చంద్రబాబు ప్రమాణానికి తరలివస్తున్న ప్రముఖులు

  చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి యావత్ నందమూరి కుటుంబ సభ్యులు గుంటూరు తరలివచ్చేరు. ఇంతవరకు ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తున్నబాలకృష్ణ, హరికృష్ణ అయన కుమారుడు జూ.యన్టీఆర్ అందరూ కలిసి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో తెదేపా కార్యకర్తల చాలా సంబరపడుతున్నారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక విమానంలో మధ్యాహ్నమే గన్నవరం చేరుకొని అక్కడి నుండి సభాస్థలి వరకు రోడ్డు మార్గం ద్వారా వచ్చి అక్కడ నాగార్జున విశ్వవిద్యాలయ భవనంలో బస చేసారు. కొందరు కేంద్రమంత్రులు, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ తదితరులు సభాస్థలి వద్ద విడిది గృహాలకు చేరుకొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సభాస్థలి వద్దకు చేరుకొన్నారు. ప్రముఖుల రాకతో గుంటూరు విజయవాడ మధ్య ట్రాఫిక్ పూర్తిగా స్థంబించిపోయింది. మండే ఎండను సైతం లెక్కజేయకుండా వేలాది ప్రజలు తరలివస్తున్నారు. అప్పుడే సభావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయిపోయాయి.

తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావును తెలంగాణ అసెంబ్లీ శాసనసభాపక్షం నాయకునిగా, ఉపనేతలుగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, రేవంత్ రెడ్డిని నియమించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అసెంబ్లీలో పార్టీ విప్‌గా, కౌన్సిల్‌లో ఎ నర్సారెడ్డిని పార్టీ పక్షం నాయకుడిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించినట్టు తెలుస్తోంది. కోశాధికారిగా మాగంటి గోపినాథ్, కార్యదర్శులుగా సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారని తెలుస్తోంది. టిటిడిఎల్పీ నేత పదవి కోసం ఎర్రబెల్లి, తలసాని, ఆర్ కృష్ణయ్యల పేర్లు చివరి దాకా పరిశీలనలోకి వచ్చాయి. సీనియారిటీని పరిగణలోకి తీసుకొని తమకే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి, తలసానిలు పట్టుబట్టారు. చివరకు ఎర్రబెల్లిని శాసన సభా పక్ష నేతగా చంద్రబాబు ఎంపిక చేసినట్టు సమాచారం. తనను కాదని ఎర్రబెల్లిని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకుంటే రుణమాఫీ: కేసీఆర్

  రైతుల రుణాలు మాఫీ చేసే విషయంలో పప్పులో కాలేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులు, ప్రజల విషయంలో విలువ పోగొట్టుకున్నారు. ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలా ఆనే ఆలోచనలో ఆయన వున్నారు. అందుకే ఈ రుణమాఫీ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్‌ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. రైతుల రుణమాఫీ అవ్వాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆమోదం కావాలని చావుకబురు చల్లగా చెప్పినట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరునూరైనా పంటల రుణమాఫీ చేసి తీరుతామని అయితే రుణ మాఫీకి రిజర్వు బ్యాంకు ఆమోదం కావాలని చెప్పారు. ఢిల్లీలో మోడీని కలిసిన తాను తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్టు కేసీఆర్ తెలిపారు. తమ విజ్ఞాపనలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. పక్షపాత వైఖరి ఉండదని మోడీ హామీయిచ్చారని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని సలహాలిచ్చారని తెలిపారు.

