జగన్ నిర్ణయం కరక్టే
posted on Jun 9, 2014 @ 7:25PM
నిన్నచంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాట్లాడిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అగ్ర నేత యల్.కె.అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తదితరులు చంద్రబాబును ప్రశంసించి, ఆయనతో తమకున్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని కోరుకొంటూ తమ ప్రసంగం ముగించారు. కానీ ఆ తరువాత మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇరువురూ కూడా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా గత వారం రోజులుగా తనను తీవ్రంగా విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో చురకలు వేసారు. ఒకవేళ ఆయన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్, వైకాపా నేతలు వచ్చి ఉంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో కానీ, వారు ఇటువంటి విమర్శలేవో వినవలసి వస్తుందనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒకవేళ హాజరయినా వారు కూడా తప్పనిసరిగా గవర్నర్ నరసింహన్ తో బాటే ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన వెంటనే వెళ్ళిపోవలసి వచ్చేది. ఈ కార్యక్రమానికి తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యేరు గనుక ఒకవేళ జగన్ హాజరయి ఉండి ఉంటే అవమానం ఎదుర్కోవలసి వచ్చేది. ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత తెదేపా రాజకీయ సభ నిర్వహించబోతోందనే సంగతి గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, రఘువీరారెడ్డి అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్నట్లు, ఈ కార్యక్రామానికి రామని ముందే ప్రకటించి, అవమానకర పరిస్థితులు ఎదుర్కోకుండా చాలా తెలివిగా తెప్పించుకొన్నారు. వారిరువురూ ఈ కార్యక్రమానికి హాజరు కాకూడాదని మంచి నిర్ణయమే తీసుకొన్నారని చెప్పవచ్చును.