పట్టాలు తప్పిన కావేరీ ఎక్స్ ప్రెస్
posted on Oct 23, 2012 @ 10:31AM
రైలు మెల్లగా పోతోందిలే అనుకుని అంతా హాయిగా పడుకున్నారు. పెద్ద కుదుపు.. ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు.. కన్నుపొడుచుకున్నా కనిపించని చీకటి.. ఏం జరిగిందో తెలీడం లేదు.. ప్రయాణికులంతా అయోమయంలో పడిపోయారు.. అర్థరాత్రి వేళ ఈ అవస్థ ఏంటి దేవుడా.. అని చాలామంది భయపడిపోయారు కూడా.. అసలెక్కడున్నారోకూడా తెలియని స్థితి.. ఎవరైనా ఆదుకోవడానికొస్తారోరారో కూడా తెలీని పరిస్థితి.. సిబ్బంది వచ్చి చెప్పాక కానీ తెలియలేదు.. రైలు పట్టాలు తప్పిందని.. విషయం తెలిశాక ఒక్కసారి గుండె ఝల్లుమంది.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు దగ్గర కావేరీ ఎక్స్ ప్రెస్ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. కొండ చరియలు విరిగిపడడంవల్లే ఇలా జరిగిందని టెక్నికల్ టీమ్ చెబుతున్నారు. ఇంకో ఆందోళనకరమైన విషయం ఏంటంటే రైలు పట్టాలు తప్పినచోట ఓ వైపున కొండ, మరో వైపున లోయ ఉన్నాయ్. ప్రయాణికుల అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది.. లేకుంటే అటు కొండకి ఢీకొట్టినా, ఇటు లోయలోకి జారిపోయినా ప్రాణ నష్టం వందల్లోనే ఉండేది.. కొండచరియ విరిగిపడ్డప్పుడు డ్రైవర్ శ్రీరామ్ చాకచక్యంగా బ్రేకులు వేయడంవల్ల పెను ముప్పు తప్పింది.