ఆర్మీ లెక్కల్లో భారీ అవకతవకలు
posted on Oct 24, 2012 @ 3:04PM
రక్షణశాఖ అంతర్గత ఆడిట్ లో ఆర్మీ.. ఇష్టంవచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుబారా చేసినట్టు బయటపడింది. కేవలం మూడేళ్లలో వందకోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వెలుగుచూసింది. ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ సహా ఆరుగురు కీలక ఉన్నతాధికారులు ప్రజాధనాన్ని దుబారా చేసినట్లు ఆడిట్‌లో వెల్లడైంది. 2009 - 2011 మధ్య ఆర్మీకి అవసరమైన పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయడంలో వీళ్లు నిబంధనల్ని ఉల్లంఘించారని ఆడిట్ లో తేలింది. కంప్ట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆడిట్ నివేదికల ప్రకారం బిక్రమ్‌సింగ్ , ఇతర ఆర్మీ అధికారులు ఈస్టర్న్, నార్తర్న్ ఆర్మీ కమాండ్లకు నేతృత్వం వహిస్తున్నప్పుడు పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా చైనాకి చెందిన కమ్యూనికేషన్ పరికరాలను, ఇతర సామగ్రిని భారీ ధరలకు కొనుగోలు చేయడం ద్వారా ప్రజాధనాన్ని దుబారా చేసినట్లు వెల్లడైంది. ఆర్మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ కాస్త గట్టిగానే స్పందించారు. రక్షణ శాఖ అనుమతి లేనిదే కమాండర్లు కొనుగోళ్లు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు.