన అంశాలపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేసీఆర్ వ్యూహరచన చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కేసీఆర్ ప్రధానిని కోరనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా కోరబోతున్నారు.

బామ్మా.. నువ్వు సూపరెహె!

    ఆమె వయసు 91 సంవత్సరాలు. అందులోనూ కేన్సర్ వ్యాధికి గురై ఈమధ్యే కోలుకుంటున్న ముసలమ్మ... అయినా సరే 42 కిలోమీటర్ల దూరం మారథన్ రన్ చేసింది. ఈ దూరాన్ని 7 గంటల 7 నిమిషాల 42 క్షణాల్లో పూర్తిచేసింది. అమెరికా వాషింగ్టన్‌లోని లుకేమియా లింఫోమియా సొసైటీకి నిధుల సేకరణ కోసం నిర్వహించిన మారథాన్ పరుగులో ఆరోగ్యం సహకరించకపోయినా హారియట్ థాంప్సన్ అనే ఆ బామ్మ ఉత్సాహంగా పాల్గొంది. మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి మారథాన్‌లో చాలా సంవత్సరాల క్రితం ఒక బామ్మ పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిందట. ఇప్పుడు మన హారియట్ థాంప్సన్ రెండో బామ్మ. 42 కిలోమీటర్ల మారథాన్‌లో సగం పరిగెత్తేసరికి తన పని అయిపోయిందని తాను భావించానని, కానీ, తన మారథాన్‌ను చూస్తు్న్న వారు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు మారథాన్ పూర్తి చేసే ఉత్సాహాన్ని ఇచ్చిందని బామ్మ చెప్పింది. బామ్మ విజయవంతంగా మారథాన్ పూర్తి చేసినందుకు ఈ మారథాన్ నిర్వహించిన సంస్థకు 90 వేల డాలర్లు దక్కాయి. మన బామ్మ గతంలో ఒకసారి మారథాన్లో పాల్గొంది. అప్పుడు పరుగుకు నాలుగు వారాల ముందు వరకు ఆమె 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకుంది. దాని ఫలితంగా రెండు కాళ్ల మీద విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ ఆమె పరుగు తీసింది. ఈసారి పరిగెత్తినప్పుడు బామ్మగారి 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా ఆమెతో పాటు పరిగెత్తి, ఆమెకు సాయం చేశాడు. వచ్చే సంవత్సరం నాటికి తాను బతికుంటే.. మరోసారి మారథాన్ రన్ చేస్తానని బామ్మ ఉత్సాహంగా చెబుతోంది. అందుకే.. బామ్మా.. నువ్వు సూపరెహె!

అదొక వేస్ట్ కార్యక్రమం...దానికి నేనెందుకు?

  రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో తనకున్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. కారణం అతను ప్రధాన ప్రతిపక్షనాయకుడనే. అప్పుడు చంద్రబాబును అభినందించిన జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.   “చంద్రబాబు నాయుడు ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని చెపుతూనే దాదాపు ముప్పై కోట్లు ఖర్చు చేసి ఇంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం సబబా? అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉందని చెపుతున్నపుడు ఇంకా అనవసర వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నట్లు? తెదేపా నేతలు కొందరు ఈ కార్యక్రమం కోసం కూడా విరాళాలు సేకరిస్తున్నట్లు నేను విన్నాను. మరి అటువంటప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్భాటంగా ఎందుకు చేస్తున్నట్లు? ఇంత భారీగా ప్రజాధనం వృధా చేసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత వృధా చేయాలని నేను కోరుకోవడం లేదు,” అని అన్నారు.   “చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై తోలి సంతకం చేసినా దానిని ఆయన ఖచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం నాకు లేదు. ఏవో కుంటి సాకులు చెప్పి తప్పుకోవడం ఖాయం. అదేజరిగితే ప్రజల తరపున వైకాపా ఆయనను తప్పకుండా నిలదీస్తుంది. ఎన్నికల సమయంలో ఆయన అనేక భూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచారు. అందువల్ల ఇప్పుడు ఆయన చేసిన హామీలన్నిటినీ నెరవేర్చేవరకు ఆయన ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉంటాము. ప్రజలు మమ్మల్ని ఆపని చేసేందుకే ప్రతిపక్ష హోదా కల్పించారు. మేము మా బాధ్యత విస్మరించకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము,” అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

బంగారు నగలు కొనకండి.. ఎందుకంటే...

      రేపో ఎల్లుండో బంగారమో, బంగారు నగలో కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆగండి.. ఆగిపోండంతే! ఒక వారం పదిహేను రోజులు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఆ తర్వాత బంగారం కొన్నారంటే బోలెడంత తక్కువ ధరకే బంగారు నగలు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే బంగారం మీద వున్న ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడానికి ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం 15 శాతంగా వున్న దిగుమతి సుంకాన్ని 2 నుంచి 4 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలా జరిగితే బంగారం దిగుమతులు బాగా పెరుగుతాయి. అప్పుడు ఆకాశంలో విహరిస్తున్న బంగారం ధర నేల మీదకి దిగివచ్చే అవకాశం వుంది. యుపిఎ హయాంలో బంగారం దిగుమతి విషయంలో చిదంబరం లేనిపోని ఆంక్షలు విధించడంతో బంగారం ధర కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు యుపిఎ ప్రభుత్వం ఎలాగూ కొండెక్కి పోయింది కాబట్టి, ఆ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా బంగారం దిగుమతులపై వున్న ఆంక్షలను సరళీకృతం చేయడంతోపాటు దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య వల్ల బంగారం ధరలు దిగివచ్చే అవకాశం వుంది. కాబట్టి బంగారు నగలు కొనాలని అనుకుంటున్న వాళ్ళు కొంతకాలం ఆగితే బెటర్. అలాగే మీరు మీ దగ్గర వున్న బంగారాన్ని అమ్మేయాలని అనుకుంటున్నారా? అయితే అర్జెంటుగా అమ్మేయండి.. ఆలసించిన ఆశాభంగం.

ప్రధాని, రాష్ట్రపతిలను కలవనున్నకేసీఆర్

  తెలంగాణా ముఖ్యమత్రి హోదాలో కెసిఆర్ ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలవబోతున్నారు. మొదట ఆయన ప్రధాని మోడీని సాయంత్రం 4.15 గం.లకు కలిసి, తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వవలసినదిగా కోరనున్నారు. దానితో బాటు పోలవరం ముంపు గ్రామాల సమస్య, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమయిన నిధులు, అనుమతులు, అదనపు విద్యుత్తు కేటాయింపు మరియు పెండింగులో ఉన్న అనేక ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించి, వాటి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరనున్నారు. కేసీఆర్ తన ప్రమాణ స్వీకారానికి కేంద్రమంత్రులెవరినీ ఆహ్వానించనందున, ఇప్పుడు తన ప్రభుత్వం నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. తరువాత సాయంత్రం 6.15 గం.లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. కేసీఆర్ ప్రధానిని కలిసే ముందు కొంతమంది కేంద్రమంత్రులను కలిసి వారితో కూడా తెలంగాణకు సంబంధిన వివిధ అంశాలను చర్చించి, వారి సహకారం కోరనున్నారు. కేసీఆర్ నిన్న సాయంత్రం డిల్లీ చేరుకొన్నారు. మళ్ళీ ఈరోజు రాత్రి హైదరాబాదుకు తిరిగివస్తారు.

గూగుల్‌ నుంచి అద్భుత ట్యాబ్లెట్ పీసీ ‘ట్యాంగో’

  ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ రంగంలో రారాజు గూగుల్ కంప్యూటర్ ఉపకరణాల రంగంలో కూడా తన ముద్రని వేయడానికి ప్రయత్నిస్తోంది. సాంకేతికంగా ఒక అద్భుతంలా వుండే ట్యాబ్లెట్ పీసీని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ ట్యాబ్ పేరు ‘ట్యాంగో’. ఈ ఏడాది చివరికల్లా ‘ట్యాంగో’ మార్కెట్లోకి వచ్చే అవకాశం వుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌విడియా టెగ్రా కె1 ప్రాసెసర్‌తో ‘ట్యాంగో’ రూపొందింది. అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, వైఫై, 4జీ దీనిలో ఇతర ప్రత్యేకతలు. నిర్మాణాలు, రోడ్లు, కదిలే వస్తువులు, వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారు, పరిమాణం.. ఇలా పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకునేలా ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పరిసరాలను 3డీలో స్కాన్ చేసేందుకు వీలుగా మోషన్ ట్రాకింగ్ కెమెరాలు మూడింటిని వెనుకవైపు అమరుస్తున్నారు. సెకనుకు 2.5 లక్షలకుపైగా 3డీ కొలతలను ఇవ్వగలదు. మొబైల్ 3డీ సెన్సింగ్ రంగంలో పనిచేసేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. తొమ్మిది దేశాలకు చెందిన యూనివర్సిటీలు, పరిశోధనశాలలు, పరిశ్రమ నిపుణులతో కూడిన బృందం దీని అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. ధర రూ.60 వేలు.

కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి తెలంగాణలో ఇద్దరు రైతుల బలి!

  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు రైతులను బలి తీసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన ఒక రైతు పరిస్థితి విషమంగా వుంది. ఏ రైతుల అండతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో అదే రైతులను తన వైఖరి ద్వారా బలి తీసుకోవడం విషాదం. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. టీఆర్ఎస్ అధినేత పలు సందర్భాలలో ఈ విషయాన్ని ప్రకటించారు. రుణమాఫీ చేస్తే తమ కష్టాలు తీరిపోతాయని భావించిన రైతులు టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మాట మార్చింది. రుణ మాఫీ విషయంలో రకరకాల మెలికలు పెట్టింది. దాంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఖిన్నులయ్యారు. తాము నమ్మిన టీఆర్ఎస్ తమను దారుణంగా మోసం చేస్తూ వుండటంతో తట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఆగ్రహంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ వుండగా, కొంతమంది సున్నిత మనస్కులు ప్రాణాలే కోల్పోయారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో ఒక రైతు కేసీఆర్ వైఖరి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కి చెందిన రైతుబిడ్డ దత్తాత్రేయ (55) తాను బ్యాంకులో చేసిన రుణం తీరే అవకాశాలు కనిపించకపోవడంతో దిగులు చెందాడు. టీవీలో రుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ అభ్యంతరాలకు సంబంధించిన వార్త చూస్తూ గుండెపోటుతో మరణించారు. అలాగే కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నూనె స్వామిరెడ్డి (50) కూడా తన అప్పు తీరదేమో, తనకు రుణమాఫీ వర్తించదేమోనన్న బెంగతో గుండెపోటుతో కన్నుమూశారు. అలాగే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రైతు రుణమాఫీ అవదమోనన్న బెంగతో పురుగుల మందు తాగారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా వుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారం తిరగకుండానే ఇన్ని ఘోరాలకు కారణమైంది. ఇక భవిష్యత్తు ఎలా వుంటుందో ఊహించడానికే భయమేస్తోంది.

ముదనష్టపు మొగుడు: నెట్‌లో భార్య నగ్న ద‌ృశ్యాలు

  మహారాష్ట్రలోని థానేలో పరమ నీచుడైన ఒక మొగుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని పెళ్ళిలో ప్రమాణం చేసిన ఆ నీచుడు డబ్బు కోసం అతి దారుణమైన పనికి ఒడిగట్టాడు. తన భార్య నగ్న దృశ్యాలను వీడియో చిత్రీకరణ చేసి వాటిని ఓ బూతు ‌వెబ్ సైట్‌కి అమ్మేశాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. థానేకి చెందిన ఆశిష్ గుప్తా అనే ఒక ముప్పయ్యేళ్ళ త్రాష్టుడు ఉద్యోగం, సంపాదన లేకపోవడంతోపాటు దురలవాట్లు కూడా బాగా పెరిగిపోవడంతో కట్టుకున్న భార్యని వ్యాపార సాధనంగా భావించాడు. భార్యకు రక్షణగా ఉండాల్సిన భర్తే సంపాదన కోసం నీచుడిగా మారాడు. తన భార్య నగ్నంగా వున్నప్పుడు ఆ దృశ్యాలను వీడియో తీసి ఒక బూతు సైట్లో వుంచాడు. ఆ విషయం బయటపడి భార్యకి తెలిసిపోయింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ముదనష్టపు మొగుడిని అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి నిర్మలా సీతారామన్

  కేంద్రమంత్రిగా నియమితురాలైన బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మంత్రి పదవి స్వీకరించిన ఆరు నెలల లోపున లోక్‌సభకు గానీ, రాజ్యసభకు గానీ ఎన్నిక కావలసి వుంటుంది. అందువల్ల నిర్మలా సీతారామన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మృతితో ఏర్పడిన రాజ్యసభ ఖాళీని సీతారామన్‌కు కేటాయించనున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లో సభ్యత్వం లేని నిర్మలా సీతారామన్‌కు స్వతంత్ర హోదాతో కూడిన మంత్రి పదవిని నరేంద్ర మోడీ కేటాయించారు. నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన మహిళ అయినప్పటికీ ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు. విశాలాధ్ర మహాసభ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా వుండటానికి ప్రయత్నించిన పరకాల ప్రభాకర్ భార్యే నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వెయిట్ మరింత పెరిగే అవకాశం వుంది.