కంగ్రాట్స్ మరిదిగారూ: పురందేశ్వరి

  మరిదిగారికి వదినమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఎవరా మరిది? ఎవరా వదినమ్మ? ఆ మరిది చంద్రబాబు నాయుడు, వదినమ్మ కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబునాయుడి పరిపాలనా దక్షత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. బీజేపీ సహకారం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చిందని ఆమె తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రమాణానికి వస్తున్న ప్రముఖులు వీరే!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. వారిలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, భాజపా అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్ జోషి, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్, కల్ రాజ్ మిశ్రా, పీయూష్ గోయల్, నజ్మా హెప్తుల్లా, అనంత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వారు ఈ కార్యక్రమానికి రానున్నారు. వారిలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధికా, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వున్నారు. ప్రముఖ సినీనటులు రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఢిల్లీ నుంచి 180 సీట్లతో వున్న విమానం, హైదరాబాద్ నుంచి 212 సీట్లు వున్న విమానం అతిథులను తీసుకుని గన్నవరం విమానాశ్రయానికి రానున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు, మిత్రులు 122 సీట్లు వున్న విమానంలో గన్నవరం వచ్చారు. వీరికోసం గన్నవరం నుంచి సభా స్థలి వరకు మూడు బస్సులను కూడా సిద్ధం చేశారు. జాతీయ మీడియాకు చెందిన 30 మంది ప్రతినిధులు కూడా ఢిల్లీ నుంచి రానున్నారు. పైన పేర్కొన్న ప్రముఖులలో చాలామంది ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. త్వరలో సభాస్థలికి చేరుకుంటారు.

19 మందితో బాబు తొలి మంత్రివర్గం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబుతోపాటు 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. వీరిలో ఇద్దరు బీజేపీకి చెందిన వారు కూడా వున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన నిమ్మకాయల చిన్నరాజయ్య ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే మంత్రులుగా పరిటాల సునీత (రాప్తాడు-అనంతపురం జిల్లా), పల్లె రఘునాథరెడ్డి (పుట్టపర్తి-అనంతపురం), యనమల రామకృష్ణుడు (ఎమ్మెల్సీ-తూర్పు గోదావరి), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి-చిత్తూరు), కిమిడి మృణాళిని (చీపురుపల్లి-విజయనగరం), నారాయణ (నెల్లూరు), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట-గుంటూరు), రావెల కిశోర్ (ప్రత్తిపాడు-గుంటూరు), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం-క‌ృష్ణాజిల్లా), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం-కృష్ణాజిల్లా), పీతల సుజాత (చింతలపూడి-పశ్చిమ గోదావరి), అచ్చెన్నాయుడు (టెక్కలి-శ్రీకాకుళం), గంటా శ్రీనివాసరావు (భీమిలి-విశాఖ), అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం-విశాఖ), శిద్ధా రాఘవరావు (దర్శి-ప్రకాశం), మాణిక్యాలరావు (బీజేపీ - తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి), కామినేని శ్రీనివాస్ (బీజేపీ, కైకలూరు, కృష్ణాజిల్లా).

మామయ్య పిలిచారు అందుకే వచ్చా: జూ.ఎన్టీఆర్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం సంతోషాన్ని కలిగిస్తోందని, మామయ్య చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలసి హాజరవుతుున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు ఉదయం నిమ్మకూరుకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. మావయ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం... అదీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందటం గర్వంగా ఉందన్నారు. కొత్త రాష్ట్రానికి మామయ్య తొలి ముఖ్యమంత్రి కావడం గర్వకారణమన్నారు. తాను కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని తిలకించబోతున్నట్లు చెప్పారు.

ఇది పేదోడి ఇంటిలో పెళ్ళి: జగన్‌‌కి లోకేష్ కౌంటర్

  చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైసీపీ నాయకుడు జగన్ విమర్శించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ జగన్‌కి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని లోకేష్ పేదోడి ఇంటిలో పెళ్లితో పోల్చారు. పేదవాడి ఇంటిలో పెళ్లి జరిగినా పందిరేస్తారు. వాయిద్యాలు ఏర్పాటు చేస్తారు. వందలాది మందికి భోజనాలు పెడతారు. అదే రీతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రమాణ స్వీకారానికి ముప్పై కోట్లు వ్యయమా అన్న విమర్శను లోకేష్ కొట్టిపారేశారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పట్లో ఎంత ఖర్చుచేశారో ఇప్పుడూ అంతే ఖర్చవుతోందని లోకేష్ అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. రోడ్లు లేవు... మౌలిక వసతులు లేవనే విషయాన్ని దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

చంద్రబాబుకు వివేక్ ఓబెరాయ్ శుభాకాంక్షలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో నడుస్తుందని ఆశిస్తున్నాని వివేక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివేక్ శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్‌గోపాల్ వర్మ పరిటాల జీవితం ఆధారంగా రూపొందిన రక్తచరిత్ర సినిమాలో వివేక్ ఓబెరాయ్ పరిటాల రవిని పోలిన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వివేక్ ఓబెరాయ్ బాలీవుడ్ నటుడు అయినప్పటికీ ఆయన మూలాలు పూర్వ ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నాయి. వివేక్ ఓబెరాయ్ తండ్రి సురేష్ ఓబెరాయ్ హైదరాబాద్‌లో జన్మించి, చాలాకాలం హైదరాబాద్‌లోనే నివసించారు. ఆ తర్వాత ఆయన బాలీవుడ్ నటుడిగా బిజీ అయ్యారు.

చంద్రబాబు మంత్రివర్గ సభ్యుల పేర్లు

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు మంత్రివర్గం ఖరారయింది. ఈరోజు ఉదయం గవర్నరు నరసింహన్ కు పంపిన జాబితాలో చంద్రబాబుతో బాటు మొత్తం 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలియజేసారు. వారెవారంటే:   అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం); కి మిడి మృణాళిని(విజయనగరం); అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌రావు(విశాఖపట్నం); యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప(తూర్పు గోదావరి జిల్లా); పీతల సుజాత(పశ్చిమ గోదావరి); దేవినేని ఉమా, కొల్లు రవీంద్రబాబు (కృష్ణా); ప్రతిపాటి పుల్లారావు, రావెల్ల కిషోర్ (గుంటూరు); సిద్దా రాఘవరావు(ప్రకాశం) ; నారాయణ(నెల్లూరు); బొజ్జ గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు); కేఈ కృష్ణమూర్తి (కర్నూలు); పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత (అనంతపురం). బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ మరియు మాణిక్యాల రావులకు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది.   వీరిలో బీసీలకు 6, కమ్మ-6, కాపు-3 , రెడ్డి- 2, ఎస్సీ-2, వైశ్య-ఒకరికి చొప్పున మంత్రి పదవులు దక్కనున్నాయి. కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్పలు ఉపముఖ్యమంత్రులుగా నియమితులవబోతున్నట్లు సమాచారం.

పోలీసుల మీద అలిగిన తెలుగు తమ్ముళ్లు!

  ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వస్తున్న లక్షలాదిమంది తెలుగుదేశం కార్యకర్తల్లో కొంతమందికి పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం 7 గంటల తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం వుండగా, ఆదివారం ఉదయం నుంచే కార్యకర్తలు రావడం మొదలైంది. అయితే కొంతమంది కార్యకర్తలను పోలీసులు ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణానికి బయటే ఆపేశారు. పాసులు లేకపోవడం వల్లే వారిని ఆపేశారని పోలీసులు చెబుతున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం తమకు పాసులు వున్నప్పటికీ లోపలకి పోనివ్వకుండా పోలీసులు ఆపేశారని ఆరోపిస్తున్నారు. అయితే బయటే వుండటం వల్ల ఎండ వేడికి తాళలేక తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. కుర్చీలు విరగ్గొట్టి నిరసన తెలిపారు. అయితే తెలుగుదేశం నాయకులు సర్దిచెప్పడంతో వాతావరణం చల్లబడింది.

చంద్రబాబు ప్రమాణానికి సర్వం సిద్ధం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి గం.7.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికోసం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానం ముస్తాబైంది. నాగార్జున యూనివర్సిటీకి కిలోమీటర్ల పరిధిలో తెలుగుదేశం జెండాలు, బ్యానర్లతో పసుపుమయమైంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, పలువురు కేంద్రమంత్రులు, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని చంద్రబాబు ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడం లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షలమంది తెలుగుదేశం కార్యకర్తలు హాజరు అయ్యే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

