డిప్యూటీ సీటు వద్దు మొర్రో: పద్మా దేవేందర్
posted on Jun 11, 2014 @ 6:14PM
పిలిచి పదవి ఇస్తానంటే వద్దనేవాళ్ళు వుంటారా? వుంటారు.. అలాంటి నాయకురాలే మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ ఎంపిక చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడం తనకి ఎంతమాత్రం ఇష్టం లేదని పద్మా దేవేందర్‌రెడ్డి తెగేసి చెప్పడంతో టీఆర్ఎస్ నాయకత్వం తెల్లబోయింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో వున్నవాళ్ళు ప్రజలకు దూరమైపోతారని, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు తగ్గిపోతాయని, వచ్చే ఎన్నికలలో ఓడిపోయే అవకాశం కూడా వుంటుందని అందువల్ల తనకు డిప్యూటీ స్పీకర్ పదవి వద్దంటే వద్దని పద్మా దేవేందర్‌రెడ్డి చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపడితే హోదా వస్తుందే తప్ప మరే ప్రయోజనమూ వుండదని ఆమె భావిస్తున్నారు. దాంతో టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు రంగంలోకి దిగారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పద్మను బుజ్జగించారు. ‘‘సిద్దిపేటను చూసుకున్నట్టుగానే మెదక్ నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటా. మీకు న్యాయశాస్త్రంలో పట్టా ఉన్నందున సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అవకాశం వస్తుంది’’ అని హరీష్‌రావు సర్దిచెప్పడంతో పద్మా దేవేందర్ రెడ్డి అయిష్టంగానే డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి అంగీకరించినట్టు తెలిసింది.