రుణమాఫీ చేస్తాం: లోకేష్

  చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, ఈరోజు మధ్యాహ్నం నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చేరు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తను కేవలం అక్కడ జరుగుతున్నఏర్పాట్లను పరిశీలించేందుకే వచ్చేనని అన్నారు. తాను ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్నడూ జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయనని అన్నారు. తన తండ్రి రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెపుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత బాధపడిపోతున్నారు అని ప్రశించారు. ఎవరు ఎంతగా ఏడ్చినప్పటికీ తన తండ్రి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణాలు మాఫీ చేయబోతున్నారని ప్రకటించారు. ఇంతవరకు తెదేపా సీనియర్ నేతలు అనేకమంది ఇదే విషయాన్ని దృవీకరించారు. కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా రుణాలు మాఫీ చేయబోతున్నట్లు చెప్పడం చూస్తే, చంద్రబాబు నాయుడు అందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నట్లు భావించవచ్చును. అయితే అన్ని వేల కోట్ల రూపాయలు ఇటువంటి క్లిష్ట సమయంలో ఏవిధంగా మాఫీ చేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆయన రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసి అందుకు బదులుగా బ్యాంకర్లకు ప్రభుత్వ బాండ్లు జారీచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః అందుకే లోకేష్ తో సహా తెదేపా నేతలందరూ రునమాఫీపై అంత దృడంగా, నమ్మకంగా పదేపదే హామీ ఇవ్వగలుగుతున్నారు. ఏమయినప్పటికీ రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత అయన అనుసరించే విధానం బట్టి ఈ రుణమాఫీలపై తెదేపా, వైకాపాల నడుమ జరుగుతున్న యుద్ధం పతాక స్థాయికి చేరుకోవచ్చును లేదా వైకాపా మళ్ళీ భంగపడవచ్చును.

మళ్ళీ లిక్కర్ సిండికేట్ మూత తెరిచినా ఏసీబీ

  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలుగుతున్న రోజులలో తనకు పక్కలో బల్లెంలా తయారయిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను దారికి తెచ్చుకోవడానికి, మద్యం సిండికెట్లపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే బొత్స వ్యాపారాలు సాగుతున్న విజయనగరం జిల్లాపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, కేసు మూలాల వరకు చొచ్చుకుపోయారు. దానితో బొత్స సత్యనారాయణ ఉరుకుల పరుగుల మీద డిల్లీ వెళ్లి అధిష్టానంతో మొరపెట్టుకోవడం వెంటనే ఏసీబీ అధికారులు వెనక్కి తగ్గి కేవలం కొంతమంది ఎక్సయిజ్ శాఖా అధికారులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం జరిగింది.   కానీ మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మారడంతో ఏసీబీ అధికారులు అటకెక్కించిన ఆ మద్యం ఫైళ్ళను దుమ్ము దులుపి బయటకు తీస్తున్నారు. అయితే ఈసారి వారు మొదట విజయనగరం నుండి కాక, శ్రీకాకుళం జిల్లా నుండి పని మొదలుపెట్టడం విశేషం.   వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు వ్యక్తిగత కార్యదర్శులు రవి శంకర్ మరియు పొన్నాడ అప్పరావులను, ధర్మాన క్రిష్ణదాసు యొక్క అనుచరుడు సాయి శ్రీనివాస్ శర్మ ముగ్గురినీ మద్యం సిండికేట్ వ్యవహారంలో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకమ్మని ఏసీబీ అధికారులు సమన్లు జారీచేసినట్లు సమాచారం. అంతే గాక ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామమనోహర్ నాయుడు (చిన్ని), శ్రీకాకుళంలో మద్యం సిండికేట్ నడిపిస్తున్న ఓరుగంటి ఈశ్వర్రావులను అరెస్ట్ చేసి జైలుకి తరలించినట్లు తాజా సమాచారం. అంతేగాక ఈ కేసుతో సంబంధం ఉన్న ధర్మాన ప్రసాదరావుకి చెందిన వర్జిన్ రాక్స్ గ్రనైట్ కంపెనీలో డైరెక్టరు అప్పారావుకు కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.   దీనిపై ధర్మాన స్పందిస్తూ చంద్రబాబు ఇంకా అధికారం చెప్పట్టక మునుపే తన రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం ఆరంభించారని విమర్శించారు. కానీ వాన్ పిక్ భూముల వ్యవహారంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆకేసులో ఆయనను కాపాడేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషం వరకు చాల కష్టపడ్డారు, కానీ మంత్రిపదవి పోయింది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించిన మద్యం సిండికేట్ వ్యవహారమే ఇప్పుడు ధర్మాన తలకు చుట్టుకోవడం విచిత్రమయితే, అందుకు ఆయన కిరణ్ కుమార్ ని బదులు ఇంకా అధికారం చెప్పటని చంద్రబాబును నిందించడం మరో విచిత్రం.

చంద్రబాబు మూడు సంతకాల ముచ్చట్లు

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి పీఠం మీద మరోసారి నారా చంద్రబాబునాయుడు కూర్చోబోతున్నారు. ఆదివారం సాయంత్రం గుంటూరు సమీపంలో జరిగే ఒక భారీ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు ఫైళ్ళ మీద సంతకాలు చేయనున్నారు. ఆ మూడు ఫైళ్ళ ముచ్చట్లు ఇవి.. ఆదివారం సాయంత్రం 7.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు రాత్రి 8.35 నిమిషాలకు తన మొదటి సంతకాన్ని చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మొదటి సంతకాన్ని రైతు, డ్వాక్రా రుణమాఫీ ఆదేశాల పైల్ మీద చేయనున్నారు. రెండో సంతకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో బెల్టు షాపులను రద్దుచేసే ఆదేశాల మీద చేయనున్నారు. ముచ్చటగా మూడో సంతకాన్ని ఎన్టీఆర్ సుజల పథకం కింద అన్ని గ్రామాలకూ తాగునీరు ఇచ్చే ఆదేశాల మీద సంతకం చేయనున్నారు. ఇలా మూడు ముఖ్యమైన సంతకాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక సాక్షిగా నిలవనుంది.

మోడీ ఫ్యాషన్ అదుర్స్: అమెరికా మీడియా

      భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని అమెరికా మోడీ పొగడ్తలతో ముంచెత్తుతోంది. భారతదేశంలో గొప్ప ప్రజాదరణ పొందిన నేతగా మాత్రమే కాకుండా సరికొత్త ఫ్యాషన్‌కి చిరునామాగా కూడా మోడీని అమెరికా మీడియా పేర్కొంటోంది. మోడీ ధరించే కుర్తాపైజమాను ఫ్యాషన్‌కి కొత్త ట్రేడ్ మార్క్‌గా పేర్కొంటూ, మోడీని నూతన ఫ్యాషన్ సృష్టికర్తగా అమెరికా మీడియా కీర్తిస్తోంది. ఇలా కీర్తిస్తున్న అమెరికా మీడియాలో ప్రఖ్యాత టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వున్నాయి. అసలు గొప్ప నాయకుడి వేషధారణ అంటే మోడీలాగానే వుండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మోడీని భారీగా పొగిడేసింది. మోడీ అనుసరిస్తున్న ఫ్యాషన్ పంథాను ఫ్యాషన్ విద్యార్థులు ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని కూడా సూచించింది.

ఏడుగురు పిల్లల ప్రాణాలు తీసిన లిచీ పళ్ళు!

      విదేశాల నుంచి దిగుమతి అయ్యే లిచి పండు గురించి చాలామందికి తెలుసు. రేటుకూడా చాలా ఎక్కువ అయిన లిచీ పండును కొంతమంది ఇష్టంగా తింటారు. పుల్లగా వుండే ఆ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటారు. అయితే ఆ పండులో ఏర్పడే వైరస్ ప్రాణాలను తీసే అవకాశం కూడా వుంది. అవును ఇదినిజం.. రిస్క్ తీసుకోవద్దు.. లిచీ పండు తినవద్దు. దాని జ్యూస్ తాగవద్దు. ఎందుకంటే లిచీ పండు ద్వారా వ్యాపించే 'లిచీ సిండ్రోమ్' వైరల్ ఇన్పెక్షన్ కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఏడుగురు చిన్నారులు అన్యాయంగా చనిపోయారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్‌ అధికారులు వెల్లడించారు. మంగళవారం నుంచి లిచీ వైరస్ కారణంగా బెంగాల్‌లో మరణాల పరంపర మొదలైంది. ఇప్పటి వరకు ఏడుగురు పిల్లలు మరణించారు. వీరందరూ 2 నుంచి 4 సంవత్సరాల వయసు లోపు వారే! లిచీ సిండ్రోమ్ వ్యాధి సోకిన వారి మెదడు వాస్తుందని ఆ తర్వాత ఐదు నుంచి ఆరు గంటల లోపు మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి మొదట చైనాలో కనిపించింది. అప్పుడప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తూ వుంటుంది. 2012లో పశ్చిమ బెంగాల్‌లోనే ఈ వ్యాధి కనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు గానీ, పెద్దలు గానీ లిచీ పండు తినడం ఎంతమాత్రం మంచిది కాదని. రిస్కు తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే లిచీ పళ్ళు తినడం గానీ, లిచీ పళ్ళ రసం తాగడం గానీ చేసిన వారు వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.